-శాఖల వారీగా విభజించి సమస్యల పరిష్కారానికి కృషి
-అధికారులు, సిబ్బందిని ఆదేశించిన మంత్రి నారా లోకేష్
-జోరువానలోనూ 19వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ
అమరావతిః సమస్యల పరిష్కార వేదిక “ప్రజాదర్బార్” కు వస్తున్న విన్నపాలపై వారం వారం సమీక్షించనున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కార్యక్రమానికి మంగళగిరితో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. తాము పడుతున్న కష్టాలు, సమస్యలపై యువనేతను నేరుగా కలిసి అర్జీలు ఇస్తున్నారు. ఆయా విన్నపాలను శాఖల వారీగా విభజించి సమస్యల పరిష్కారానికి కృషిచేయడం జరుగుతోంది.
ప్రజల అర్జీలు ఎంతమేరకు పరిష్కారం అయ్యాయి, వాటి స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆయా విన్నపాలపై ప్రతివారం సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు యువనేత వెల్లడించారు. జోరువానలోనూ 19వ రోజు నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు వినతులు వెల్లువెత్తాయి.
పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న 27వేల మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కార్మికులను టెండర్లతో పనిలేకుండా మస్టర్ రోల్ ద్వారా కొనసాగించాలనే హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నవించారు.
నంద్యాల జిల్లా, డోన్ మండలం, ధర్మారంలో తాము నిర్మించుకున్న చర్చికి ప్రహరీగోడ, మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్డర్ కాపీ వచ్చిందని, నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన చిన్నయద్దయ్య కోరారు. కడప జిల్లా గోపవరం మండలం రాచయపేటకు తాగునీటి సౌకర్యంతో పాటు రోడ్లు నిర్మించాలని గ్రామప్రజలు కోరారు. కరోనాతో తమ ఆర్థిక పరిస్థితులు దిగజారాయని, ఎన్ఎస్ఎఫ్ డీసీ, ఎన్ఎస్ కే ఎఫ్ డీసీ పథకం ద్వారా తీసుకున్న కార్ల రుణాలను రద్దు చేయాలని ఎన్ఎస్ఎఫ్ డీసీ లబ్ధిదారులు విజ్ఞప్తి చేశారు.
నెల్లూరు జిల్లా కోటలోని ఎన్ బీకేఆర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యాసంస్థలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు కోరారు. పశువైద్యాధికారులకు అనుసంధానకర్తలుగా ఉన్న పశుసఖీలను గత ప్రభుత్వం తొలగించిందని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ రాష్ట్ర పశుసఖీలు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ లో వాహన డ్రైవర్ గా పనిచేస్తున్న తనకు గత ప్రభుత్వం కక్షపూరితంగా జీతం నిలిపివేయడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగించిందని, తగిన న్యాయం చేయాలని జి.రమేష్ కోరారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు.
అంగన్ వాడీ పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించండి
అద్దెభవనంలో ఉన్న తాడేపల్లి కృష్ణనగర్ అంగన్ వాడీ పాఠశాలకు స్థలం కేటాయించడంతో పాటు శాశ్వత భవనం నిర్మించాలని డి.లీల నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పక్షవాతంతో మంచానికే పరిమితమైన తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని నవులూరుకు చెందిన బేతపూడి కోటేశ్వరరావు కోరారు. అనారోగ్యంతో బాధపడుతన్న తనకు పిల్లల చదువులు భారంగా మారాయని, ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని ఉండవల్లికి టి.మైనర్ బాబు కోరారు. సివిల్ ఇంజనీరింగ్ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆత్మకూరుకు చెందిన సీహెచ్.కల్యాణ్ బాబు విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని యువనేత భరోసా ఇచ్చారు.