(చాకిరేవు)
ప్రజల కోసం మీ పార్టీ అధినేతకు భిన్నంగా.. నువ్వు ప్రభుత్వానికి సలహా ఇవ్వడం అభినందించదగ్గ విషయం. సార్! ఆ కాన్సెప్ట్ వినడానికి చాలా బాగుంటుంది. హాంగ్ కాంగ్ లోనో, జపాన్ లోనో సముద్రంలో కట్టినట్టు, మనమూ పలాసలో వున్న ఉప్పు భూముల్లో, లేదా అలాంటి ఏ తీర ప్రాంతంలోనైనా ఓ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టేద్దాం అనగానే.. వినడానికి సూపర్!
అయితే, సీదిరి అప్పల రాజా గారు సూచించిన ఈ ప్రాంతంలో విమానాశ్రయం సాధ్యమా? సాంకేతికంగా చూద్దాం.
ఆచరణలో చూస్తే, తల పట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే, ఆ సముద్రపు ఒడ్డున, ఉప్పు కయ్యల్లో విమానాశ్రయం కట్టడం అంటే.. మామూలు విషయం కాదు, అది అష్టకష్టాల సాహసం!
ముందుగా నేల స్వభావం! పలాసలో అలాంటి ఉప్పు భూములు, చిత్తడి నేలలు, సముద్రం నుండి వెనక్కి లాక్కున్న భూములు.. ఇవన్నీ లోతైన, మృదువైన బురద మట్టితో నిండి ఉంటాయి. దాని మీద ఒక చిన్న ఇల్లు కట్టడమే కష్టం, అలాంటిది టన్నుల కొద్దీ బరువు ఉండే విమానం దిగడానికి, ఎగరడానికి కావాల్సిన రన్వేలు, టెర్మినల్ బిల్డింగ్లు కట్టాలంటే.. “అయ్యో నావల్ల కాదు” అని భూమి కూడా ఏడుస్తుందేమో!
ఇలాంటి మట్టికి దృఢత్వం ఉండదు. భారీ విమానాల బరువు పడితే, కుంగిపోవడం ఖాయం. అప్పుడు ఏం చేయాలి? ఆ బురద మట్టిని మొత్తం తవ్వి తీసేసి, దాని స్థానంలో వేరే గట్టి మట్టిని పోయాలి. లేదా కిలోమీటర్ల పొడవునా, వందల అడుగుల లోతుకు పైల్స్ (స్తంభాలు) వేయాలి. ఇవన్నీ చేయడానికి అయ్యే ఖర్చు మామూలుగా ఉండదు. వేల కోట్లలో వుంటుంది. అదీగాక, ఈ ‘నేల పటిష్టత’ పనులు పూర్తి కావడానికే ఏళ్ళు దశాబ్దాలు పడుతుంది! ప్రాజెక్టు పూర్తయ్యేసరికి, అసలు విమానాలు నడుస్తాయో లేదో కూడా డౌటే!
ఇక ఉప్పు ప్రభావం! ఉప్పు భూములు, సముద్రపు గాలి.. ఇవి రెండూ ఉక్కుకు,కాంక్రీటుకు పెద్ద శత్రువులు. ఉప్పు నీరు, గాలిలోని ఉప్పుదనం.. ఇనుమును క్షణం ఆలస్యం లేకుండా తుప్పు పట్టిస్తాయి. కాంక్రీటును బలహీనపరుస్తాయి.
విమానాశ్రయానికి వాడే ప్రతి ఇనుము వస్తువుకు ప్రత్యేక పూతలు, రక్షణ చర్యలు కావాలి. లేదంటే, కొన్నేళ్ళకే మొత్తం తుప్పు పట్టి, విమానాశ్రయమే
కరిగిపోతుందేమో! దీనికి అయ్యే నిర్వహణ ఖర్చు కూడా ఆకాశాన్నంటుతుంది.
సముద్ర మట్టం! తీర ప్రాంతాలు సాధారణంగా సముద్ర మట్టానికి దగ్గరగా ఉంటాయి. అంటే వరదలు, సునామీలు, తుఫానుల ముప్పు ఎక్కువ. ఓ పెద్ద తుఫాను వచ్చిందంటే, రన్వేలు, టెర్మినల్స్ అన్నీ నీట మునిగిపోవడం ఖాయం. వాటిని కాపాడటానికి భారీ సముద్ర గోడలు కట్టాలి, పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇదంతా మరో భారీ ఖర్చు, తలనొప్పి.
అసలే తీర ప్రాంతాలు అంటే పక్షులకు నిలయం. పక్షులు వలస వచ్చే మార్గాలు,అవి ఆహారం కోసం వచ్చే ప్రాంతాలు అయి ఉంటాయి. అలాంటి చోట విమానాశ్రయం కడితే, బర్డ్ స్ట్రైక్ (పక్షులు విమానాలను ఢీకొట్టడం) ప్రమాదం విపరీతంగా పెరుగుతుంది. విమానం ఇంజిన్లోకి ఓ పక్షి వెళ్తేనే ఎంత ప్రమాదమో మనకు తెలుసు. దీన్ని నివారించడానికి ప్రత్యేక పక్షి నివారణ వ్యవస్థలు, మనుషులు పక్షులను తరిమే ఏర్పాట్లు చేయాలి. ఇది నిరంతరం కొనసాగే పని.
ఇంకా, ఆ చిత్తడి నేలలు, ఉప్పు కయ్యలు.. కొన్ని అరుదైన వృక్ష, జంతు జాతులకు ఆవాసాలుగా ఉంటాయి. విమానాశ్రయం కట్టాలంటే వాటిని ధ్వంసం చేయాల్సి వస్తుంది. పర్యావరణవేత్తల నుండి, స్థానిక ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. పర్యావరణ అనుమతులు పొందడమే అదో పెద్ద యుద్ధం అవుతుంది.
చివరగా.. “అబ్బో! జపాన్లో కట్టారుగా, మనం కట్టలేమా?” అని కొంతమంది ఉత్సాహంగా అంటారు. నిజమే, జపాన్లో కట్టారు. కానీ అక్కడి సాంకేతికత, నిధులు, భూమి కొరత తీవ్రత మనతో పోలిస్తే చాలా తేడా. మన దేశంలో, ముఖ్యంగా పలాస లాంటి ప్రాంతాల్లో, అంత ఖర్చు చేసి, అన్ని ఇబ్బందులు పడే బదులు, కొద్దిగా లోపలికి, పటిష్టమైన నేల ఉన్న చోట విమానాశ్రయం కట్టడం చాలా సులభం, లాభదాయకం.
అందుకే, పలాస లాంటి ఉప్పు భూముల్లో విమానాశ్రయం కట్టడం అనేది.. కేవలం కలలో అందంగా కనిపించే సాహసం లాంటిదే తప్ప, ఆచరణలో పెను సవాళ్లను, అంతులేని ఖర్చును, అంతకు మించి ‘అయ్యో.. ఎందుకు కట్టామా’ అని నిట్టూర్పులను మిగిల్చే అవకాశం ఎక్కువ!
పలాస మీద ప్రేమ వున్నోడివి అయితే, కేంద్రం అధీనంలో వుండే ఫ్రీ నేలలో కట్టిద్దాం అని సలహా ఇవ్వవు. వేరే ఎక్కడ విమానాశ్రయం కడదామన్నా రైతులు ఇవ్వకుండా నువ్వు అతి తెలివితే రెచ్చగొట్టాలని పునాదులు వేస్తున్నావని అర్థం అవుతోంది.ఇంకా మన అరాచకాల, అవినీతి పేజీ రాలేదు. ఇలాంటి పనికిమాలిన సలహాలు ఇచ్చి,వెనుకబడిన పలాస అభివృద్ధికి అడ్డుపడకు.