తిరుపతి సామాజిక సాధికారత సభలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి: సకల జనుల సంక్షేమమే అజెండాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అండగా నిలిచి, వారికి రాజ్యాధికారాన్ని ఇచ్చిన నేతగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహనరెడ్డి చరిత్రలో నిలిచిపోతారని టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చిందని, బలహీన వర్గాలకు అధికారం ఇచ్చిన పార్టీగా వైయస్ఆర్‌సీపీ చరిత్ర తిరగరాసిందని అన్నారు.
శుక్రవారం తిరుపతిలో జరిగిన సామాజిక సాధికారత యాత్ర సభలో కరుణాకర్‌రెడ్డి మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లలో అంచెలంచెలుగా ఎదిగి, తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు. పైరవీలతో కాకుండా సీఎం వైయస్ జగన్ ఫైటర్‌గా రాజకీయాల్లో గెలిచారన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అంటూ బడుగు వర్గాలను అక్కున చేర్చుకున్న సీఎం వైయస్ జగన్ అని చెప్పారు.
ఏ ప్రభుత్వంలో జరగనంత సంక్షేమం ఈ నాలుగున్నరేళ్లలో జరిగిందని తెలిపారు. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధితో 38 వేల ఎకరాలను అందుబాటులోకి తెచ్చారని, గత 40 ఏళ్లలో ఎక్కడా లేని అభివృద్ధి తిరుపతిలో చేసి చూపించారని వివరించారు. సీఎం వైయస్ జగన్ అనేక సంక్షేమ పథకాలతో పేద వారిని అభివృద్ధిలోకి తెచ్చారని, బడుగులు తలెత్తుకొనేలా చేశారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చెప్పారు. అందుకే రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా సీఎం జగన్‌ను దేవుడిగా పూజిస్తున్నారని తెలిపారు.
పెత్తందారులపై యుద్ధంలో పేదలంతా జగనన్నకు తోడు: ఎంపీ గురుమూర్తి
పెత్తందారులకు, పేదవారికి జరిగే ఈ యుద్ధంలో పేదలంతా వైఎస్ జగన్‌కి అండగా ఉన్నారని తిరుపతి ఎంపీ గురుమూర్తి చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కలలుగన్న సమాజాన్ని వైయస్ జగన్ నిర్మిస్తున్నారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, రాజ్యాధికారం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం జగన్‌కు మనమంతా అండగా నిలవాలన్నారు.
బీసీలకు జగన్ పెద్దపీట : ఎమ్మెల్యే అనిల్
సీఎం వైయస్ జగన్ పాలనలో బీసీలకు పెద్దపీట వేశారని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చెప్పారు. డిప్యూటీ సీఎం పదవులతో పాటు కార్పోరేషన్, మార్కెట్ కమిటీలు ఇతర నామినేషన్ పదవుల్లో 60 శాతం పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారని చెప్పారు. స్టేజీ ఎక్కి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పే దమ్ము ఒక్క సీఎం జగన్‌కే ఉందన్నారు.
అందరి అభ్యున్నతికి సీఎం జగన్ కృషి : భూమన అభినయ్
ఓ పార్టీ అణగారిన వర్గాలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకొంటే.. అన్ని వర్గాలను సొంత వారిలా భావించి వారి అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం వైయస్ జగన్ అని తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ చెప్పారు. అట్టడుగున ఉన్న వారికి క్రియాశీలక రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్ అని వివరించారు.
వైయస్ జగన్ మైనార్టీలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు
మైనార్టీలను సీఎం జగన్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా చెప్పారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేస్తే, సీఎం వైయస్ జగన్ ఇచ్చిన హామీలకు అదనంగా మంచి చేశారని అన్నారు.
మరో 25 ఏళ్లు జగనే సీఎం : వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో సామాజిక విప్లవం తెచ్చారని రాజ్యసభ సభ్యుడు, దక్షిణ కోస్తా జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి చెప్పారు. అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డే మరో 25 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని తెలిపారు. రెండో రోజు సామాజిక సాధికార యాత్రలో భాగంగా శుక్రవారం విజయసాయిరెడ్డి తిరుపతిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్లలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ , బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. తాము చేపట్టింది సాధికారత బస్సు యాత్ర మాత్రమే కాదని, సాధికారత విప్లవ యాత్ర అని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు వైయస్ఆర్‌సీపీతోనే ఉన్నారని చెప్పారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని చెప్పారు.