Suryaa.co.in

Andhra Pradesh

డ్వాక్రా సంఘాలకు మరింత చేయూతనిస్తాం

• వచ్చే ఐదేళ్లల్లో పేదల ఆదాయం రెట్టింపు చేసేలా ప్రణాళికలు
• పేదరిక నిర్మూలనకు నిజమైన లబ్ధిదారుల ఎంపికకు ఎస్ హెచ్ జి ప్రొఫైలింగ్ యాప్ తోడ్పాటు
• జనవరి నుంచి అమరావతి రాజధాని పనులు
• రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. పి. నారాయణ

విజయవాడ: పేద ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అమలు చేయాలంటే ప్రజల స్థితిగతులపై పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాలని, అప్పుడే ఆశించిన ఫలితాలు సాధించగలమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు.

మహాత్మా గాంధీ రోడ్డులోని అమరావతి కన్వెన్షన్ హాల్ లో మెప్మా స్వయం సహాయక సంఘాల ప్రొఫైలింగ్ యాప్ పై ఒకరోజు శిక్షణా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ వర్క్ షాపుకి మంత్రి పి. నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ డ్వాక్రా, మెప్మా సంఘాల సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తారని… వారి ఆర్థిక పరిస్థితి బాగుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుందని బలంగా నమ్ముతారన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆదాయం రెట్టింపు కావాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. అందుకు అనుగుణగా మెప్మాలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని అమలు చేస్తున్నామన్నారు.

ప్రభుత్వం అందించే పథకాలు సక్రమంగా పేద ప్రజలకు చేరువ కావాలంటే డేటా ప్రొఫైలింగ్ ఎంతో అవసరమన్నారు. సభ్యుల డేటా ఆధారంగా ఎవరెవరికి ఎలాంటి పథకాలు, ప్రభుత్వం అందించాలనే దానిపై స్పష్టత వస్తుందన్నారు. గత ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ను నిర్లక్ష్యం చేసిందన్నారు. పేదల కోసం తలపెట్టిన టిడ్కో ఇళ్లను కూడా లబ్దిదారులకు అందించలేదన్నారు.

ప్రొఫైల్ యాప్ ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యుల డేటా నవంబర్ కు పూర్తి అవుతుందని, డిసెంబర్ నెలాఖరు నాటికి డేటా బేస్ మొత్తం సిద్ధం అంతుందన్నారు. జనవరి నుంచి సభ్యుల డేటా ప్రకారం ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామన్నారు. అమెరికాలో అయితే పౌరులకు యూనిక్ నెంబర్ ఉంటుందని, దాని ప్రకారం వారి సమాచారం సేకరించవచ్చని, ఇండియాలో అయితే ఆధార్ నంబర్ ద్వారా సమాచారం వస్తుందన్నారు.

ఏదైనా పాలసీ చేయాలన్నా, పథకాలు అందించాలన్నా ప్రభుత్వం వద్ద పౌరుల సామాజిక, ఆర్ధిక స్థితి ఎలా ఉందనే సమాచారం ఉంటే ఎవరికి ఏ పథకాలు అందించాలో అనేదానిపై పూర్తి అవగాహన ఉంటుందన్నారు. మెప్మా ఏపీ లో 2 లక్షల 78 వేల 407 స్వయం సహాయక సంఘాలున్నాయని అందులో మొత్తం సభ్యులు 28 లక్షల 56 వేల 651 మంది ఉన్నారన్నారు.

గత ఐదేళ్లలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన డేటా ప్రాసెస్ సరిగా జరగలేదన్నారు. దీనివల్ల సభ్యుల బ్యాంక్ అకౌంట్ లు, లోన్ వివరాలతోపాటు వారికి సంబంధించిన ఇతర డేటా సరిగా లేదన్నారు. అందుకే నిజమైన లబ్ధిదారులను గుర్తించి, సభ్యులకు సంబంధించిన సామాజిక, ఆర్థిక స్థితి గతులపై ఖచ్చితమైన డేటా తీసుకోవడం ద్వారా పేదరిక నిర్మూలనకు సహాయపడుతుందన్నారు. టిడ్కో ఇళ్లు నిర్మించిన చోటే వారు ఉపాధి పొందే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మిస్తే వారు పట్టణాలకు వచ్చే అవకాశం ఉండదని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఆవిధంగా చర్యలు చేపడతామన్నారు.

గత ప్రభుత్వం అమరావతి రాజధాని పనులపై అశ్రద్ధ వహించిందని, అప్పట్లో ఇచ్చిన టెండర్లుకు కాలపరిమితి పూర్తి అయ్యిందని, అందుకే ఆ టెండర్లు రద్దు చేసి మరలా క్యాబినెట్ ఆమోదంతో టెండర్లు పిలుస్తామన్నారు. ఈ ప్రక్రియ అంతా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు పూర్తి అయి, జనవరి నుంచి రాజధాని పనులు మొదలుపెడతామని మంత్రి నారాయణ తెలియజేశారు. వర్క్ షాపులో మెప్మా ఎండీ తేజ్ భరత్, అన్ని జిల్లాల పీడీ లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE