– బీసీల జనాభాను సుమారు 50లక్షల వరకు తక్కువ చేసి చూపారు
– ఎంపీ వద్దిరాజు
హైదరాబాద్: కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకిచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో, విద్యా,ఉద్యోగ,ఉపాధి రంగాలలోనే కాకుండా కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్స్ కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా ప్రకటించి,తీరా అధికారం చేపట్టాక అమలు చేయకుండా మోసగిస్తున్నదన్నారు.
బీఆర్ఎస్ అధి నాయకత్వం ఆదేశాల మేరకు రిజర్వేషన్స్ సాధనకు, రాజ్యాధికారంలో న్యాయమైన వాటా కోసం పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ఎంపీ రవిచంద్ర తెలంగాణ భవన్ లో సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ఎంపీ వద్దిరాజు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి,మాజీ మంత్రులు జోగు రామన్న,వీ.శ్రీనివాస్ గౌడ్ తదితర ప్రముఖులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
కులగణన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరించి బీసీల జనాభాను సుమారు 50లక్షల వరకు తక్కువ చేసి చూపారని ఆవేదన వ్యక్తంచేశారు. బిల్లు, ఆర్డినెన్స్,జంతర్ మంతర్ వద్ద ధర్నా,జీవోలంటూ రేవంత్ రెడ్డి నటిస్తూ బీసీలను దగా చేస్తుంటే,వారి నాయకుడు రాహూల్ గాంధీ బీహార్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేస్తున్నామంటూ చెప్పడం తీవ్ర అభ్యంతరకరమని ఎంపీ రవిచంద్ర చెప్పారు.
కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి,కేంద్రంలోని బీజేపీ సర్కార్ తల్చుకుంటే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడమనేది ఏ మాత్రం సమస్య కాదని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు. రిజర్వేషన్ పెంపుదలకు పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా అన్ని రాజకీయ పార్టీలపై మరింత వత్తిడి పెంచుతామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,కరీంనగర్ జేడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ,బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కోతి కిశోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.