Suryaa.co.in

Andhra Pradesh

పార్టీ సమీక్షా సమావేశంపై ఏమిటా రాతలు?

-ఇష్టం వచ్చినట్లు రాస్తారా?
-వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లు గెలుస్తాం
-ఆ దిశలోనే మా కార్యాచరణ కొనసాగుతుంది
-మేమెవరికీ దాసోహం కాలేదు. కాబోము కూడా
-రిషికొండపై గెస్ట్‌హౌస్, కార్యాలయాలు కడుతున్నాం
-అక్కడ ప్రభుత్వం నిర్మాణాలు చేస్తే తప్పేమిటి?
-విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

ఏమిటా రాతలు?
రాజకీయ పార్టీలు సమీక్ష నిర్వహించుకోవడం ఆనవాయితీ. మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆ విధంగానే సమీక్ష చేశారు. దానిపై ఏదేదో రాశారు. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లను హెచ్చరించారంటూ రాసుకొచ్చారు. ఏ పార్టీ అయినా అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుంది. మేమూ అలాగే చేశాం. చేస్తాం కూడా. మహానేత వైయస్సార్‌ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ, తండ్రి కంటే ఒక రెండు అడుగులు ముందుకు వేస్తూ, సీఎం వైయస్‌ జగన్‌ పని చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98.44 శాతం అమలు చేశారు. సీపీఎస్‌ వంటి వాటిపై చర్చలు జరుగుతున్నాయి.

సంక్షేమానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి అన్ని పథకాలు అమలు చేశాం. అన్నింట్లో మాట నిలబెట్టుకున్నాం. సమీక్షలో సీఎంగారు మాట్లాడిన దానిపై.. పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఏదేదో రాశారు. మెయిన్‌పేజీల్లో మాపై రాశారు.

175 సీట్లూ గెలుస్తాం:
రాష్ట్రంలో సంక్షేమానికి జగన్‌గారి ప్రభుత్వం మారుపేరుగా ఉంది. ఈ ప్రభుత్వం మళ్లీ వస్తుంది. ఆ మేరకు కార్యాచరణ కొనసాగుతోంది.
పీకే టీమ్‌కు మేము దాసోహం అయ్యామా? ఎవరన్నారు? అది ఒక అడ్వైజరీ బాడీ. ఆ సలహా బాగుంటే తీసుకుంటాం. లేకపోతే లేదు. ఏ పార్టీ అయినా అలాగే చేస్తుంది. మా పార్టీ సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో 175 సీట్లు గెలుస్తాం. ఆ దిశలోనే మా కార్యక్రమాలు, కార్యాచరణ ఉంటుంది.

ఎవరి కోసం యాత్ర?:
విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెట్టాలని సీఎంనిర్ణయం తీసుకున్నారు. అది వద్దు అని, తెలుగుదేశం పార్టీ రైతుల పేరుతో, ఆ ముసుగులో అమరావతి టు అరసవెల్లికి పాదయాత్ర చేస్తోంది. తమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం, తమ భూముల ధరల కోసమే ఆ యాత్ర చేస్తున్నారు. 26 జిల్లాలు అభివృద్ధి చెందాలన్నది ప్రభుత్వ ఆశయం. అందులో భాగంగానే విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేస్తామని సీఎంగారు ప్రకటించారు. కానీ అది వద్దని అంటున్నారు. అది ఏ మాత్రం సరి?

ఆయన ఒక మహాజ్ఞాని!:
ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక మహాజ్ఞాని, యుగ పురుషుడు. అందుకే మమ్మల్ని దద్దమ్మలు అంటున్నాడు. మనిషి పెరిగాడు కానీ, బుర్ర ఎదగలేదు. వాయిస్‌ ఉంది కదా.. అని ఏదో మాట్లాడుతున్నాడు. ఈ మూడేళ్లలో మేమేం చేశామని అడుగుతున్నాడు. మరి మీరు కూడా అంతకు ముందు మీ ప్రభుత్వం 14 ఏళ్లు ఉంది కదా? నీకు కూడా మంత్రిగా పని చేశావు కదా? మరి ఈ మూడు జిల్లాలలో ఏం చేశావో, నీ మార్క్‌ ఏమిటో చెప్పండి. అలాగే మున్సిపల్‌ మంత్రిగా బండారు సత్యనారాయణమూర్తి పని చేశారు. ఆయన అయినా తన మార్క్‌ ఏమిటన్నది చెబుతారా?

మేము చెప్పగలం..:
కానీ నేను చెబుతాను. విశాఖలో గతంలో కేంద్ర సంస్థలు కాకుండా, ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే, అది కచ్చితంగా వైయస్సార్‌గారి హయాంలోనే. ఆయన హయాంలోనే లా యూనివర్సిటీ, హెల్త్‌ సిటీ, విమ్స్, ఫార్మా సిటీ, సెజ్, గంగవరం పోర్టు, కొండ మీద ఐటీ పార్క్‌.. ఇవన్నీ వచ్చాయి. కాదంటారా టీడీపీ వారిని చెప్పమనండి.
హుద్‌హుద్‌ తుపాన్‌ వస్తే, ఆ పేరుతో ఎమ్మార్వో ఆఫీస్‌లో రికార్డులు తడిచిపోయాయని చెప్పి, మొత్తం ఈ ప్రాంతాన్ని దోచుకుతిన్నారు. తుపాన్‌ పేరు చెప్పి, రికార్డులు తారుమారు చేసిన దౌర్భాగ్యులు, మా గురించి మాట్లాడుతున్నారు. వైయస్సార్‌ హయాంలో చేసిన పనుల వల్లే కదా.. విశాఖకు గుర్తింపు వచ్చింది. నగరం అభివృద్ధి చెందింది.

అక్కడ కడితే తప్పేమిటి?:
రిషికొండ గురించి మాట్లాడుతున్నారు. దానిపై గతంలో ఏముంది? ఒక హరిత గెస్ట్‌హౌజ్‌ ఉంది. అది దారుణంగా మారడంతో.. ప్రభుత్వం అక్కడ మరో గెస్ట్‌హౌజ్‌ కడితే తప్పేమిటి? అక్కడ ప్రభుత్వ కార్యాలయం, సీఎం అధికార నివాసం కడితే తప్పేమిటి?.
గతంలో హైదరాబాద్‌లో నాటి సీఎం వైయస్సార్‌, అధికార నివాసం కట్టారు. ఆ తర్వాత కేసీఆర్‌ వచ్చాక, మరో భవనం కట్టారు. ఎవరు సీఎంగా ఉన్నా, అవి అధికార నివాసంగా ఉంటాయి. రిషికొండ మీద ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ ప్రభుత్వ కార్యాలయం, గెస్ట్‌హౌజ్‌ కడితే తప్పేమిటి? అక్కడ గుడి, మసీదు లేక చర్చి లేవు కదా?

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కోరుతున్నాం:
తల్చుకుంటే యాత్రను 5 నిమిషాల్లో ఆపేస్తామని మంత్రి అన్నారని విమర్శిస్తున్నారు. కానీ మేము ఆ పని చేయబోమని చెప్పాం. వ్యవస్థలను గౌరవిస్తామని చెప్పాం. కానీ దాన్ని కూడా తప్పు పడుతూ, ఈనాడు వంటి పత్రికలో విమర్శలు చేశారు.
రైతుల కండువా వేసుకుని ఎందుకా యాత్ర? ఏకంగా టీడీపీ కండువాలు వేసుకోవడం ఎందుకు? మీకు ఆ ధైర్యం లేదా? కానీ నాకు ఆ ధైర్యం ఉంది. ఉత్తరాంధ్రలో పుట్టిన వ్యక్తిగా నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాంతం అభివృద్ది కోరుకుంటున్నాను. నేను అలా అంటే యాత్ర నిర్వహిస్తున్న ఒకరు నాపై విమర్శలు చేశారు. ఇప్పుడు చెబుతున్నాను. ఆయన ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. నేను మంత్రిగా ఉన్నప్పుడు సమస్యలపై నన్ను కలిశారు. కాదంటారా? చెప్పండి.

మీది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం:
ల్యాండ్‌ పూలింగ్‌ అనేది కొత్త కార్యక్రమం ఏదీ కాదు. గతంలో వైయస్సార్‌ కూడా చేశారు. ఇటీవలే ఇక్కడ పేదల ఇళ్ల కోసం దాదాపు 6 వేల ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌ చేసి, డెవలప్‌ చేసి ఇచ్చాం. అదేమీ కొత్త స్కీమ్‌ కాదే?.
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి, ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడం కోసం తప్ప ఏముంది. అది వాస్తవం కాదా? అందుకే మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. మీరు అలా మాట్లాడితే, ఇక్కడ కూడా ఎవరో ఒకరు మాట్లాడతారు. దాని వల్ల రాజకీయాలు పల్చన అవుతున్నాయి. రాజకీయ నేతలకు నోరు అదుపులో ఉండాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. భాష మీద అదుపు, విషయం మీద పట్టు ఉండాలి.

రాజుగారు ఏం వెలగబెట్టారు?:
ఇక విజయనగరంలో మా రాజుగారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేశారు. సుదీర్ఘకాలం రాష్ట్ర మంత్రిగా పని చేశారు. మరి విజయనగరంకు ఏం చేశాడో చెప్పమనండి? కనీసం ఒక్క గుర్తింపు చెప్పమనండి?. కానీ నేను చెబుతాను.
విజయనగరానికి మెడికల్‌ కాలేజీ, ఒక ఇంజనీరింగ్‌ కాలేజీ, యూనివర్సిటీ, పాలిటెక్నిక్‌ కాలేజీ తెచ్చాం. కాదంటారా? తాగునీటి కోసం వైయస్సార్‌ గారి హయాంలోనే పనులు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో, ఆ పనులూ ఆపేశారు. ఇప్పుడు మా రాజుగారు కూడా విమర్శలు చేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావు. కనీసం విభజన చట్టంలో ఉన్న యూనివర్సిటీని కూడా తీసుకురాలేకపోయావు? ఏం మాట్లాడుతున్నావు?

