– బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను కాపాడాలి
– బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం
– విభజన చట్టం 11వ షెడ్యూల్ ప్రకారం కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలి
– వైయస్సార్ కడపలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
వైయస్సార్
కడప: బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీల నికర జలాల్లో ఏపీకి ఒక్క టీఎంసీ తగ్గినా ఊరుకునేది లేదని, దానికి సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని వైయస్సార్ కడప జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైయస్సార్ కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించడం అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం చట్టవిరుద్ధమని, బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని విభజన చట్టం 11వ షెడ్యూల్ చెప్పిందని వివరించారు.
కేడబ్ల్యూడీటీ-2కు కేంద్రం 2023లో జారీ చేసిన అదనపు మార్గదర్శకాలు చట్టవిరుద్ధమని గతంలో వైయస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులు కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని మండిపడ్డారు. కేడబ్ల్యూడీటీ–2లో తుది వాదనలనైనా సమర్థంగా వినిపించాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాత అన్నివిధాలుగా నష్టపోతున్నాడని, అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటే బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్న కనీస జ్ఞానం చంద్రబాబు లేకుండాపోయిందని రవీంద్రనాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం-1956 బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం.
దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. ఇదే అంశాన్ని కేడబ్ల్యూడీటీ–-2 కేంద్రానికి ఇచ్చిన తుది నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు ట్రిబ్యునళ్లు చేసిన నీటి కేటాయింపులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టంగా పేర్కొంది. అందుకే వాటిని సవాల్ చేస్తూ నాడు వైయస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపించకపోవడం వల్లే.. కేంద్రం జారీ చేసిన అదనపు విధి విధానాల ప్రకారం విచారణ చేయాలని, తమ తీర్పునకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుందని సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా తుది వాదనలు వినిపించటానికి చర్యలు తీసుకోవాలి.
చంద్రబాబు సీఎం అయినప్పుడల్లా రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతూనే ఉంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కర్ణాటకలో కృష్ణా నదిపై ఉన్నఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పని మొదలుపెట్టారు. దీనివల్ల డ్యామ్‌లో 100 టీఎంసీల అదనపు నిల్వ సామర్థ్యం ఏర్పడుతుంది. అది మన రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ తీస్తుందంటూ రైతులతోపాటు విపక్షాలు ఎంత ఆందోళన వ్యక్తం చేసినా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టారు. ఆ తర్వాత 2000లో బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగుస్తుండడంతో కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడింది. ఆ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వచ్చింది.
రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాకు మేలు చేసేలా హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ ప్రాజెక్టు.. తెలంగాణ ప్రాంతంలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఎత్తిపోతల పథకం, శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టులు చేపట్టాలన్న డిమాండ్లు వచ్చాయి. కానీ, చంద్రబాబు అవేవీ పట్టించుకోలేదు. సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అవన్నీ పునాదిరాళ్లకే పరిమితం అయ్యాయి. అప్పుడు కేవలం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకునేందుకు కర్ణాటక ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీలు నికర జలాల్లో.. ఒక్క టీఎంసీ తగ్గినా దానికి చంద్రబాబే బాధ్యత వహించాలి.