– పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తాం
– మావోయిస్టులు తుపాకీ వీడాల్సిందే
– జన జీవన స్రవంతిలో కలవాల్సిందే
– మీడియాతో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్: రాజ్యాంగంలోని 73వ, 74వ సవరణల ప్రకారం, స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఉండి సమావేశాలు నిర్వహించాల్సిందే. అలా ఉన్నప్పుడే 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుండి విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసి 21 నెలలు దాటినా, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలకవర్గాలు లేవు.
దాంతో పంచాయతీలకు రావాల్సిన దాదాపు రూ. 4,000 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు జరిపి పాలకవర్గాలు ఏర్పాటు చేసినప్పుడే ఆ నిధుల విడుదల సాధ్యం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. కామారెడ్డిలో BC Declaration పేరుతో బీసీల ఓట్లు పొందడానికే ఉపయోగించుకుంది తప్ప-రిజర్వేషన్లు ఇవ్వడానికి తగిన న్యాయపరమైన చర్యలు మాత్రం తీసుకోలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు కాంగ్రెస్ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా, కేవలం పార్టీ స్థాయిలోనే ఇస్తామన్న ధోరణి అన్యాయం.
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఇతర పార్టీలపై మోపడానికి ప్రయత్నించడం సరైనది కాదు. కనీసం ఇప్పుడైనా సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలి. భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న కార్యకర్తలు, నాయకులకు సంబంధించి అన్ని వివరాలను పరిశీలించి, పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తాం. బీసీలకు పెద్దపీట వేస్తాం. భారతీయ జనతా పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేసి బీసీ అభ్యర్థులకు పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉంది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ‘కగార్’ ద్వారా దేశంలో ఉగ్రవాదం, మావోయిస్టు చర్యలను నిర్మూలించే దిశగా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది. గత అనేక దశాబ్దాలుగా మావోయిస్టులు పేదలను, దళితులు, గిరిజనులను, పోలీసులను, పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో అనేక మంది ప్రజలను… అదేవిధంగా బిజెపి, ఏబీవీపీ కార్యకర్తలను అనేకమందిని పొట్టనబెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మావోయిస్టులకు తుపాకులు వదిలి వచ్చే మార్చి 31లోగా లొంగిపోవాలని బలంగా హెచ్చరిక జారీ చేసింది. వారికి లొంగిపోవడానికి అవకాశం కూడా ఇచ్చింది. అందుకే మావోయిస్టులు తుపాకీ వీడాల్సిందే. జన జీవన స్రవంతిలో కలవాల్సిందే. దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తోంది. అయితే, మావోయిస్టులు కొంతమంది దుష్టశక్తుల మాటలు నమ్మి సరెండర్ కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. తక్షణమే తుపాకీ వీడి, ప్రజల జీవితంలో కలవాలి.