ఆ విషయం చెప్పండి:
అసలు విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఎందుకు వద్దు? చెప్పండి.
అమరావతిలోనే అన్నీ ఎందుకు వద్దో మేము స్పష్టంగా చెబుతున్నాం. ఒకేచోట జాతి సంపద దాదాపు రూ.5 లక్షల కోట్లు పెట్టడం సరికాదని అంటున్నాం. ఇక్కడ విశాఖలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయి. నిజానికి ఈ నగరం అన్నింటా వెనకబడి ఉంది. నగరం అభివృద్ధి చెందకూడదా? ఇక్కడ ఎగ్జిక్యూటివ్‌ రాజధాని వద్దని ఏ రకంగా అంటున్నారు?. ఇక్కడ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వచ్చి తీరుతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అది ఆగబోదు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
నాడు ఇంత కంటే ఎక్కువే..:
విశాఖలో గతంలో కూడా గంజాయి సాగు సాగింది. కానీ అప్పుడు ఎవరూ పట్టుకోలేదు. విషయం తెలిసినా ఎల్లో మీడియాలో రాయలేదు. ఇప్పుడు మేము దాడులు చేస్తున్నాం. గంజాయిని అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం. దాంతో విషయం బయటకు వస్తోంది. మాపై వారికి వ్యతిరేకత కాబట్టి, అలా రాస్తున్నారు.

అవసరమైతే అఖిలపక్షాన్ని తీసుకుపోతాం:
రిషికొండ మీద కొత్త గెస్ట్‌హౌజ్‌ కడుతున్నామని చెప్పాం. అందులో రహస్యం ఏమీ లేదు. ఆ ప్లాన్‌లో అన్నీ స్పష్టంగా చెప్పాం. మళ్లీ చెబుతున్నాను. రిషికొండ మీద ప్రభుత్వం కార్యాలయాలు కడితే తప్పు, ఇబ్బంది ఏమిటి? ఈ ప్రాంతం అభివృద్థి చెందవద్దని, కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి.

రిషికొండ చూడడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. నేనే ఒక పని చేస్తాను. అఖిలపక్షాన్ని తీసుకుపోతాను. కానీ వారేం చేస్తారంటే, ఆ తర్వాత అది ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కోసమే అంటూ, అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఇప్పుడు అక్కడికి ఎవరినీ వద్దంటున్నారు. మేము కొండను తవ్వడం లేదు. నిజానికి పర్యావరణ పరిరక్షణలో మేము కృషి చేస్తున్నాం.

ప్రభుత్వం సొంతంగా కడుతోంది. అందుకోసం టెండర్లు కూడా పిల్చింది. అది దోచుకోవడం అవుతుందా? రిషికొండపై గెస్ట్‌హౌజ్‌ కడితే తప్పేమిటి? ప్రభుత్వం స్వయంగా కడుతోంది. దానిపై ఎందుకు విమర్శలు చేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పండి.
రిషికొండపై గతంలో హరిత గెస్ట్‌హౌజ్‌ ఉంది. ఆ భవనం పాడై పోవడంతో, కొత్త గెస్ట్‌హౌజ్, ప్రభుత్వ భవనం కడుతున్నాం. ఆ విధంగా ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షిస్తున్నాం. తప్పేమిటి? ఆ పని చేస్తే, మేము దోచుకుంటున్నట్లా? ఏమిటా అర్ధం లేని విమర్శలు? అక్కడ ఏం కట్టినా ప్రభుత్వ సొంతం తప్ప, వ్యక్తిగత ఆస్తి కాదు.

హరీష్‌రావు ఇక్కడికి రావాలి:
తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఒకవేళ మాపై విమర్శలు చేసి ఉంటే, ఆయన ఒకసారి ఇక్కడికి వచ్చి టీచర్లతో మాట్లాడాలి. మేము ఫిట్‌మెంట్, పీఆర్సీ ఎంత ఇచ్చామన్నది తెలుస్తుంది. దాంతో వారేం ఇచ్చారో తెలుస్తుంది. రెండింటినీ బేరీజు వేసుకోమని చెప్పండి. అందుకే ఇక్కడకు వచ్చి, టీచర్లతో మాట్లాడాలి. అప్పుడే ఆయనకు వాస్తవాలు తెలుస్తాయి.

మేము దోపిడిదార్లమా?:
విశాఖ పరిపాలన రాజధాని అయితే, మేము దోచుకుంటామా? అంటే మేమంతా దోపిడిదార్లం.. అక్కడ 29 గ్రామాలవారు, టీడీపీ నాయకులు పుణ్యపురుషులా? ఏం మాటలండి అవి. ఇక్కడ తక్కువ వ్యయంతో రాజధాని నిర్మాణం పూర్తవుతుంది.
మేము ఎక్కడా అవినీతికి పాల్పడడం లేదు. దేవుడి దయ వల్ల, మా తల్లితండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది. నేను డిగ్రీలో ఉండగానే, నాకు స్కూటర్‌ ఉంది. 1985లోనే నాకు సొంతంగా కారు ఉంది.

LEAVE A RESPONSE