Suryaa.co.in

Andhra Pradesh

భావ సారూప్యత వున్న పార్టీలతో కలిసి ముందుకు నడుస్తాం

– ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
-20 వేల కోట్లు షెల్‌ కంపెనీల ద్వారా ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలి
– డా॥కె.వి.పి. రామచంద్రరావు

విజయవాడ: కాంగ్రెస్‌ పార్టీతో కలిసి వచ్చే భావ సారూప్యత గల పార్టీలతో ముందుకు నడుస్తామని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మీడియాకు తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ దేశంలోనూ, రాష్ట్రంలో బలమైన కాంగ్రెస్‌ పార్టీ సమస్యలపై పోరాడుతూనే ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని గళమెత్తి ప్రశ్నించినందుకే రాహుల్‌ గాంధీ పైన సస్పెన్షన్‌ వేటు వేశారని, మోదీ ప్రభుత్వం పిరికిపంద ప్రభుత్వమని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏప్రిల్‌ నెలలో ప్రణాళికల ప్రకారం పార్టీ కార్యక్రమాలను వివరించారు.

మాజీ పార్లమెంటు సభ్యులు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు డా॥కె.వి.పి. రామచంద్రరావు మాట్లాడుతూ 20 వేల కోట్లు షెల్‌ కంపెనీల ద్వారా ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్‌ చేశారు.రాహుల్‌ గాంధీ అడిగిన ప్రశ్నలకు పార్లమెంటులో జవాబు చెప్పలేని కేంద్ర ప్రభుత్వం, అన్యాయంగా రాహుల్‌ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయటమే కాకుండా క్వార్టర్స్‌ ఖాళీ చేయమని ఆదేశాలివ్వడం ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ జరగలేదని విచారం వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఖబడ్దార్‌ అంటూ ఆయన హెచ్చరించారు.

విలేకరుల సమావేశానికి ముందుగా ఆంధ్రరత్న భవన్‌ నందు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగినది. ఈ సమావేశానికి ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అధ్యక్షత వహించారు.
మీడియా సమావేశం తదుపరి సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద వున్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి అనంతరం ఏపిసిసి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ డిపార్టమెంట్ల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ఏఐసిసి కార్యదర్శులు మరియు ఏపి వ్యవహారాల బాధ్యులు సి.డి.మెయ్యప్పన్‌, ఎమ్‌.క్రిస్టోఫర్‌ తిలక్‌, ఏఐసిసి కార్యదర్శి జె.డి.శీలం, ఏపిసిసి మీడియా & సోషల్‌ మీడియా కమిటి చైర్మన్‌ డా॥ఎన్‌.తులసిరెడ్డి, ఏపిసిసి కార్యనిర్వహక అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE