October 8, 2026

పోలీస్ యూనిట్ల మెరుగైన పనితీరుతోనే జాతీయ స్థాయిలో రాణిస్తాం

  • నేరాల దర్యాప్తు, నూతన క్రిమినల్‌ చట్టాల అమలులో వెనుకబడిన యూనిట్లతో డిజిపి ప్రత్యేక సమీక్ష
  • నూతన చట్టాల అమలులో వేగం పెంచాలి
  • నేరాల నియంత్రణలో పనితీరు మెరుగుపడాలి
  • ఈ-సాక్ష్య, న్యాయసృతి ఈ-సమన్ల, జీరో ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తు పై దృష్టి
  • డిజిపి సి.వి. ఆనంద్

హైదరాబాద్‌: నూతన క్రిమినల్‌ చట్టాల అమలులో వెనుకబడిన పోలీసు యూనిట్లు పనితీరు మెరుగుపర్చుకోవాలని రాష్ట్ర డిజిపి సి. వి. ఆనంద్ సూచించారు. నూతన చట్టాల అమలుతోపాటు నేరాల నియంత్రణ, దర్యాప్తు నాణ్యత, నేర నిరూపణ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా క్రైమ్‌ ర్యాంకింగ్‌లో వెనుకబడిన యూనిట్ల కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో డిజిపి సి. వి. ఆనంద్ గురువారం సీఐడీ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

పనితీరులో మెరుగుదల సాధిస్తేనే జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకు సాధ్యమవుతుందని డిజిపి సూచించారు. గతంలో ఈగల్‌ ఫోర్స్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోపై నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో పలు సూచనలు, జాగ్రత్తలు సూచించడం, వాటిని అమలు చేయడం ద్వారా ఈగల్ , సైబర్ సెక్యూరిటీ బ్యూరో విభాగాలు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గుర్తింపు సాధించాయని పేర్కొన్నారు.

ఈగల్‌ ఫోర్స్‌ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవడంతోపాటు, సైబర్‌ నేరాల నియంత్రణలోనూ తెలంగాణ జాతీయస్థాయిలో విశేష ప్రతిభ కనబరిచి దేశానికి ఆదర్శంగా నిలిచిందని డిజిపి కొనియాడారు. ఇదే విధంగా ఇతర అంశాల్లోనూ రాష్ట్రం ముందంజలో నిలవాలంటే క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ లోపాలను గుర్తించి, సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని, అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని సూచించారు.

ఆరు అంశాలపై సమీక్ష

కేసుల పరిష్కారం, లైంగిక నేరాల ట్రాకింగ్‌ వ్యవస్థ, పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర విచారణ, నేర జరిగిన చోట ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఈ-సాక్ష్య తదితర అంశాలపై యూనిట్ల వారీగా డిజిపి సమీక్షించారు. ప్రతి అంశంలో ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. సూర్యాపేట, వనపర్తి, నిర్మల్‌, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, జీఆర్‌పీ సికింద్రాబాద్‌ తదితర యూనిట్లతోపాటు హైదరాబాద్‌, నిజామాబాద్‌, మల్కాజిగిరి, సైబరాబాద్‌, కరీంనగర్‌ కమిషనరేట్ల అధికారులు ఈ ప్రత్యేక సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

నాలుగు అంశాల ప్రాతిపదికగా ర్యాంకింగ్‌

నూతన క్రిమినల్‌ చట్టాల అమలు తీరును జాతీయ స్థాయిలో నాలుగు ప్రధాన విభాగాల ప్రాతిపదికన పర్యవేక్షిస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్‌ రిఫార్మ్స్‌కు 20 శాతం, ఆపరేషనల్‌ ఎఫిషియెన్సీకి 45 శాతం, ఐసీటీ అప్లికేషన్‌కు 25 శాతం, ఇంటిగ్రేషన్‌కు 10 శాతం వెయిటేజీ కేటాయించారు. ఈ ప్రమాణాల ఆధారంగానే రాష్ట్రాలు, పోలీసు యూనిట్ల పనితీరును అంచనా వేస్తున్నారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు, నిర్ణీత గడువులో దర్యాప్తు పూర్తి, ఆన్‌లైన్‌ చార్జిషీట్‌, ఈ-సాక్ష్య, ఈ-సమన్లు, న్యాయశ్రుతి, ఐసీజేఎస్‌ తదితర వ్యవస్థలను సమర్థంగా వినియోగించాలని డిజిపి సూచించారు.

Total Visitors: 2,899,766