– చీఫ్ మెడికల్ ఆఫీసర్ టి.సిహెచ్.కోటేశ్వరరావు
మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో సిజిహెచ్ఎస్ ( సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ) వెల్ నెస్ సెంటర్ ను మరింతగా అభివృద్ధి చేస్తామని సిజిహెచ్ఎస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.సిహెచ్.కోటేశ్వరరావు పేర్కొన్నారు.
సోమవారం ఉదయం నగరంపాలెం లోని సిజిహెచ్ఎస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటైన లాబొరేటరీ మరియు ఇంజెక్షన్, బి.పి పరీక్షా కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిజిహెచ్ఎస్ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ బి.హేమా సుందరి అధ్యక్షత వహించారు.
సి.ఎం.ఓ డాక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ..కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా, సిజిహెచ్ఎస్ ఆరోగ్య కేంద్రాలను, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరింత మెరుగైన స్థితికి తీసుకువస్తామన్నారు. క్రమంగా పురోగతి సాధించటానికి మరిన్ని నూతన వైద్య పరికరాలు సమకూర్చుకొని, ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య సంరక్షణకు మరింతగా కృషి చేస్తామన్నారు.
సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి.విద్య మాట్లాడుతూ..నూతన ప్రారంభోత్సవాల ద్వారా మరిన్ని వైద్య సౌకర్యాలకు అంకురార్పణ జరిగిందన్నారు. ప్రతి పేషంట్ ఆరోగ్య సంక్షేమమే తమ లక్ష్యమన్నారు.
సిజిహెచ్ఎస్ లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గుమ్మడి సీతారామయ్యచౌదరి మాట్లాడుతూ..సిజిహెచ్ఎస్ లో ఎప్పుడూ లేని విధంగా మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల లో ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో సిజిహెచ్ఎస్ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ బి.హేమా సుందరి, ఫార్మాసిస్ట్లు అయోషా బేగం, సునీల్, లాబొరేటరీ అసిస్టెంట్లు మురళీ, రామారావు, సిబ్బంది మోహన్, మక్బూల్, వెంకటేశ్వర్లు, రత్నరాజు, నందమణి తో పాటు పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు.