– పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
– స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్‌ను పరిశీలించిన మంత్రి టి.జి భరత్
కర్నూలులో రాష్ట్ర స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ సేవలను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. కర్నూల్ మెడికల్ కాలేజీ ఆవరణలోని రాష్ట్ర స్థాయి క్యాన్సర్ హాస్పిటల్‌ను జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పలు విభాగాలు తిరిగి సమస్యలు తెలుసుకున్నారు.
పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ 2019 జనవరిలో సీఎం చంద్రబాబు నాయుడు స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. ఇప్పుడు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడుతున్నట్లు చెప్పారు.
రాష్ట్ర స్థాయి క్యాన్సర్ హాస్పిటల్లో అత్యున్నతమైన వైద్య సేవలు ప్రజలకు అందేలా అన్ని విధాలా చర్యలు తీసుకుంటామన్నారు. రోగులు వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉచితంగా వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.