క్షుద్ర పూజలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తే కోర్టుకు ఈడ్చుతాం

- ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు, కోర్టు ద్వారా బుద్ధి చెబుతాం
- దానం విషయంలో సుప్రీం కోర్టు తీర్పు రేవంత్ కు చెంపపెట్టు
- రాహుల్ గాంధీ మిగతా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు
- రాజ్యాంగంపై మీకున్న గౌరవం నిజమే అని నిరూపించు
- స్పీకర్ ఫిరాయింపుదారులను కాపాడే ప్రయత్నం చేశారని సుప్రీం తీర్పుతో బట్టబయలైంది
- నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు వద్ద మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు
హైదరాబాద్ : క్షుద్రపూజలు చేసినట్లు మహేష్ కుమార్ గౌడ్ , అద్దంకి దయాకర్ అసత్య ప్రచారం చేస్తున్నారు. వారిపై లీగల్ గా ముందుకు వెళ్తున్నాం. పరువు నష్టం దావా కేసు ఆధారాలతో సహా ఫైల్ చేసినం. కోర్టు వారు పిటీషన్ స్వీకరించారు. వచ్చే బుధవారం నాడు మళ్లీ పిలిచారు. స్టేట్మెంట్స్ రికార్డు చేస్తం అని చెప్పారు.
దేవుళ్ల దగ్గరకు వెళ్తే కూడా క్షుద్ర పూజలు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఉండవు. దిగజారుడు వ్యాఖ్యలు ఉండవు. మాపై చిల్లరగా ఆరోపణలు చేస్తే, వాళ్ల లాగా మేము స్థాయి దిగజారి మాట్లాడం. వాళ్లు బురదలో ఉన్నరు. మాకు బురద అంటించే ప్రయత్నం చేస్తున్నరు ప్రజల సమస్యల గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నరు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏమైనవి అని అడిగితే లేని పోని నిందలు చేస్తున్నరు.
డైవర్షన్ పాలిటిక్స కు పాల్పడుతున్నారు. శాసనసభలో కూడా అనేక అబద్దాలు మాట్లాడుతున్నారు. స్పీకర్ కి నోటీసులు కూడా ఇచ్చినం. మూడేళ్లు అయినా డిప్యూటీ స్పీకర్ ను కూడా అపాయింట్ చేయలేదు. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ స్పీకర్ ఉంటారు. వారు ఇలాంటి ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటారు. కానీ మూడేళ్లు అయినా అపాయింట్మెంట్ జరగలేదు.
ఎన్నిసార్లు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినా స్పీకర్ పట్టించుకోవడం లేదు. మూడేళ్ల నుంచి డైవర్షన్ డ్రామా తప్ప కాంగ్రెస్ పాలనలో చేసిందేం లేదు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే తప్ప, ప్రజల గురించి పట్టించుకోవడం లేదు మాటలతో కాలం గడుపుతున్నారు. రాష్ట్రం తిరోగమనం దిశలో పయనిస్తున్నది. నీళ్ల కష్టాలు, కరెంట్ కష్టాలు రాష్ట్రాన్ని చుట్టు ముట్టినా ఈ ప్రభుత్వానికి పట్టింపులేదు.
ఎల్ ని నో పేరు చెప్పి చేతులు ముడుచుకు కూర్చుంటున్నరు. ప్రతిపక్షంగా మేం ప్రభుత్వాన్ని నిలదీస్తే సహించలేకపోతున్నరు. ఎవరెన్ని అన్నా, ఎన్ని కేసులు పెట్టినా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. మాపై కాంగ్రెస్ నాయకులు చిల్లర కామెంట్స్ చేసినా, మేం వాళ్ల లాగా నోరు జారడం లేదు. క్షుద్రపూజలు అంటూ ఆరోపణలు చేసిన వారికి కోర్టు తగిన బుద్ది చెబుతుందని, తగిన చర్యలు తీసుకుంటుందని బలంగా నమ్ముతున్నాను.
గోబెల్స్ ప్రచారం చేస్తే వదిలిపెట్టం.ఎంతటి వారినైనా వదలం. ఎంత దూరం అయినా పోతాం.
వారికి శిక్ష పడేదాక వదిలి పెట్టం. ఈరోజు దానం నాగేందర్ అనర్హతకు సంబంధించి సుప్రీంకోర్టు గట్టి తీర్పు ఇచ్చింది. దానం విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రేవంత్ కు చెంపపెట్టు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న రేవంత్ కు ఇది గట్టి గుణపాఠం. అధికారంలో చేతిలో ఉంది కదా అని ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు రేవంత్ రెడ్డి.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాజ్యాంగ విలువలను కాలరాస్తుంటే, ప్రతిపక్షాలను వేధిస్తుంటే న్యాయస్థానాలు గట్టి బుద్ది చెబుతున్నాయి. న్యాయవ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా వస్తున్న తీర్పులను స్వాగతిస్తున్నాం. దానం నాగేందర్ ఒక్కరే కాదు. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి రండి. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ గారికి తెలంగాణ జరుగుతున్న రాజ్యాంగ హననం కనిపించడం లేదా?
కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటే కనిపించడం లేదా? మీ మాటల్లో నిజాయితీ లేదా? పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ తెచ్చింది అని చెప్పుకునే రాహుల్ గాంధీ మరి ఎందుకు ఆ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు? రాజ్యాంగం మీద మీకు నిజంగా గౌరవం ఉంటే, వెంటనే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి.
కాంగ్రెస్ తప్పు చేసిందని, స్పీకర్ ఫిరాయింపుదారులను కాపాడే ప్రయత్నం చేశారని సుప్రీం తీర్పుతో బట్టబయలైంది. మిగతా అందరి శాసన సభ్యులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయినా మిగతా వారితో రాజీనామా చేయించండి. అప్పుడు ప్రజలు తీర్పు చెబుతారు. రేవంత్ రెడ్డి అరాచకాలు సుప్రీం తీర్పుతో బట్టబయలు అయ్యాయి.
