Suryaa.co.in

Andhra Pradesh Political News

సంక్షేమం అణగదొక్కే కులాలకా? అణచివేయబడ్డ కులాలకా?

భారత రాజ్యాంగం సంక్షేమం గూర్చి ప్రాథమిక హక్కుల అధ్యాయంలో ఆర్టికల్ 15(4),16(4) సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వారికి మాత్రమే ప్రాతినిధ్య హక్కు మరియు సంక్షేమం అందజేయాలని తెలియజేస్తుంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 ప్రకారం “రాష్ట్రం ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించాలి, సాధ్యమైనంత సమర్థవంతంగా రక్షించడం ద్వారా,న్యాయం,సామాజిక ఆర్థిక మరియు రాజకీయ,జాతీయ జీవితంలోని అన్ని సంస్థలను విస్తరించే సామాజిక క్రమాన్ని.” ఈ నిబంధన సంక్షేమ రాజ్య స్థాపనకు చేయాలి. భారత ప్రాథమిక హక్కుల రాజ్యాంగం (పార్ట్ III) పౌరులందరికీ కొన్ని ప్రాథమిక మానవ మరియు పౌర హక్కులను కల్పించింది.ఈ ప్రాథమిక హక్కులు,రాష్ట్రానికి అందించబడిన ప్రాథమిక విధులు.ఇవి ఏ పౌరుడిని లేదా పౌరుల తరగతిని ఏ ప్రభుత్వం తిరస్కరించలేని హక్కులు.

వివక్షతా పూరితమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డికే చెల్లింది
139 బీసీ కులాల కోసం 56 కార్పొరేషన్లు,60 ఎస్సీ కులాల కోసం మూడు కార్పొరేషన్లు పెట్టి,35 షెడ్యూల్ తెగలకు ఎలాంటి కార్పోరేషన్లు పెట్టకుండా,ఆయా కార్పొరేషన్ ద్వారా ఒక లోను కూడా ఇవ్వకుండా గౌరవ ముఖ్యమంత్రిగారు,వారు అనుకున్న సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారు.దశాబ్దాల క్రితం రాజ్యాంగబద్దంగా ప్రవేశపెట్టబడిన బహుజన సంక్షేమ స్కీములను ఏకపక్షంగా రద్దు చేయడం వారి విజ్ఞతకే చెల్లింది.

సంక్షేమం అంటే ఆధిపత్య కులాల సంక్షేమమేనా?
ది:27-జూన్-2020న AP బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 200 కోట్లు కేటాయించింది. ది:13-02-2020న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌ను స్థాపించారు.గత ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు రూ. 30 కోట్లు మాత్రమే కేటాయించగా,ముఖ్యమంత్రిగారు రూ.100 కోట్లు వాగ్దానం చేశారు.

ది:24 ఫిబ్రవరి 2022న,ఆంధ్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రవర్ణాల మహిళలకు రూ 15,000 అందించింది.2021-22 ఆర్థిక సంవత్సరం నుండి, బ్రాహ్మణ,వైశ్య,వెలమ,క్షత్రియ,కమ్మ వంటి అగ్రవర్ణాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఇబిసిలు) నుండి 45-60 సంవత్సరాల వయస్సు గల మహిళలకు సంవత్సరానికి రూ. 15,000 సహాయం అందించ బడుతుంది.కాపు నేస్తం మరియు వైఎస్ఆర్ చేయూత తరహాలో రెడ్డి,మరియు ఇతర కులాలకు కొత్త పథకం ఇబిసి నేస్తమ్ రూ. 670 కోట్లు కేటాయించబడింది మరియు రాబోయే మూడేళ్లలో,లబ్ధిదారులకు సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది.ఇది నవంబర్‌లో అమలులోకి వచ్చింది.దీని వలన 6 లక్షల మంది ఆధిపత్య కులాల మహిళలకు ప్రయోజనం జరిగింది.

ఫిబ్రవరి 25,2016న,ఆంధ్రప్రదేశ్ మునుపటి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు 2016-17 రాష్ట్ర బడ్జెట్‌లో కాపు కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించారు.

కాపుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు 2020 జూన్ 24న వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ‘పజా సంకల్ప పాదయాత్ర’లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా కేవలం ఒక్క సంవత్సరంలోనే ₹4,770 కోట్లు ఖర్చు చేసిందని శ్రీ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.YSR కాపు నేస్తం 45-60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ₹15,000 సహాయం అందిస్తుంది,వారు ఐదు సంవత్సరాల వ్యవధిలో మొత్తం ₹75,000 పొందుతారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి వర్గాలకు చెందిన 2.36 లక్షల మందికి పైగా బియ్యం కార్డులు కలిగిన మహిళలకు ఈ పథకం కింద సుమారు ₹354 కోట్లు పంపిణీ చేస్తున్నారు.అమ్మ ఒడి,వసతి దీవెన,విద్యా దీవెన,వాహన మిత్ర,చేదోడు,విదేశీ విద్యా దీవెన,కాపు నేస్తం తదితర పథకాల కింద 23 లక్షల మందికి పైగా కాపు సామాజిక వర్గానికి ₹ 4,470 కోట్లు అందించామని ముఖ్యమంత్రి తెలిపారు.

2021 మే నెలలో ఆంధ్ర ప్రభుత్వం ఆధిపత్య కులాలైన రెడ్డి,కమ్మ,క్షత్రియ సంక్షేమ కార్పొరేషన్లను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జారీ చేసింది.ఈ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులను ఆయా వర్గాల ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు వినియోగిస్తామని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.రెడ్డి,కమ్మ మరియు క్షత్రియ (లేదా రాజు) కమ్యూనిటీలు రాష్ట్రంలో సామాజికంగా మరియు ఆర్థికంగా ఆధిపత్యంలో ఉన్న వర్గాలలో ఉన్నాయి మరియు ఓపెన్ కేటగిరీ (OC) కిందకు వస్తాయి.

ఎగువ శూద్రులు బ్రాహ్మణ,వైశ్య,క్షత్రియలతో కలిసి ఆధిపత్య కులాలగా మారి తమ సంక్షేమాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకుంటున్నారు.బహుజనులుగా ఆదిపత్య కులాల అమిత అభివృద్ధిని మేము అడ్డుకోలేము.కారణం బహుజనులు పాలక కులాలుగా కాలేకపోవడం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 శాతం పైగా ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ ప్రజలు ఆర్థికంగా ఎదగనీయకుండా,విద్యా పరంగా జిఓ 77 ద్వారా ఉన్నత విద్య పొందకుండా,కనీసం పిల్లలను బెస్ట్ ఎవైలబుల్ స్కీం ద్వారా ఇంగ్లీష్ మీడియంలో కూడా చదవనీయకుండా,నిరంకుశ పరిపాలనతో సామాజికంగా ప్రజల హక్కులను నిర్వీర్యం చేస్తూ,దేశంలో ఏ ముఖ్యమంత్రి రద్దు చేయని బహుజన సంక్షేమ స్కీములను ఏకపక్షంగా రద్దు చేసిన ఘనకీర్తి గౌరవ జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుంది.

దేశంలో గౌరవ ప్రధాన మంత్రి మోదీ గారు తన సొంత గుజరాతీ వ్యాపారుల బ్యాంకు రుణాలను పూర్తిగా రద్దు చేసి, ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా అమ్మేశారు.అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా సంక్షేమము అంటే, కేవలం ఆధిపత్య కులాల సంక్షేమమని అని భావిస్తూ,గత టీడీపీ,ఇప్పటి వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి వేశారు.రిజర్వేషన్ లేని నూతన విద్యా చట్టాన్ని,ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం.తమిళనాడు,కేరళ ముఖ్యమంత్రులు నూతన విద్యా చట్టాన్ని పూర్తిగా పక్కకు పెట్టేశారు.ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు రాష్ట్రాన్ని ఒక్క రూపాయి అప్పు లేకుండా చేశారు.విద్య,వైద్యంలో వారి పరిపాలన దేశానికి ఆదర్శవంతంగా ఉంది.

“ఎ.పిలో వైసీపీ సంక్షేమం ఎస్సీఎస్టీల పట్ల ఏ విధంగా ఉందో బేరీజు వేయండి.”
2020-21లో మొత్తం బడ్జెట్: రూ.2,24,789.18కోట్లు.
SC సబ్ ప్లాన్:రూ.14218.76 కోట్లు,
ST సబ్ ప్లాన్:రూ.4,814.5 కోట్లు
2021-22లో మొత్తం బడ్జెట్:
రూ:2,29,779.27కోట్లు.
SC సబ్ ప్లాన్:రూ: 17,403.14కోట్లు,
ST సబ్ ప్లాన్:రూ.6,131.24కోట్లు.

2019-2020 మొత్తం బడ్జెట్లో రూ.15,000/- వేల కోట్లు కేటాయించి, రూ.4378/- కోట్లు ఖర్చు చేశారు.

2020 – 2021 బడ్జెట్ లో రూ. 15,735/- కోట్లు కేటాయించి అందులో రూ.7525/- కోట్లు ఇతర కార్యక్రమాల కోసం మళ్ళించారు. అంటే కేవలం రూ.8210/- కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

గత టిడిపి ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీలకు 54,420 కోట్లు రూపాయలు కేటాయించి, కేవలం 11,851 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఏ ఒక్క వైసిపి, టిడిపి ఎస్సీ,ఎస్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లేక ఇతర ప్రజాప్రతినిధులు ఈ దోపిడి గూర్చి మాట్లాడలేక పోయారంటే, మన ప్రజాప్రతినిధులు ఎంత అధమ స్థితిలో ఉన్నారో ప్రజలు గమనించాలి.

దురదృష్టవశాత్తు కొంతమంది ఎస్సీలు ఎలక్ట్రానిక్ మీడియాలో విశ్లేషకులుగా వెళ్లి టిడిపి పాలనలో ఎలాంటి దోపిడీ జరగలేదని, చంద్రబాబు నాయుడుని పరిశుద్ధుడైన పౌలుగా మార్చే సూక్తి ముక్తావళి ప్రవచన వచనాలు మానుకోవాలి.

“”స్పెషల్ కాంపోనెంట్ ప్లాంట్ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదు.””
ఎస్సీ ఎస్టీ రుణాలు రద్దు కావు, కానీ బడా పారిశ్రామికవేత్తల రుణాలు, పన్నులు 6 లక్షల కోట్లు మోడీ అమిత్షాలు తమ వర్ణాల కోసం రుణమాఫీ చేసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం 2018-19లో అరుణ్ జైట్లీ ఎస్సీలకు 56,619 కోట్లు,ఎస్టీలకు 39,135 కోట్లు మాత్రమే కేటాయించారు. వాస్తవంగా జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 1,14,717 కోట్లు కేటాయించాల్సి ఉండగా,ఎస్టీలకు 54676 కోట్లు నిబంధనల ప్రకారం కేటాయించాలి.కేటాయింపులే చాలా తక్కువగా చేస్తూ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఎస్సీలకు 28,697.74 కోట్లు,ఎస్టీలకు 19623 కోట్లు మాత్రమే కేటాయించటం అత్యంత దురదృష్టకరమైన విషయం.ఈ దుర్మార్గతపైన జాతీయ ఎస్సీ కమిషన్ గాని,జాతీయ ఎస్టీ కమిషన్ గాని,మానవ హక్కుల కమిషన్ గాని నోరు మెదపడం లేదు.నోరు మెదపవలసిన లోకసభలో ఉన్న 134 మంది ఎస్టీఎస్సీ ఎంపీలు మాత్రం గుర్రు పెట్టి నిద్ర పోతున్నారు.

వైసిపి పాలనలో ఒక్క రూపాయి కూడా ఉప ప్రణాలికకు ఖర్చు చేయలేదు. పైగా ఎస్సీఎస్టీ అభివృద్ది కోసం కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించి వాడుకున్నారు.ఉచిత భూమి పంపిణీ చేయకపోగా ఎస్సీ,ఎస్టీలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను కూడా లాక్కొని ఇళ్ల స్థలాలకు పంచారు.ఎస్సీఎస్టీ,చెల్లెమ్మల వివాహానికి ‘వైఎస్ఆర్ పెళ్లికానుక’గా రూ.1,00,000 ప్రకటించి,ఈ రెండున్నర ఏళ్లలో ఒక్కరికీ ఇవ్వకపోగా గతంలో ధరఖాస్తు చేసుకున్న వారికి, మంజూరైన వారికి కూడా జమచేయలేదు.

గిరిజనులకు ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా యూనివర్సిటి,మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం.ప్రతి ఐటిడిఎ పరిధిలోను ఒక సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తాం.500 మంది జనాభా ఉన్న ప్రతి తండాను,గూడెంను పంచాయితీగా మారుస్తాం.పోడు భూములను సాగు చేసుకునే గిరిజన రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం గిరిజనులకు వైఎస్ఆర్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం.

ప్రమాదవశాత్తు ఎస్సీ,ఎస్టీలు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా రూ. 5,00,000 ఇస్తాం.కాని 2020-21లో ప్రభుత్వం చెల్లించాల్సిన నామమాత్రపు బీమా రుసుము చెల్లించక అనేక వేలమందికి చెందాల్సిన బీమా సొమ్ములో రూపాయి కూడా రాలేదు.ఆ బీమా సొమ్ము చెల్లించినట్లైతే సాధారణ మరణాలతో పాటు కోవిడ్ మరణాలకు కూడా బీమా కంపెనీలు పరిహారం చెల్లించవలసి ఉండేది.ఎస్సీ,ఎస్టీ లబ్దిదారులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు,పట్టా భూములకు ఇస్తున్న విలువకంటే తక్కువ పరిహారం ఇవ్వడాన్ని పూర్తిగా అరికడతాం.అలా తీసుకునే భూములకు,పట్టా భూములకు ఇచ్చే పరిహారం కంటే 10% ఎక్కువ పరిహారం ఇచ్చేట్టుగా చట్ట సవరణ చేస్తాం.

వైసీపీ పార్టీ తమ మేనిఫెస్టోని భగవద్గీత,బైబిల్,ఖురాన్ తో పోల్చి,తాము అధికారంలోకి వస్తే బహుజనుల సంక్షేమాన్ని పూర్తిగా తొలగిస్తామని మేనిఫెస్టోలో చెప్పకుండా ఓట్లు వేయించుకొని,తద్వార అధికారంలోకి వచ్చి బహుజనుల సంక్షేమాన్ని పూర్తిగా రద్దు చేయడం నమ్మక ద్రోహమే అవుతుంది.

– బేతాళ సుదర్శనం
రాష్ట్ర అధ్యక్షులు
ఆలిండియా దళిత రైట్స్ ఫోరమ్.
భారతీయ బౌద్ధ మహాసభ
సమతా సైనిక్ దళ్

LEAVE A RESPONSE