– ఆదిలాబాద్ కు సాగునీరు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది
– వీలైతే జూన్ 2 నాటికి ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శిలాఫలకం వేసే బాధ్యత
– త్వరలోనే ఆదిలాబాద్ లో యూనివర్సిటీ ఏర్పాటుకు శంకుస్థాపన
– మేం పాలకులం కాదు… ప్రజల సేవకులం.
– ఆదిలాబాద్ “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ” బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ : పీసీసీ అధ్యక్షుడిగా నిర్మల్ లో నిరసన తెలిపినా, ఇంద్రవెల్లి దండోరా పెట్టినా, భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహించినా ప్రజా సమస్యల పరిష్కారించాలనే. జల్ జంగల్ నినాదంతో పోరాట స్ఫూర్తిని చాటిన కొమురం భీమ్ గడ్డ ఇది. అభివృద్ధికి నోచుకోని ఆదిలాబాద్ ను పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేయాలని ప్రేం సాగర్ రావు అనేవారు.
ధైర్యం భయంగా మారి., భయం పోరాటంగా మారి ఉక్కు సంకల్పంతో ఆనాడు పోరాటం కొనసాగించాం. ఎన్ని కేసులు పెట్టినా కొట్లాడి ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు. అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకుని ముందుకు వెళతాం. అందుకే పార్టీలకు అతీతంగా ఈ సభలు ఆహ్వానించాం. గత పదేళ్లలో తెలంగాణలో ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా చూశారా?
ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలి. అభివృద్ధికి కలిసి వచ్చిన మిత్రులకు అభినందనలు తెలియజేస్తున్నా. ఇక్కడ కాంగ్రెస్ శాసనసభ్యులు లేకపోయినా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేశాం. మా ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజలు నష్టపోకూడదని అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నాం. కాంగ్రెస్ కు ఓటు వేస్తేనే అభివృద్ధి చేస్తామని మేం ఎప్పుడూ అనలేదు.
మేం పార్టీలు చూడలేదు. ప్రజల కష్టాలు చూసి సంక్షేమ అమలు చేస్తున్నాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. పది వేల కోట్లు మా ఆడబిడ్డల ఉచిత ప్రయాణానికి ఖర్చు చేశాం.పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ. 22,500 కోట్లతో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. ఇప్పటి వరకు దాదాపు రూ. 5400 కోట్లు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే పేదల ఖాతాల్లో వేశామని ధైర్యంగా చెబుతున్నా.
ఏనాడైనా గత ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేసిందా? సన్నబియ్యంతో పేదల కడుపు నింపాలని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 3 కోట్ల 17 లక్షల తెలంగాణ బిడ్డలకు సన్నబియ్యం అందిస్తున్నాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సన్నబియ్యం అందిస్తున్నాం.ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఆడబిడ్డలను ప్రోత్సహిస్తున్నాం.
మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్తత్తుల మార్కెటింగ్ కు హైటెక్ సిటీలో షాపులను కేటాయించాం. ఈ వేదికగా మాట ఇస్తున్నా.. పెండింగ్ లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు.తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం.
ఆదిలాబాద్ కు సాగునీరు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఎర్రబస్సు తిరగడమే కష్టమైన ఈ ప్రాంతంలో కేంద్రంతో మాట్లాడి ఎయిర్ పోర్ట్ మంజూరు చేయించాం.
త్వరలోనే.. వీలైతే జూన్ 2 నాటికి ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శిలాఫలకం వేసే బాధ్యత తీసుకుంటాం. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఇందుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఆదిలాబాద్ లో యూనివర్సిటీకి సంబంధించి భూసేకరణ చేపట్టాం. త్వరలోనే ఆదిలాబాద్ లో యూనివర్సిటీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తాం. బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశాం. ఆలయ అభివృద్ధికి అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తాం.
ప్రేమ్ సాగర్ రావు అభ్యర్థన మేరకు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నాం. ప్రతీ రెండు నెలలకోసారి ఈ జిల్లాకు వస్తూనే ఉంటా.. నిధులు తెస్తూనే ఉంటాం. పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనేది మా ప్రయత్నం. మేం పాలకులం కాదు… ప్రజల సేవకులం.