– ఆపరేషన్ కగార్ ఎందుకు ఎత్తివేయాలి?
– తుపాకీ పట్టి అమాయకులను చంపుతుంటే చూస్తూ ఊర్కోవాలా?
– నక్సల్స్ తూటాలకు 50 వేల మంది బలి
– నక్సల్స్ కు మద్దతిస్తున్న వారికి విద్యా కమిషన్ లో చోటు కల్పిస్తారా?
– జాతీయ జెండాను ఎగరనీయని నక్సలైట్లు ఏ దేశభక్తులు?
– బ్యాలెట్, బుల్లెట్ ఒకే ఒరలో ఉండలేవు
2026 మార్చినాటికి నక్సలిజాన్ని నిర్మూలించి తీరుతాం
– కరీంనగర్ లో ‘నక్సల్స్ నరమేధం-మేధోమథనం’ చర్చలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
– నక్సల్స్ చేతిలో బలైన ఏబీవీపీ విద్యార్థులకు నివాళి అర్పించిన బండి సంజయ్
కరీంనగర్: పేదరికం ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుందని, ఆపరేషన్ కగార్ ను ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నక్సలైట్లతో గతంలో చర్చలు జరిపిన కాంగ్రెస్ ఏం సాధించిందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నంత కాలం నక్సలైట్ల నిషేధం విధించిన కేసీఆర్ అధికారం పోగానే చర్చలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు.
నక్సలైట్ల సమస్య సామాజిక కోణంగా చూడాలని పౌర హక్కులు, మానవ హక్కుల సంఘం నేతలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. నక్సలైట్ల చేతిలో వేలాది మంది అమాయక ప్రజలు చనిపోయినప్పుడు సామాజిక కోణం గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. నక్సల్స్ దురాగతాలవల్ల దాదాపు 50 వేల మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 9 వేల మంది పోలీసులు నక్సల్స్ తూటాలకు బలయ్యారని వాపోయారు. ఆపరేషన్ కగార్ ను ఆపే ప్రసక్తే లేదని, నక్సలైట్లను ఏరిపారేసే కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించి ‘నక్సల్ ముక్త్ భారత్’ గా మార్చి తీరుతామని ఉద్ఘాటించారు. రాజకీయాల్లోకి రాకుండా ఏబీవీపీలో ఫుల్ టైమర్ గా ఉంటూ సేవలందించాలని గతంలో భావించానని, విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న తనపై అనేక కేసులుండటంతోనే రాజకీయాల్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సి వచ్చిందన్నారు.
కరీంనగర్ లో ఈరోజు సాయంత్రం ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు ‘నక్సల్స్ నరమేధం-మేధోమథనం’ చర్చలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏబీవీపీ ప్రాంత ప్రముఖ్ మాదాసి బాబూరావు, విభాగ్ ఇంఛార్జ్ అన్నల్ దాస్ మురళి, సంయుక్త కార్యదర్శి ముత్యాల రాకేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా నక్సల్స్ చేతిలో బలైన ఏబీవీపీ విద్యార్థులకు నివాళి అర్పించిన బండి సంజయ్ అనంతరం చేసిన ప్రసంగం వివరాలిలా ఉన్నాయి.
2026 మార్చి నాటికి నక్సలిజాన్ని నిర్మూలించి తీరుతామని ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో హోంమంత్రి అమిత్ షా ప్రకటించి ‘‘ఆపరేషన్ కగార్’’ పేరుతో ఆ దిశగా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో నక్సలిజం సామాజిక సమస్య. పేదరికం ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుందని, నక్సల్స్ తో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.
ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని, చర్చలే పరిష్కారమని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘నక్సల్స్ నరమేథం..మేధో మథనం’ పేరుతో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమం నిర్వహించడం అభినందించదగ్గ విషయం.
యూపీఏ హయాంలో 200 జిల్లాలకు విస్తరించిన నక్సలిజం.. మోదీ హయాంలో 12 జిల్లాలకే పరిమితమైంది. రాబోయే మార్చి నాటికి ఆయా జిల్లాల్లోనూ నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించి తీరుతాం. నక్సలిజం ఆవిర్భించినప్పటి నుండి నేటి వరకు దాదాపు 50 వేల మందిని నక్సల్స్ పొట్టన పెట్టుకున్నారు. దాదాపు 9 వేల మంది పోలీసులు నక్సల్స్ తూటాలకు బలయ్యారు. భారీ ఎత్తున మౌలిక వసతుల విధ్వంసం జరిగింది.
ఆర్థిక కార్యకలాపాలకు అనేక అడ్డంకులు ఏర్పడినయ్. అభివృద్ధి కుంటుపడింది. నక్సలిజం నరమేథంతో ప్రజాస్వామ్య విలువలపట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లింది. విద్య, ఆరోగ్యం, టెలికం, రవాణా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేద ప్రజల కోసం పోరాడుతున్నామని తుపాకీ పట్టిన నక్సలైట్లవల్ల ఆ పేదలకే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందకుండా చేశారు. పంద్రాగస్టునాడు జాతీయ పతాకాన్ని కూడా ఎగరనీయని నక్సలైట్లు ఈ దేశ భక్తులు? దీనిని దృష్టిలో ఉంచుకునే నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నక్సలిజం నిర్మూలనకు కంకణం కట్టుకుంది.
