Suryaa.co.in

Telangana

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తం

– ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతాం
– ప్రాజెక్టుల అవినీతిని నిలదీస్తాం
– సీఎల్పీ సమావేశంలో భట్టి వెల్లడి
– నీళ్ల దోపిడీపై సర్కారు ఉదాసీనత

నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో నెరవేరని ప్రజల ఆకాంక్షల గురించి సోమవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. టిఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగడతామని వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్మాణాల పేరిట జరుగుతున్న అవినీతి, దోపిడి గురించి సర్కార్ ను నిలదీస్తామన్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ ముఖ్య నేతలతో హైదరాబాదులోని తాజ్ దెక్కన్ హోటల్లో సీఎల్పీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్
revanth కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, పొదెం వీరయ్య, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, డిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, కాంటెస్ట్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరై బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు.

ఎనిమిదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అమలు చేయని ఎన్నికల వాగ్దానాలు, బడ్జెట్ కేటాయింపుల్లో జరుగుతున్న అసమానతలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల అవినీతి, కరెంటు చార్జీల ప్రతిపాదన, కృష్ణ, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను ఉపసంహరణ చేయాలని, ఉద్యోగ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, నకిలీ విత్తనాలు, అభయహస్తం, వడ్డీలేని రుణాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా దారి మళ్లించిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, దళిత బంధు అంశాలపై సుదీర్ఘంగా ఈసమావేశంలో చర్చించారు.

నియోజకవర్గాల వారీగా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించారు. ప్రజాసమస్యల పరిష్కారానికై కాంగ్రెస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అసెంబ్లీ లోపల, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ బయట ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చేయాల్సిన ఉద్యమ వ్యూహాలను తయారు చేశారు.

ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. “నేనే రాజు… నేనే మంత్రి.. రాష్ట్ర పరిపాలన నా ఇష్టం అన్నట్టుగా, నీయంతగా వ్యవహరిస్తున్న” కేసీఆర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా చేసిన తీరుపై మండిపడ్డారు. కొత్త రాజ్యాంగం రాయాలని ఇటీవల ప్రకటించిన కేసీఆర్ బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం లేకుండా చట్టవిరుద్ధంగా తన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి అంచనా వ్యయాలను పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన జాతీయ హోదా రాకుండా పోవడానికి కేసీఆర్ కారణమయ్యారని తెలిపారు.

సంగమేశ్వర దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట ఆంధ్ర సర్కార్ నీళ్లను తరలించడం వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారి పంట పొలాలు బీడు భూములుగా మారే ప్రమాదం ఉందన్నారు. నీళ్ళు దోపిడి జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ అసెంబ్లీలో చర్చకు లేవనెత్తుతామని తెలిపారు. నాలుగు కోట్ల ప్రజలకు దక్కాల్సిన నిధులు పాలనలో ఉన్న కొద్ది మంది పాలకులు దోపిడి చేస్తున్నారని, ఆ సంపద ప్రజలందరికీ పంచే విధంగా తమ పోరాటం ఉంటుందన్నారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనలు టిఆర్ఎస్ సర్కార్ తాజా రాజకీయ లబ్ది కి ఉపయోగపడే విధంగా తెచ్చింధన్నారు.

అర్హులైన లబ్ధిదారులకు దళిత బంధు పారదర్శకంగా అందే విధంగా సర్కారు మార్గదర్శకాలు జారీ చేసే విధంగా పాలకుల మెడలు వంచుతామని ప్రకటించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు వారి జిల్లాలో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారని వాటి పరిష్కారానికి అసెంబ్లీ వేదికగా సిఎల్పీ పోరాడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మాజీ మంత్రులు చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE