Suryaa.co.in

Andhra Pradesh

సంక్షేమ పథకం ఒక ఇంటికి అందితే పది ఇళ్లకు అందడంలేదు

– ‘గడప గడపకు’ కార్యక్రమంలో వైసీపీ నాయకులపై చెప్పులు, చీపుర్లతో వెంటపడే పరిస్థితి
– మూడు రాజధానులు అని రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే ప్రయత్నం
– అక్రమ ఖనిజ రవాణాతో వచ్చిన డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ లో పంచుకుంటున్నారు
– రాజధానికై రైతులు పాదయాత్ర చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశంలో ఏమన్నారో ఆయన మాటల్లోనే…!

జగన్ రెడ్డి 175 సీట్లు గెలుస్తామని వాళ్ల ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి పిట్ట కథ చెప్పారు. ఏం చేశారని ప్రజలు ఓట్లు వేస్తారు? 175 సీట్లు ఏ విధంగా గెలుస్తారు? 27 మంది ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేదని తెలిపారు. జగన్ తో కలిపి 28 మంది అవుతారు. పులివెందులలో జగన్ ఏ రోజు కూడా గడప గడపకు ప్రభుత్వం అని ప్రజలలో తిరగలేదు. ఏనాడూ ప్రజల ఇబ్బందులు తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. జగన్ పరదాలు, బారికెడ్ల చాటున, పోలీసుల మాటున తిరిగారు. సొంత నియోజక వర్గమైన పులివెందులలోని వేంపల్లి, వేముల మండల కేంద్రాల్లో పోలీసుల వలయంలో కార్యక్రమాలు, రిబ్బన్ కటింగ్ లు చేశారు.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అరాచకాలు, అక్రమాలు, కూల్చివేతలు, ప్రశ్నించిన వారిపై కేసులు అధికమయ్యాయి. సొంత జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద ఇసుక దోపిడి వల్ల గేటు కొట్టుకుపోతే నిర్వాసితులను ఆదుకున్న పరిస్ధితి లేదు. ఆ ప్రాజెక్ట్ గేటు మళ్లీ అమర్చాలన్న ఆలోచన కూడ చేయడం లేదు. రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ ని కూడ పూర్తి చేయలేదు. సముద్రంలోకి వేలాది టీఎంసీల నీరు వృధాగా పోతోంది. 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని మూడున్నరేళ్లుగా ఎంత మంది మెడలు వంచారో చెప్పాలి.

ప్రభుత్వం కేంద్రంనుంచి ఏం సాధించారు? జగన్ రెడ్డి తన వ్యక్తిగత కేసులకు భయపడి కేంద్రానికి ‘జీ హుజూర్’ అంటున్నారు. మిగిలిన ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలోనైనా ప్రత్యేక హోదాను సాధిస్తారా? కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కేంద్ర కార్యాక్రమాలకు మద్ధతు పలకం అని మీడియా సమావేశం పెట్టి ధైర్యంగా చెప్పగలరా? మీ సొంత నియోజకవర్గం పులివెందులలో ఆర్టీసి బస్టాండ్ లేక ప్రజలు ఎండ, వానకి ఇబ్బందులు పడుతున్నారు. మీ సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవడంలేదు. మీ నియోజకవర్గ కేంద్రంలో బస్టాండ్ నిర్మించలేని మీరు ఎమ్మెల్యేలను వేలెత్తి చూపించడం హాస్యాస్పదం.

కడపలో 40ఏళ్ళుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న మీరు, మీ కుటుంబం నేడు పులివెందులలో గెలవలేని పరిస్ధితి తీసుకొచ్చారు. కడప పార్లమెంటు అని చెప్పుకునే మీరు అక్కడ స్టీల్ ప్లాంటుకు సంబంధించి మూడున్నరేళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 3 కోట్ల రూపాయలతో కాంపౌండు వాల్ నిర్మిస్తే ఇంతవరకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్ధితి. దీన్ని బట్టి జగన్ కు కడప స్టీల్ ఫ్యాక్టరీపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమౌతోంది.

ఐప్యాక్ సంస్థ వైసీపీ 150 ఓట్లు ఓడిపోతారని సర్వే ఇచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దాన్ని కప్పిప్పుచ్చుకునేందుకే 27 మంది ఎమ్మెల్యేలు ప్రజల ముందు తిరగడం లేదు మారుస్తామని కొత్త నాటకానికి తెర లేపారు. 127 సీట్లలో సర్వే రిపోర్టు బ్యాడ్ గా వచ్చింది. జగన్ రెడ్డి ఒకటి తీసి 27 చెబుతున్నారు. మాజీ మంత్రులు, శాసన సభ్యులు వచ్చే ఎన్నికలలో పోటి చేయను అని చెబుతున్నా వాళ్ళని బలవంత పెట్టి మీరే పోటి చేయమని జగన్ అంటున్నారు. ఐప్యాక్ సంస్ధ ఇచ్చే సర్వేని బట్టి, ప్రజలలో ఉన్న వ్యతిరేకతను చూసి వైసీపీ నాయకులలో భయం మొదలైంది. పోటీ చేయడానికి కూడ వెనకాడుతున్నారు.

టీడీపీలో ఒక సీటు కోసం వంద మంది టికెట్లు అడుగుతున్న పరిస్ధితి. ప్రజలు టీడీపీ పట్ల ఎంత విశ్వాసంతో ఉన్నారో అర్థమౌతోంది. అందరూ చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. సర్వేలు చెబుతున్న వాస్తవాల వల్ల వైసీపీ నాయకుల వల్ల కలిగిన అభద్రతా భావం, భయాందోళన జగన్ మాటల్లో ప్రస్ఫుటమౌతోంది.

తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ రెడ్డి ఒక్క రోజైనా బయటికి వచ్చారా? ప్రజల మధ్య తిరిగారా? ఒకవేళ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినా విమానాలు ఎక్కి హైదరాబాద్ కు వెళ్లి తిరిగి తాడేపల్లికి వస్తారు. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ నాన్ లోకల్, హైదరాబాద్ లో లోకల్. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గురించి లోకల్, నాన్ లోకల్ అని మాట్లాడతారు. తాడేపల్లి ప్యాలెస్ లో కలెక్షన్ చేసి హైదరాబాద్ కు తరలించడం మీకు పరిపాటిగా మారింది. చంద్రబాబునాయుడు 40 సంత్సరాలపాటు రాష్ట్రానికి ఎనలేని సేవలందించారు.

సీనియర్ జాతీయ స్థాయి నాయకుడు చంద్రబాబు గురించి విమర్శించే అర్హత జగన్ కు లేదు. అధికార అహకారంతో మాట్లాడుతున్నారు. రాష్ట్రం వేల కోట్లు అప్పుల్లో ఉంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటికి 49,500 కోట్ల అప్పులు చేశారు. చేసిన అప్పుల వడ్డీల కోసం యూనివర్సిటీలలోని డిపాజిట్లని తీసుకుంటున్నారు. దొంగ లెక్కలు చూపి అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. నేడు ప్రతి మంగళవారం ఆర్బీఐకి వెళ్ళి అప్పులు తెచ్చి ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న పరిస్ధితి. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆదుకుంటున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఒక ఇంటికి ఇస్తే పది ఇళ్ళకి సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారు. ప్రజలను మీరు, మీ నాయకులు పెట్టిన ఇబ్బందులకు నేడు గడప గడపకి అని తిరుగుతున్న మీ వాళ్లు మీద చెప్పులు, చీపుర్లు పట్టుకొని వెంటపడే పరిస్ధితికి తెచ్చారు.

ప్రతి చోట గడప గడపకి అని తిరుగుతున్న నాయకులు పై ఇంతవరకు మీరేంచేశారు అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కనీసం రోడ్ల గుంతలను పూడ్చలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మూడు రాజధానులు అని రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. మూడు రాజధానులు చేయాలనుకుంటే అసెంబ్లీలో ఎందుకు బిల్లును పెట్టలేదు. హైకోర్టు చీవాట్లు పెట్టినా మూడు రాజధానులు అనే మాట్లాడుతున్నారు. అమరావతి రాజధానిగా ఉండాలి అని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. అమరావతి రాజధాని కోసం రైతులు పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు.

జగన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు మీలానే చంద్రబాబు నాయుడు అడ్డంకులు సృష్టించివుంటే సీఎం అయ్యేవారా? అమరావతి రైతుల పాదయాత్రను మేం ఆపాలనుకుంటే ఆపగలం అని బొత్స సత్యనారాయణ మాట్లాడటం అవివేకం. నిజంగా ధైర్యం ఉంటే ఆపి చూడండి ప్రజలే బుద్ధి చెబుతారు. హైకోర్టు అనుమతితో పాదయాత్ర జరుగుతుంది. పాదయాత్ర ఆపితే మిమ్మల్ని జైల్లో పెడతారని తెలుసుకోండి. స్థిరమైన రాజధానిని ఒకే చోట నిర్మాణం చేయమని అందరూ కోరుకుంటున్నారు. మూడు రాజధానులు కావాలని ఎవరు కోరుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలు కూడ అమరావతి రాజధానికే మద్ధతు తెలుపుతున్నారు. అందరూ అమరావతిని రాజధానిగా కోరుకుంటుంటే వైసీపీ మాత్రం మూడు రాజధానులు అని మూడు ముక్కల ఆట ఆడుతున్నారు.

రాష్ట్రాన్ని నిలువు దోపిడి చేస్తున్నారు. ఇసుక, మట్టి, మైనింగ్, లిక్కర్ మాఫియాతో మీ పబ్బం గడుపుకుంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ను అక్రమ ఖనిజానికి కేంద్రంగా చేసి లెక్కలు పంచుకుంటున్నారు. పరిపాలన గాలికి వదిలేశారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారు. ప్రజలు మీరు చేస్తున్న అరచకాలను చూస్తు ఊరుకోరు. అందుకే ప్రజావ్యతిరేకత మొదలైంది. ప్రజలంతా మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్ధేశంలో ప్రజలున్నారు. 175 సీట్లు గెలిస్తామన్న జగన్ రెడ్డి పిట్ట కథ కథగానే మిగిలిపోతుంది.

కనీసం 17 సీట్లు కూడా దక్కవనే వాస్తవంలోకి వైసీపీ రావాలి. కడప, పులివెందుల పార్లమెంటు సీట్ల విషయంలో మీరు భంగపాటును ఎదుర్కోక తప్పదు. వైఎస్సార్ సీపీలో కనీసం ఏం తప్పు చేశాం అని మాట్లాడలేని దుస్ధితిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. జగన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి వల్ల, పరిపాలనా లోపం వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ రెడ్డి పాలన లోపం వల్లే మహిళలు చేట, చీపుర్లతో తరిమే పరిస్ధితి వచ్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసులు తెలిపారు.

LEAVE A RESPONSE