-
యూపీఎస్సీ మెయిన్స్ కు ఎంపికైన వారికి లక్ష రూపాయల ప్రోత్సాహం అందిస్తాం
-
సివిల్స్ కు మనవాళ్లు ఎక్కువమంది ఎంపికైతే రాష్ట్రానికి ప్రయోజనం
-
సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం హైదరాబాదులోని అశోక్ నగర్ లో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగించారు.
ఈ రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే ఉద్యోగాల సాధన కోసం అని అన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని తరహాలో ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తున్నామని చెప్పారు . ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామో ముందే తెలియజేస్తున్నామని ఆ పనిలో భాగంగా ఇప్పటికే గ్రూప్ -1 పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని, గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించబోతున్నామని వెల్లడించారు.
ప్రశ్నాపత్రాల లీకేజీ, ఇతర ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో విజయవంతంగా ఉద్యోగాల భర్తీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మేధస్సు ఉన్నప్పటికీ నిరుపేదలు, మధ్య తరగతి వర్గాలవారు ఆర్థిక ఇబ్బందులతో యుపిఎస్సి పరీక్షలను సాధించడంలో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారిని ఆర్థికంగా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా మన రాష్ట్రం నుంచి మెయిన్స్ కు ఎంపికైన వారికి ఇంధన శాఖ పక్షాన ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంగా అందించినట్లు తెలిపారు. మెయిన్స్ సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి కూడా లక్ష రూపాయలు ప్రోత్సాహంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మెటీరియల్, ప్రత్యేక శిక్షణ వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు వివరించారు. సివిల్ సర్వీస్ కు మన రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఎంపిక అయితే మన ప్రాంతానికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
సివిల్ సర్వీస్ అయినప్పటికీ పాలనలో మనవాళ్లు ఎంత ఎక్కువ మంది ఉంటే ప్రాంతీయ అభిమానంతో సంక్షేమ పథకాలు, బడ్జెట్ రూపకల్పన, ఇతర అంశాల ద్వారా మన రాష్ట్రానికి అంత ఎక్కువ లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందన్నారు.
యూపీ క్యాడర్లో పనిచేస్తున్నప్పటికీ ప్రాంతీయ అభిమానంతో తెలుగు వారైన మోహన్ రావు, అరుణ ల ఆధ్వర్యంలో హైదరాబాదులో యుపిఎస్సి కోచింగ్ సెంటర్ ప్రారంభించడం అభినందనీయం అన్నారు. ఎ అంశాలపై దృష్టి పెట్టి, ఎలా చదివితే ఎంపిక అవుతామో తెలుసుకుంటే ఎక్కువమంది సివిల్ సర్వీసెస్ కు ఎంపిక అయ్యే అవకాశం ఉంటుందన్నారు.
ఉత్తర భారత దేశంలో ఎక్కువ అకాడమీలు అందుబాటులో ఉండడంతో ఆ రాష్ట్రాల నుంచి సివిల్ సర్వీసెస్ కు ఎక్కువమంది ఎంపిక అవుతున్నారని తెలిపారు. మన రాష్ట్రానికి మేలు జరగాలంటే పెద్ద సంఖ్యలో సివిల్స్ కోచింగ్ అకాడమీలు రావలసిన అవసరం ఉందన్నారు.