Suryaa.co.in

Editorial

కోర్టుకు వెళ్లి కేసీఆర్‌ సాధించిందేమిటి?

– గవర్నర్‌- గవర్నమెంట్‌ పోరులో గెలిచిందెవరు? ఓడిందెవరు?
– కోర్టులో చెప్పిన మాట ముందే ఎందుకు ప్రకటించలేదు?
– సుప్రీంకోర్టు లాయరు వచ్చినా ఏం ప్రయోజనం?
– సర్దుబాటుతో ప్రజాధనం వృధాయేనా?
– గవర్నర్‌పై ప్రభుత్వ వ్యాఖ్యలు విచారకమన్నదవే
– గవర్నర్‌పై విమర్శలు తప్పేనని కేసీఆర్‌ సర్కారు ఒప్పుకోలు
– బయట విమర్శలు, లోపల విచారమేల?
– కేసీఆర్‌కు కోర్టుకు వెళ్లమని సలహా ఇచ్చిందెవరు?
– కేసీఆర్‌ను తప్పుదోవపట్టిస్తున్నారా?
– జాతీయ స్థాయిలో పేరు వచ్చే అవకాశాన్ని కేసీఆర్‌ వదులుకున్నారా?
– బీఆర్‌ఎస్‌లో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

కొన్ని వేల పుస్తకాలు చదివిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను.. కీలకమైన న్యాయపరమైన అంశాలకు సంబంధించి ఎవరైనా తప్పుదోవపట్టిస్తున్నారా? గవర్నర్‌ వ ర్సెస్‌ గవర్నమెంట్‌ అంశంలో కోర్టుకు వెళ్లి, భంగపడిన వైనంపై బీఆర్‌ఎస్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

బడ్జెట్‌ను ఆమోదించాలంటూ తెలంగాణ సర్కారు పంపిన లేఖపై.. గవర్నర్‌ తమిళసై ఎంతకూ స్పందించకపోవడాన్ని, కేసీఆర్‌ సర్కారు ప్రతిష్ఠగా తీసుకుంది. రాజ్‌భవన్‌ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడాన్ని అవమానంగా భావించింది. బడ్జెట్‌ ఆమోదించకపోతే రాగల సమస్యలను దృష్టి ఉంచుకుని, గవర్నర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడం సంచలనం సృష్టించింది. లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేసిన కేసీఆర్‌.. తీరా గవర్నర్‌ వైఖరిపై చివరి వరకూ పోరాడకుండా, మధ్యలోనే అస్త్ర సన్యాసం చేయడం బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది గవర్నర్‌, ఆమెకు మద్దతునిస్తున్న బీజేపీకి దక్కిన మైలేజీగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

నిజానికి ఈ అంశంపై మీడియాలో విపరీత ప్రచారం జరగడంతో, సహజంగానే ఇంటా-బయటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏకంగా గవర్నర్‌పైనే కేసు వేయడమే దానికి కారణం. కానీ చివరాఖరకు.. గవర్నర్‌పై తాము వేసిన పిటిషన్‌ వెనక్కి తీసుకుంటున్నట్లు ఢిల్లీ నుంచి కేసు వాదించేందుకు వచ్చిన, సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే హైకోర్టుకు వెల్లడించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వంలో ఉన్న వారు గవర్నర్‌ను విమర్శిస్తున్నారంటూ, గవర్నర్‌ న్యాయవాది చెప్పడంతో.. ఇకపై గవర్నర్‌ను విమర్శించవద్దని ప్రభుత్వానికి చెబుతానంటూ దవే సమాధానం ఇవ్వడం మరో ఆశ్చర్యం.

‘గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలను నేను కూడా ఖండిస్తా. అలాంటి మాటలు సరికాదు. ఆమె ఒక మహిళ అని ఆమెను విమర్శించేవారు గుర్తించాలి. మహిళను గౌరవించాలి. నేను ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతా’నని.. దవే వినయపూర్వకంగా హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లడం ఆశ్చర్యపరిచింది. తర్వాత పరిణామాల అనంతరం.. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు చెప్పగా, గవర్నర్‌ తన రాజ్యాంగపరమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్‌ న్యాయవాది తెలిపారు.

నిజానికి ఈ ఎపిసోడ్‌పై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఢిల్లీ నుంచి బోలెడు ఫీజులు ఇచ్చి తెచ్చుకున్న న్యాయవాది దవే, గవర్నర్‌కు వ్యతిరేకంగా ఏం వాదిస్తారోనన్న ఉత్కంఠ.. అటు న్యాయవాద వర్గాల్లోనూ కనిపించింది. అసలు పిటిషన్‌ను హైకోర్టు తీసుకుంటుందా? లేక దానికి విచారణ అర్హత లేదని తిరస్కరిస్తుందా? గవర్నర్‌ను ఆదేశించే అధికారం హైకోర్టుకు ఉందా? లేదా? అన్న అంశంపై న్యాయవాదవర్గాల్లో చర్చోపచర్చలు జరిగాయి. చివరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు.. ప్రభుత్వం-రాజ్‌భవన్‌ లాయర్ల మధ్య చర్చలు జరిగాయి. అందులో ఇద్దరూ ఏకాభిప్రాయానికి రావడంతో కథకు తెరపడింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చొరవతో, గవర్నర్‌-గవర్నమెంట్‌ పోరు కథ తాత్కాలికంగా కంచికి చేరింది. అయితే ఇందులో చాలా సందేహాలు మిగిలిపోవడంపైనే, ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ..అంతకుముందు గవర్నర్‌పై ప్రభుత్వ ప్రముఖులు చేసిన విమర్శలను, ప్రభుత్వం తరఫున వాదించిన దవే ఖండించారు. అంటే ప్రభుత్వ ప్రముఖులు చేసిన విమర్శలు తప్పు అని, కోర్టు సాక్షిగా అంగీకరించినట్లేనని బీఆర్‌ఎస్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కోర్టులో ప్రభుత్వ న్యాయవాది వ్యాఖ్యలన్నీ, ప్రభుత్వ వ్యాఖ్యలుగానే పరిగణించాల్సి ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

మరి అంతోటి దానికి ఢిల్లీ నుంచి ప్రత్యేక న్యాయవాది దవేని, లక్షలు పోసి హైదరాబాద్‌ తీసుకురావలసిన అవసరం ఏముంది? అదేదో అడ్వకేట్‌ జనరలే స్పందించి, గవర్నర్‌పై వ్యాఖ్యలు తప్పేనని చెప్పి ఉంటే బోలెడంత ప్రజాధనం మిగిలేది కదా? ఇప్పుడు గవర్నర్‌కు దాదాపు క్షమాపణ చెప్పినంత పనిచేయడం వల్ల, ఇంతకాలం గవర్నర్‌ తీరుపై పార్టీ చేసిన పోరాటం, సాధించిన మైలేజీ ఏమైనట్లు? దీనివల్ల ప్రభుత్వమే గవర్నర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించింది. ఒక మహిళ ను అవమానించి, వేధిస్తున్నారంటూ బీజేపీ చే సిన విమర్శలను అంగీకరించడమే కదా? అన్న కొత్త చర్చకు బీఆర్‌ఎస్‌లో తెరలేచింది.

అసలు దీనికంటే ముందే.. మంత్రుల ప్రతినిధి బృందాన్ని గవర్నర్‌ వద్దకు పంపి.. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని ఆమెకు నచ్చచెప్పి ఉంటే, వ్యవహారం ఇక్కడి దాకా వచ్చేది కాదని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు వ్యాఖ్యానించారు.

ఇంత కీలకమైన అంశంపై.. సీఎం కేసీఆర్‌ను పక్కదారి పట్టించారన్న వ్యాఖ్యలు కూడా, పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. గవర్నర్‌పై కేసు వేసిన సందర్భంలో అది విచారణ అర్హత సాధిస్తుందా? అసలు హైకోర్టుకు, గవర్నర్‌ను బడ్జెట్‌ ఆమోదించమని ఆదేశించే రాజ్యాంగపరమైన అర్హత ఉందా? వంటి కీలక అంశాలపై అధ్యయం చేయకపోవడంపై, పార్టీ సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చే స్తున్నారు.

ఈ అంశంలో ఎలాంటి న్యాయపరమైన అధ్యయనం-వాటి సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా, గవర్నర్‌కు వ్యతిరేకంగా కేసు వేసి, చివరకు పరువు పోగొట్టుకున్నట్లయిందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ అంశాలన్నీ కేసీఆర్‌కు ముందస్తుగా వివరించకుండా, అనవసర ప్రతిష్ఠకు వెళ్లి ఆయనను తప్పుదోవపట్టించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం.. గవర్నర్‌ తమిళసై పైచేయి సాధించడంతోపాటు.. ఆమెపై కేసీఆర్‌ నుంచి మంత్రుల వరకూ చేసిన విమర్శలు తప్పన్న సంకేతాలు మిగిల్చాయంటున్నారు.

అయితే గవర్నర్‌పై వేసిన పిటిషన్‌ ఉపసంహరించుకోకుండా.. న్యాయ పోరాటం కొనసాగించి ఉంటే, కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చేదని బీఆర్‌ఎస్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాడుతున్న నేతగా, కేసీఆర్‌ను దేశప్రజలు గుర్తిస్తున్నారు. పైగా గవర్నర్‌ చర్యలపై బీఆర్‌ఎస్‌ పోరాటాన్ని, దేశంలోని విపక్షాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్‌పై న్యాయపోరాటాన్ని కొనసాగించి ఉంటే, బీఆర్‌ఎస్‌కు జాతీయ స్థాయిలో రాజకీయంగా కీర్తి ప్రతిష్ఠలు దక్కేవని చెబుతున్నారు. పిటిషన్‌ ఉపసంహరణతో, కేసీఆర్‌ అలాంటి అవకాశం వదులుకున్నారని బీఆర్‌ఎస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇవన్నీ తమ పోరాటాలేవీ, చివరి మజిలీ చేరవన్న సంకేతాలు వెళ్లేందుకు కారణమవుతాయని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

LEAVE A RESPONSE