Suryaa.co.in

Andhra Pradesh

పట్టణాభివృద్ది సంస్థల పరిధిలో మౌలిక వసతులను మెరుగుపరుస్తాం

•నెల్లూరు, కడప లేఅవుట్ల అవకతవకలకు బాధ్యులైన వారిపై చర్యలు
•తణుకులో పరిమితికి మించి రూ.700 కోట్ల మేర టిడిఆర్ బాండ్లు జారీ
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ

అమరావతి: రాష్ట్రంలో ఉన్న 20 పట్టణాభివృద్ది సంస్థల పరిధిలో మౌలిక వసతులను మెరుగు పర్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ మేరకు సంబందిత సంస్థల అధికారులతో నేడు సమీక్ష నిర్వహించి వాటి ఆర్థిక స్థితిగతులు, మౌలిక వసతుల మెరుగుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించడం జరిగిందని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థలు (Urban Local Bodies) ఉన్నాయని, వీటిలో మండపేట మున్సిపాలిటీ మినహా మిగిలిన 122 పట్టణ స్థానిక సంస్థలు పట్టణాభివృద్ది సంస్థల పరిధిలో వస్తున్నాయని, ఇవి అన్నీ రాష్ట్ర విస్తీర్ణంలో 85 శాతం మేర విస్తరించి ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఒక సిఆర్డిఏ మరియు 20 పట్టణాభివృద్ది సంస్థలు ఉన్నాయని, వాటి పరిధిలో ఉండే లేఅవుట్లలో విద్యుత్, రోడ్లు, త్రాగునీరు, పార్కులు, మురుగునీటి పారుదల వ్యవస్థలు ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అయితే ఆయా సంస్థల నిధులను కూడా గత ప్రభుత్వం డైవర్టు చేసి పలు రకాలుగా వినియోగించుకోవడం వల్ల లేఅవుట్లలో మౌలిక వసతులు మెరుగు కాకపోవడమే కాకుండా ఆయా సంస్థలు నిర్వీర్యం అయ్యే దశకు చేరుకున్నాయన్నారు.

ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పట్టణాభివృద్ది సంస్థల పునరుత్తేజానికి, పనితీరును మెరుగు పర్చే విధంగా పలు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. నెల్లూరు, కడప లేఅవుట్లలో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించి విచారణా కమిటీని వేయడం జరిగిందని, ఆ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే అవకతవకలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

అదే విధంగా తణుకులో టిడిఆర్ బాండ్ల జారీలో పెద్ద ఎత్తున అవకతవకవలు జరిగాయని, నిజానికి రూ.36 కోట్ల విలువైన టిడిఆర్ బాండ్లను జారీ చేయాల్సి ఉండగా రూ.700 కోట్లకు పైబడి టిడిఆర్ బాండ్లను జారీచేయడం జరిగిందన్నారు. ఫలితంగా బాండ్లు కొన్న వారు పలు ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుచున్నదన్నారు.

ఈ విషయంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎం.ఐ.జి. గృహాల నిర్మాణ పనులు కూడా ఆర్థిక సమస్యల వల్ల వివిధ దశల్లో నిలిచిపోయాయని, ఈ సమస్యను కూడా పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు మంత్రి తెలిపారు.

గ‌తంలో తమ ప్రభుత్వ హయాంలో ప్ర‌తి ఇంటికీ 24 గంటల పాటు త్రాగు నీరు అందించడంతో పాటు ముగునీటి పారుదల పైపులు, ముగురు నీటి శుద్ది ప్లాంట్లు, వరద నీరు పారుదల కాలువలు ఏర్పాటు పనులను చేపట్టడం జరిగిందన్నారు. దీనికోసం ఏషియ‌న్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ద్వారా రూ.5,300 కోట్లు కేటాయించామ‌న్నారు. అయితే ఈ నిధుల్లో గత ప్రభుత్వం కేవలం రూ.240 కోట్లను మాత్రమే వెచ్చించి మిగిలిన నిధుల వినియోగానికి రాష్ట్ర వాటాను కేటాయించకుండా నిరుపయోగంగా వదిలేసిందన్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తి అయి ఉంటే కనీసం 50 శాతం మున్సిపాలిటీల్లో త్రాగునీటి సమస్య ఉండేది కాదన్నారు. గత నెలాఖరు కల్లా ఆ ప్రాజక్టు అమలు గడువు కూడా ముగిసిందన్నారు. ఈ ప్రాజెక్టు క్రింద మిగిలిన నిధులను ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టు కాలపరిధిని పెంచాలని కోరుతూ ఏషియ‌న్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు కు లేఖ వ్రాయడం జరిగిందన్నారు.

అదే విధంగా లక్ష లోపు జనాభా ఉన్న నగర పంచాయితీల్లో మౌలిక వసతుల మెరుగుకు అమృత్-I&II ప్రాజక్టులను తమ ప్రభుత్వ హయాంలో చేపట్టగా, గత ప్రభుత్వం ఆ ప్రాజక్టులను కూడా నీరుగార్చిందన్నారు. అమృత-I పథకం క్రింద చేపట్టిన పనులను అసంపూర్తి గా వదిలేయడం జరిగిందని మరియు అమృత్-II పథకం క్రింద ఎటు వంటి పనులను ప్రారంభించ కుండా వదిలేసిందన్నారు.

అదే విధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు మాసాలకు సంబందించి 15 వ ఆర్థిక సంఘం నిధులు రూ.500 కోట్లు వచ్చాయన్నారు. సెప్టెంబరు – మార్చి ఆరు మాసాలకు సంబందించి మరో రూ.550 కోట్లు, తదుపరి ఆరు మాసాలకు సంబందించి మరో రూ.550 కోట్లు వెరసి మొత్తం రూ.1100 కోట్లు వస్తే ఆ నిధులను కూడా పూర్తిగా మళ్లించి బిల్లులను కూడా సబ్మిట్ చేయకుండా వదిలేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నట్లు మంత్రి తెలిపారు.

అదే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దాదాపు 9 లక్షల టిడ్కో గృహాలను నిర్మించేందుకు తమ హయాంలో మంజూరు చేయడం జరిగిందన్నారు. వాటి నిర్మాణాలను కూడా అసంపూర్తిగా గత ప్రభుత్వం వదిలేయడం జరిగిందన్నారు. ఈ పధకాలు అన్నింటినీ పున: ప్రారంభించేందుకు త్వరలో తగు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.

రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆనందరావు ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE