-పోలవరం నిర్వాసితులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ హామీ
-సెప్టెంబర్‌లోగా పోలవరం నిర్వాసితులకు పరిహారం
-ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాం
-వెయ్యి, 2 వేల కోట్లు అయితే నేనే ఇచ్చేస్తా.. కానీ, రూ.20 వేల కోట్లు కావాలి
-రూ.20 వేల కోట్లు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాల్సిందే
-నాలుగు మండలాలకు కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నా
-20 రోజులుగా చింతూరులోనే నివాసమున్న కలెక్టర్‌కు అభినందనలు
-సహాయక చర్యల్లో పాల్గొన్న అందరికీ శిరస్సు వంచి అభినందనలు తెలుపుతున్నా
-కుయుగూరు గ్రామ ప్రజలతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి
‘‘నేను రాసిస్తా.. మానవత్వం మన ప్రభుత్వంలో మానవత్వం ఉన్నంతగా ప్రపంచంలో ఎక్కడా, ఏ ప్రభుత్వానికి లేదు. ఆ లెవల్‌లో మానవత్వం ఉన్న ప్రభుత్వం మనది. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వను, అందరికీ న్యాయం చేస్తా.. మంచి చేసేందుకే మన ప్రభుత్వం ఉన్నది’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కుయుగురు గ్రామంలో గోదావరి వరద బాధితులను సీఎం వైయస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. వరద నష్టం అంచనా మొదలుపెడుతున్నామని, రెండు నెలల్లో పరిహారం అందరికీ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎవ్వరికీ ఎలాంటి నష్టం (పంట, ఇల్లు, పశువులు) జరిగినా ఆదుకునేందుకు ప్రభుత్వం ఉందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా బాధితులతో సీఎం వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే..
‘చింతూరులో దాదాపుగా మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చినప్పుడి నుంచి నాలుగు మండలాలకు సంబంధించి 20 రోజుల నుంచి (7 నుంచి 27వ తేదీ వరకు) కలెక్టర్ ఇక్కడే ఉన్నారు. వ్యవస్థలోకి ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి గమనించండి. మామూలుగా అయితే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు కలిపి ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జేసీలు ఉండేవారు. ఈరోజు ఆరుమంది కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, సచివాలయ వ్యవస్థ, వలంటీర్లు, ఆశా వర్కర్లు ఇంతమంది ఉన్నారు. అందరూ కలిసి బాధితులకు సహాయం అందించేందుకు తపన, తాపత్రయ పడే పరిస్థితి. గతం కంటే భిన్నంగా ఉంది. అందరికీ ఏదైతే 25 కేజీల బియ్యం, పామాయిల్, టామాటా, ఉల్లిపాయలు, బంగాళాదుంప, పాలు వీటితో పాటు ఇంటింటికీ రూ.2 వేలు ప్రతి ఒక్కరికీ ముట్టిందా..? (జనం.. అందరికీ అందింది అన్నా) ఇంత పారదర్శకంగా ఎప్పుడూ జరగలేదు.
కలెక్టర్‌ను ఎన్నిరోజులు అయ్యింది ఇంటికి వెళ్లి అని అడిగితే.. 20 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను సర్ అని చెప్పారు. ఈ నాలుగు మండలాల కోసం కలెక్టర్ ఇక్కడే తిష్టవేసి.. ప్రతి గ్రామం, మండలంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. కలెక్టర్లు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు ప్రజల తరఫున, నా తరఫున, ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
మామూలుగా నాయకులు అనేవారు వస్తారు.. వచ్చి అది బాగోలేదు.. ఇది బాగోలేదని నాలుగు మాటలు గట్టిగా మాట్లాడి.. ఆఫీసర్లను సస్పెండ్ చేసి వెళ్లిపోతారు. అలా కాకుండా అధికారులకు ఏం కావాలో.. ఏ వనరులు కావాలో సమకూర్చి.. వారికి దిశానిర్దేశం చేసి.. మళ్లీ వారం రోజులకు వస్తాను.. నేను వచ్చేసరికి ఏ కుటుంబం నుంచి పలానా మంచి జరగలేదని రాకూడదని ఆదేశించాం. అధికారులు ఇక్కడే తిష్టవేసి ప్రజలను బాగా చూసుకున్నారు. వారందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
వెంటనే అందించాల్సిన సహాయం అందించాం. ఇప్పటి నుంచి గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక తీసేశారు కాబట్టి నష్ట పరిహారం అంచనా మొదలుపెడతాం. పొలాలు, ఇళ్లు ఏ ఒక్కరికీ నష్టం జరిగినా బాధ పడొద్దు, భయపడొద్దు.. మన ప్రభుత్వం ఎలా ఎగరగొట్టాలని ఆలోచన చేయదు.. ఎలా ఇప్పించాలని ఆలోచన చేసే ప్రభుత్వం మనది. వ్యవస్థ ఉంది. ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది. ప్రతి 50 ఇళ్లకు వలంటీర్ ఉన్నారు. ఏ ఒక్కరికీ ఏరకమైన ఇబ్బంది ఉన్నా.. ఏరకమైన డ్యామేజీ జరిగినా కూడా వలంటీర్ పేరు నమోదు చేసుకొని, మీ గ్రామ సచివాలయాల్లో లిస్టు కూడా పెడతారు. ఆ లిస్టు మరో రెండు వారాల్లో పెట్టేస్తారు. ఇంకో రెండు వారాలు టైమ్ ఇస్తాం.. ఎవరైనా అర్హులు మిగిలిపోతే పేర్లు నమోదు చేసుకోవచ్చు. మన ప్రభుత్వం ఎలా ఇవ్వాలనే ఆరాటపడుతుంది. ఆ తరువాత అందరినీ వెరిఫికేషన్ చేస్తారు. ఈరోజు నుంచి 6 వారాలు.. రెండు వారాల సమయం నాకు ఇవ్వండి.. మొత్తం 8 వారాలు రెండు నెలల్లో నష్టపోయిన ప్రతీది అందేలా చేస్తాం.
అంతేకాకుండా ఇక్కడున్న తాటాకు గుడిసెలు ఎక్కువగా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయినప్పుడు ఐటీడీఏ పరిధిలోకి వస్తుంది కాబట్టి.. సహాయం కూడా పెంచే కార్యక్రమం చేస్తాం. ఇంతకు ముందు రూ.5 వేలు ఉండేది.. దాన్ని రూ.10 వేలకు పెంచి మంచి జరిగించే కార్యక్రమం చేస్తాం.
పోలవరం ముంపునకు సంబంధించి అందరికీ తెలిసిన విషయమే. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ 45.72 పూర్తి నీటిమట్టం వరకు ప్యాకేజీ ఇవ్వాలంటే మరో రూ.20 వేల కోట్లు అవసరం ఉంటుంది. దాని కోసమే కేంద్ర ప్రభుత్వం కుస్తీ పడుతున్నాం. ఇప్పటికే రూ.2,900 కోట్లు ఇచ్చాం..వాటిని కేంద్రం నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం. పోలవరం పూర్తయినా ఒకేసారి నీరు నింపలేము.. డ్యామ్ సెక్యూరిటీకి ప్రమాదం కాబట్టి సీడబ్ల్యూసీ ఒప్పుకోరు. డ్యామ్ పూర్తిగా నింపకుండా ఒక స్టేజీ వరకు నింపుతాం. దాని తరువాత మూడు సంవత్సరాల్లో నింపాలి. నీరు పూర్తిగా నింపే సమయం వచ్చేసరికి.. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా.. మంచి జరిగించే కార్యక్రమం చేస్తాం. ఆలోగా కేంద్రం కూడా డబ్బులు ఇచ్చేలా ఒత్తిడి తీసుకువస్తాం. ఆ స్థాయిలో డబ్బులు రాలేకపోతే.. నీరు అయినా నింపకుండా ఆపుతా.. లేదా డబ్బు ఇచ్చిన తరువాతే నింపే కార్యక్రమం చేస్తాం. అవసరం అయితే సొంతంగా ఇచ్చైనా కచ్చితంగా మీకు తోడుగా ఉంటా.
పోలవరం నిర్వాసితులు చేసిన త్యాగంతోనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తిని కాబట్టే కచ్చితంగా ఎట్టిపరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వను. కేంద్రం నుంచి డబ్బులు రాబట్టే ప్రయత్నం చేస్తాం. సెప్టెంబర్ వరకు 41.15 లెవల్ వరకు అందరికీ పీడీఎఫ్‌లు కట్టేస్తాం.. ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి.. ఇళ్లు కూడా తయారు చేపించి షిప్టింగ్ కార్యక్రమం కంప్లీట్ చేస్తాం.
వెయ్యి, రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఇంతగా ఆలోచన చేసేవాడిని కాదు. కేంద్రం ఇచ్చినా.. ఇవ్వకపోయినా నేను ఇచ్చి తోడుగా ఉండేవాడిని. రూ.20 వేల కోట్లకు సంబంధించిన అంశం కాబట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తాం. నాలుగు మండలాలకు సంబంధించి ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తాం’ అని సీఎం వైయస్ జగన్ బాధితులకు భరోసా ఇచ్చారు.