– జగన్ జమానా రాజ్యాంగ విచ్ఛిన్నంగా హైకోర్టు వ్యాఖ్యలు
– రాష్ట్రంలో రాజ్యాంగ విచ్చిన్నం జరిగిందన్న జస్టిస్ రాకేష్‌కుమార్
– అదే మాటను రికార్డు చేస్తామని హెచ్చరిక
– సుప్రీంకోర్టుకు వెళ్లి నిలుపుదల చేసుకున్న జగన్ సర్కారు
– ఇంకా పెండింగ్‌లో ఉన్న ఆ కేసు
– రెడ్డి గౌతం దంపతులను కిడ్నాప్ చేసిన విశాఖ, బెజవాడ ఖాకీలు
– మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడి కిడ్నాప్‌పై హెబియస్ కార్పస్ పిటిషన్
– అందులోనూ అబద్ధాలు చెప్పిన విశాఖ-బెజవాడ పోలీసులు
– లాయర్ రవితేజకు గన్ ఫొటో పంపి మరీ హెచ్చరికలు
– న్యాయవాది ఇస్మాయిల్ ఇంటిపైనా దాడి.. బెదిరింపులు
– సీసీ టీవీ పుటేజీలో దొరికిన పోలీసులు
– దానితో లాయర్ రవితేజకు గన్‌మెన్ సమకూర్చిన హైకోర్టు
– చంద్రబాబు అరెస్టు సమయంలో ఆయనకు మద్దతుగా కోర్టుకు వచ్చినందుకు రవితేజకు గన్‌మెన్ తొలగించిన జగన్ సర్కారు
– జిల్లా జడ్జితో జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన జస్టిస్ మహేశ్వరి
– పోలీసుల కిడ్నాపును ధృవీకరించిన జిల్లా జడ్జి
– హైకోర్టుకు హాజరైన నాటి డిజిపి సవాంగ్, విశాఖ సీపీ
– ఇష్టానుసారంగా కోర్టు ధిక్కరణలు చేసిన నాటి జగన్ సర్కారు
– గవర్నర్ ప్రసంగంలో మళ్లీ ఈ కేసులోని రాజ్యాంగవిచ్ఛిన్న వ్యాఖ్య
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘ఈ ఐదేళ్లలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జీవించే స్వేచ్ఛ కోల్పోయింది. ప్రతీకార రాజకీయాలు రాష్ట్ర శ్రేయస్సు, అభివృద్ధి అవకాశాలను దెబ్బతీశాయి. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అనే అంశంపై విచారణ జరిపింపాలని హైకోర్టు కోరింది’
– అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్
‘‘కేవలం 40 రోజులకే రాష్ట్రంలో రాజ్యాంగవిరుద్ధమైన పాలన నడుస్తోంది. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అన్యాయం. మా పార్టీ కార్యకర్తలను దారుణంగా పొట్టనపెట్టుకుంటున్నారు. దీనిని దేశప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకే ఢిల్లీలో ధర్నా చేస్తున్నాం’’- ఇదీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీవద్ద మీడియాతో చేసిన వ్యాఖ్యలు. గవర్నర్, కేంద్రానికి రాసిన లేఖల సారాంశం.
వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి తీర్ధయాత్రలకు వెళ్లినట్లు.. రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామ్యం, హత్యాకాండ అనే చిత్రాతిచిత్రమైన పదాలతో జగన్ ఢిల్లీ ధర్నాకు వెళ్లడమే వింత అన్నది ప్రజాస్వామ్యపిపాసుల వ్యాఖ్య. ఎందుకంటే అసలు ఐదేళ్ల జగన్ జమానాలో జరిగిందే ‘నిఖార్సయిన రాజ్యాంగం విచ్ఛిన్నం’ కాబట్టి! అంత తీవ్రమైన పదం వాడింది ఎవరో ప్రతిపక్షనేతనో.. వైకాపా నేతలు తరచూ వాడే ఎల్లోమీడియానో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. స్వయంగా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి! మరిప్పుడు జగన్ దేశరాజధానిలో.. ఏపీలో లా ఆర్డరులో లేదంటూ, ఢిల్లీ వీధులవెంట పొలికేక పెట్టడం వింతల్లోవింత.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్- ఆయన సతీమణి రెడ్డి లోచినిపై కొన్ని ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే అందుకు ఫిర్యాదుదారులు.. వారికి డబ్బులిచ్చినట్లు తమ వద్ద ఉన్న బ్యాంకు స్లిప్పులు, రశీదులు గానీ పోలీసులకు అందించలేదు. అయితే ఈ కేసులో దంపతులను అరెస్టు చేసి, జైల్లో ఉంచడం ప్రస్తావనార్హం.
ఆ కేసును ప్రొసీజర్ ప్రకారం విచారించని విశాఖ-విజయవాడ పోలీసులు, ఆ దంపతులను అక్రమంగా కిడ్నాప్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగిన సమయంలో డీజీపీగా గౌతం సవాంగ్ ఉన్నారు. దానితో ఆందోళన చెందిన గౌతమ్ కుటుంబసభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రముఖ న్యాయవాది పదిరి రవితేజ తన క్లయింట్ గౌతమ్ జాడపై ఆందోళన వ్యక్తం చేస్తూ, హైకోర్టులో వాదన లు వినిపించారు. ఇదంతా 2019 నవంబరులో జరిగిన కథ.
దానితో స్పందించిన విజయవాడ పోలీసులు గౌతమ్ దంపతులను విడిచిపెట్టారు. మరోసారి విశాఖ పోలీసులు కూడా అదే బాట పట్టడంతో న్యాయవాది రవితేజ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు తాము న్యాయవాది చెప్పిన తేదీల్లో అదుపులోకి తీసుకోలేదని చెప్పిన పోలీసుల వాదనకు, రవితేజ షాక్ ఇచ్చే ప్రతివాదనలు చేయడంతో ప్రభుత్వం మరోసారి అడ్డంగా ఇరుక్కుపోయింది.
అయితే వీటికి ముందు పోలీసు కిడ్నాప్ కథను, న్యాయవాది పదరి రవితేజ ససాక్ష్యంగా కోర్టులో నిరూపించడంతో.. నాటి డిజిపి గౌతం సవాంగ్ రెండుసార్లు, విశాఖ సీపీ వారంరోజులు హైకోర్టులు నిలబడాల్సిన వచ్చింది. పోలీసు శాఖలో ఈవిధంగా ఒకే కేసుకు సంబంధించి, ఇద్దరు కీలక అధికారులు హైకోర్టులో నిలబడటం ఇదే ప్రథమం.
తన క్లయింట్లయిన రెడ్డి గౌతమ్ దంపతుల కిడ్నాప్ వ్యవహారంపై.. విచారణ జరపాలన్న న్యాయవాది రవితేజ అభ్యర్థన మన్నించిన నాటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి, దానిపై విశాఖ జిల్లా జడ్జిని న్యాయవిచారణకు ఆదే శించారు. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా జడ్జి.. గౌతమ్ దంపతులను విశాఖ నుంచి కిడ్నాప్ చేసిన పోలీసుల వివరాలతోపాటు, ఫోన్లు ట్యాపింగ్ చేసిన సీడీఆర్ వివరాలను నివేదిక రూపంలో హైకోర్టుకు సమర్పించారు.
ఈ ఘటనకు సంబంధించి అవమానంతో రగిలిపోయిన పోలీసులు.. విజయవాడలోని న్యాయవాది రవితేజ కార్యాలయంపై దాడి చేశారు. ఆయన కార్యాలయంలో పనిచేసే మరో న్యాయవాది ఇస్మాయిల్‌ని బెదిరించారు. కేసు వాపసు తీసుకోవాలంటూ.. గన్ ఉన్న ఫొటో ఒకటి వాట్సాప్‌నకు పంపించారు. దీనిని రవితేజ కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా, న్యాయమూర్తి ఆయనకు గన్‌మెన్ ఇవ్వాలని సర్కారును ఆదేశించారు.
అయితే అప్పటికే జగన్ సర్కారుపై, ఇలాంటి హెబియస్ కార్పస్ పిటిషన్లు సుమారు 20 వరకూ పెండింగ్‌లో ఉండటం విశేషం. వారిని పోలీసులు బెదిరించడంతో, పిటిషనర్లు ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఒక్క రవితేజ మాత్రమే వెనక్కి తగ్గకుండా, పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడారు. అది వేరే విషయం. ఇవన్నీ సీసీ టీవీ కెమెరాలో రికార్డవడంతో, న్యాయవాది రవితేజ మళ్లీ కోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంలోనే జగన్‌రెడ్డి సర్కారు.. రాజ్యాంగ విచ్ఛిన్న చర్యలపై హైకోర్టు న్యాయమూర్తి రాకేష్‌కుమార్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. నేరుగా ప్రభుత్వమే రాజ్యాంగ విచ్ఛిన్న చర్యలకు పాల్పడుతుంటే న్యాయస్థానం చూస్తూ ఉండదని వ్యాఖ్యానించింది.
‘‘ప్రభుత్వం రాజ్యాంగవిచ్ఛిన్న చర్యలకు పాల్పడుతోందన్న దానిపై న్యాయవిచారణకు ఆదేశిస్తాం. దానిని రికార్డు చేస్తాం. మీరు అఫిడవిట్ సమర్పించండి’’ అని ప్రభుత్వ న్యాయవాదినుద్దేశించి న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దానితో కలవ రపడ్డ జగన్ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఆ కేసును రాకేష్ బదిలీ అయ్యేవరకూ సుప్రీంకోర్టు స్టేలో ఉంచింది. అయితే రాజ్యాంగ విచ్ఛిన్నం అనే పదం మినహాయించి, మిగిలిన చర్యలు తీసుకోవచ్చని ఆదేశించింది. విచిత్రమేమిటంటే.. ఈ రాజ్యాంగ విచ్ఛిన్న కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉండటం.
రాజ్యాంగ విచ్ఛిన్నం కేసులో తనను ఇరికించారన్న కోపంతో న్యాయవాది రవితేజపై ఆగ్రహంతో రగిలిపోతున్న జగన్ సర్కారుకు.. చంద్రబాబు అరెస్టు వ్యవహారం కలసివచ్చింది. బాబు అరెస్టును నిరసిస్తూ.. హైకోర్టుకు వచ్చిన రవితేజకు గన్‌మెన్‌ను తొలగించింది. మళ్లీ దానిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడంతో, ఎన్నికల కోడ్ సమయంలో ఆయనకు తిరిగి గన్‌మెన్ సమకూర్చింది.
రాజ్యాంగాన్ని, పోలీసు వ్యవస్థను ఈవిధంగా అడ్డగోలుగా కాలరాసిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు పదవి పోయిన తర్వాత రాజ్యాంగం గురించి.. పోలీసుల పనితీరు గురించి మాట్లాడటం.. దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందన్నది ప్రజాస్వామ్యవాదుల ఉవాచ.