Suryaa.co.in

Andhra Pradesh

అర్చకుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తాం

•అర్చకుల గృహ నిర్మాణాలకై సి.జి.ఎఫ్. లేదా అర్చక సంక్షేమ నిధులను అందజేస్తాం
•పట్టణ ప్రాంతాల్లో విలీనమైన గ్రామాల్లోని దేవాలయాలకు డి.డి.ఎన్.ఎస్.వర్తింప చేస్తాం
•ధర్మప్రచారానికి రూపొందిస్తున్న ముసాయిదా ప్రణాళిక శ్రీకాళహస్తి నుండి అమలు
•దేవాదాయ,ఇనాంభూముల్లో బోర్వెల్స్ ద్వారాసాగునీరుఅందించేఅంశాన్ని పరిశీలిస్తాం
•ప్రభుత్వం పెంచిన వేతనాలు అందని అర్చకులు పిర్యాధు చేసిన తక్షణమే చర్యలు
•పనికట్టుకుని కొన్ని దేవాలయాలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని అర్చకులు ఖండించాలి
ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

అమరావతి, జులై 20: నిరంతరం భగవంతుని సేవ, కైంకర్యాలతో తరిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు, ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించేందుకు కృషి చేసే అర్చకుల సమస్యలను అన్నింటినీ సానుకూలంగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం ధర్మానికి కట్టుబడి ఉందని, సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు నిరంతరం కృషిచేస్తున్న అర్చకులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఆయన భరోసా ఇచ్చారు. గురువారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అర్చక సంఘం రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులతో ఆయన సమావేశమై అర్చకుల సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా, వారి సంక్షేమానికై ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాలను వివరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేవాదాయ భూముల పరిరక్షణకు, అర్చకుల సంక్షేమానికై గతంలో ఏ ప్రభుత్వము తీసుకోని పలు చారిత్రాత్మక నిర్ణయాలను వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుని అమలు పరుస్తున్నదన్నారు. దేవాదాయ భూముల పరిరక్షణకు చట్టసవరణ చేయడం జరుగుచున్నదని, ఇందుకు సంబందించిన ఆర్డినెన్సును కూడా జారీ చేయడం జరిగిందన్నారు.

ఈ చట్ట సవరణ ప్రకారం అన్యాక్రాంతం అయిన భూములు తక్షణమే స్వాధీనం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుచున్నదన్నారు. అదే విధంగా అర్చకుల దీర్ఝకాలిక సమస్యలను కూడా చాలా వాటిని పరిష్కరించడం జరిగిందన్నారు. అర్చకులకు రిటైర్మెంట్ అనేది లేకుండా ఒంట్లో ఓపిక ఉన్నంత వరకూ అర్చకత్వాన్ని నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు.

వారి సంతానం కూడా కొన్ని షరతులకు లోబడి అర్చకులుగా కొనసాగే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఎన్నికలకు ముందు అర్చకులకు ఇచ్చిన హామీ ప్రకారం వారి జీతాలను కూడా పెంపుచేయడం జరిగిందన్నారు. మొత్తం 3,802 మంది అర్చకులకు ఈ పెంపు వర్తింప చేయడం జరిగిందని, పెంచిన వేతనాలు అందని వారు ఫిర్యాదు చేసిన వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి కేవలం 1,561 దేవాలయాలకు మాత్రమే ధూప దీప నైవేధ్య పథకాన్ని అమలు చేయడం జరిగేదని, కానీ తమ ప్రభుత్వం మొత్తం 4,681 దేవాలయాలకు ఈ పథకాన్ని విస్తరించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో నూతన దేవాలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు పథకం ఎంతో పారదర్శకంగా అమలు చేయడం జరుగుచున్నదని, ఇప్పటి వరకూ దాదాపు 2,750 దేవాలయాల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, వాటిలో చాలావరకు పూర్తయ్యాయని, మిగిలినవి ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ దేవాలయాలకు కూడా ధూప దీప నైవేధ్య పథకాన్ని వర్తింప చేస్తామన్నారు.

అదే విధంగా పలువురు అర్చకుల విజ్ఞప్తి మేరకు అర్చకుల గృహ నిర్మాణాలకై సి.జి.ఎఫ్. లేదా అర్చక సంక్షేమ నిధులను అందజేస్తామని, పట్టణ ప్రాంతాల్లో విలీనమైన గ్రామాల్లోని దేవాలయాలకు డి.డి.ఎన్.ఎస్.వర్తింప చేస్తామని,దేవాదాయ, ఇనాంభూముల్లో బోర్వెల్స్ ద్వారా సాగునీరు అందించే అంశాన్ని పరిశీలిస్తాం అన్నారు. రాష్ట్రంలో నిరంతరం ధర్మప్రచార కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ఒక ముసాయిదా ప్రణాళికను రూపొందిస్తున్నామని, ఆ ప్రచార కార్యక్రమాన్ని త్వరలోనే శ్రీకాళహస్తి నుండి ప్రారంభిస్తామన్నారు. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు పనికట్టుకుని రాష్ట్రంలో పలు దేవాలయాలపై చేస్తున్న దుష్ప్రచారాన్ని అర్చకులు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్ర అర్చక సంఘం రూపొందించిన “గుడి గుడికి అర్చక సమాఖ్య” అనే కరపత్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ సందర్బంగా ఆవిష్కరించారు.
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు ఆత్రేయబాబు, కార్యదర్శి పెద్దింటి రాంబాబు, ఉపాధ్యక్షుడు సత్తిబాబు తదితరులతో పాటు అన్ని జిల్లాల నుండి వచ్చిన అర్చక ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE