మంగళగిరి: గంజాయిపై మాట్లాడితే పోలీసులు ఆధారాలు అడుగుతున్నారు. మేం ఆధారాలు ఇస్తాం.. పోలీసులు యూనిఫాం తీసేయాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా కార్యాలయాలపై వైకాపా దాడులను నిరసిస్తూ ‘ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం’ పేరుతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 36 గంటల దీక్ష చేశారు. దీక్ష ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా తీరుపై మండిపడ్డారు. మాది ధర్మపోరాటం.. ముమ్మాటికీ విజయం తమదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు కదిలి వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
ఉన్మాదంతో రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు
‘‘ప్రజా దేవాలయమైన ఎన్టీఆర్ భవన్‌పై దాడి చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో 70లక్షల కార్యకర్తల మనోభావాలు ఉన్నాయి. పోలీసు బెటాలియన్ దగ్గరలోనే దాడి జరిగింది. ఏపీలో రూ.లక్ష కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయి. విదేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయని తెలిసినా పట్టించుకోవడం లేదు.మద్యం రేట్లు భారీగా పెంచారు. రూ.60 మద్యం రూ.200 చేశారు. మత్తుకు బానిసై కొవిడ్ వేళ శానిటైజర్లు తాగారు. అధికారానికి భయపడి సీఎంకు అంతా లొంగిపోవాలా? తెదేపా హయాంలో మద్యం నియంత్రణ పారదర్శకంగా జరిగింది. డ్రగ్స్‌పై తెలంగాణ సీఎం సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని అక్కడి సీఎం సమీక్ష చేశారు. సీఎం జగన్‌కు డ్రగ్స్‌పై సమీక్ష నిర్వహించే తీరిక లేదా? డీజీపీకి హైకోర్టు అక్షింతలు వేసినా సిగ్గు అనిపించడం లేదా? రాజకీయం కోసం జగన్ తల్లిని, చెల్లిని ఉపయోగించుకున్నారు. జైలుకెళ్లినప్పుడు జగన్ తన తల్లిని ఊరూరా తిప్పారు. జగన్ తన చెల్లిని జగనన్న బాణం అని యాత్రలు చేయించారు. జగనన్న వదిలిన బాణం ఇప్పుడు తెలంగాణలో తిరుగుతున్నారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్రానికేం చేస్తారు? పట్టాభి మాటలకు వైకాపా నేతలు కొత్త అర్థాలు చెబుతున్నారు. వివేకాను నేనే చంపించానని గతంలో జగన్ ఆరోపించారు.
జగన్ ఉన్మాదంతో రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. కోర్టు చీవాట్లు పెట్టినా, మొట్టికాయలు వేసినా పట్టించుకోని దుర్మార్గుడు జగన్. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ బూతులు మాట్లాడలేదు. సీఎంగా ఉన్నప్పుడు అమరావతికి బస్సులో వెళ్లిన నాపై దాడి చేయించారు. ఫోన్‌లో మాట్లాడేందుకు గవర్నర్, కేంద్ర హోం మంత్రికి సమయం దొరికినా డీజీపీకి టైమ్ దొరకలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉగ్రవాదానికి లొగిపోవాలా? ఉక్కు సంకల్పంతో కార్యకర్తలు పోరాటానికి సిద్ధం కావాలి. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ వేస్తా. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన వారు ఎక్కడ దాక్కున్నా చట్ట ప్రకారం శిక్షిస్తాం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఎన్జీవోలు పోరాటానికి ముందుకు రావాలి. రాష్ట్రాన్ని కాపాడుకుందాం’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. చంద్రబాబు దీక్షకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.