2015లో మూడు దశల వ్యూహం(భద్రత (Security), అభివృద్ధి (Development), హక్కులు & భాగస్వామ్యం (Rights & Participation) పేరుతో నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్ (National Policy and Action Plan) ను రూపొందించి అమలు చేస్తోంది. వీటితోపాటు ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. రాష్ట్రాలకు భద్రతా వ్యయానికి అవసరమైన నిధులిస్తోంది. మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తోంది. భద్రతా బలగాలు, ప్రజల మధ్య పరస్పరం నమ్మకం పెంపొందిస్తోంది.
దేశం కోసం, నక్సలిజానికి వ్యతిరేకంగా ఏబీవీపీ చేసిన పోరాటాలు అసామాన్యం. ఎంతో మంది బలిదానం చేశారు. దేశం కోసమే తప్ప ఏనాడూ స్వలాభం కోసం పనిచేయలేదు చంపుతామని నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చినా వెరవకుండా జాతీయవాదం కోసం, విద్యారంగ సమస్యలపై పోరాడి బలిదానమయ్యారు. నమ్మిన సిద్దాంతం కోసం పనిచేసిన ఏబీవీపీ త్యాగాలు వెలకట్టలేనివి.
చత్తీస్ ఘడ్ లో నక్సలైట్లు ‘జనతన సర్కార్’ పేరుతో తుపాకులు పట్టి అమాయక ప్రజలను కాల్చి చంపారు. చదువుకుంటామంటే స్కూల్స్ కూడా ఓపెన్ చేయనీయలేదు. ప్రశ్నిస్తే కాల్చేసి చంపేశారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పిన నక్సలైట్లు అక్కడ సాధించిన అభివృద్ధి ఏమిటి? నక్సలైట్ల మూలంగానే దేశంలో చత్తీష్ ఘడ్ అత్యంత పేదరికంతో బాధపడుతోంది.
ఆశ్చర్యమేందంటే నక్సలైట్ల ఆగడాలు దారుణంగా ఉన్నా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్ వంటి వారు మాత్రం పేదరికం ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుందని, వాళ్లతో చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ నిలిపేయాలని మాట్లాడుతున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నక్సలైట్లు ఉన్న చోటే అత్యధికంగా పేదరికం ఎందుకు ప్రబలింది?
నిజం చెప్పాలంటే నక్సలైట్లు ఉన్నచోటే పేదరికం, హింస ఎక్కువైంది. అందుకే నక్సల్స్ నిర్మూలనే లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్నం. నక్సలైట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చర్చలు జరిపింది కదా? ఏం సాధించారు? దశాబ్దాల తరబడి చర్చలు జరిపినా ఏం సాధించారు? తుపాకీని టేబుల్ పై పెట్టి చర్చలు చేస్తే న్యాయం జరుగుతుందా?
నక్సలైట్ల మీద అంత ప్రేమ ఉంటే రాష్ట్రంలో నక్సలైట్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేయమనండి. 10 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఈ మాటలెందుకు గుర్తుకురాలే. ఆయనెందుకు చర్చలు జరపలేదు? నక్సల్స్ పై నిషేధం ఎందుకు విధించారు? సిగ్గుండాలే ఆ మాటలనడానికి? అర్బన్ నక్సల్స్ పేరుతో నిషేధం ఉన్న సంస్థలకు అనుకూలంగా మాట్లాడుతుంటే, వాళ్లను విద్యా కమిషన్ లో సభ్యులుగా నియమిస్తే సమాజానికి ఏం సందేశం పంపుతున్నారు?
నక్సలిజం సామాజిక సమస్యగా చూడాలంటూ మానవ హక్కుల, పౌర హక్కుల సంఘం నాయకులు మాట్లాడటం ఆశ్చర్యమేస్తోంది. మావోయిస్టుల చేతిలో తుపాకులున్నాయి. గిరిజనులను, అమాయకులను కాల్చి చంపుతున్నారు. బాంబులు పెట్టి పోలీసులను చంపుతున్నారు. తుపాకులు చేతపట్టి కాల్చి చంపడాన్ని సామాజిక కోణంతో చూడాలనడం ఏం పద్దతి? బాంబులు (క్లైమోర్ మైన్స్) అమర్చి పోలీసులను తునాతునలు చేసి చంపుతుంటే సామాజిక కోణంతో చూడాలా?
మహాముత్తారంలో ఎస్ఐ భార్య శ్రీమంతం చేసుకునే సమయంలో బాంబులు పెట్టి నక్సల్స్ ఆ ఎస్ఐని, కానిస్టేబుల్ ను చంపేస్తే సామాజిక కోణం గుర్తుకురాలేదా? దూరదర్శన్ జర్నలిస్టును, బీజేపీ నాయకులు సామ జగన్మోహన్ రెడ్డి, మధుసూదన్ గౌడ్, రామన్న, గోపన్నలను చంపినప్పుడు సామాజిక కోణం గుర్తుకురాలేదా? గిరిజనులను, అమాయక ప్రజలను ఇన్ ఫార్మర్ల పేరుతో కాల్చి చంపుతుంటే సామాజిక కోణం గుర్తుకురాలేదా?
అంతెందుకు మీ కాంగ్రెస్ నాయకులను ఎంతో మంది చంపేశారు. శ్రీపాదరావు, చిట్టెం నర్సిరెడ్డి, రాగ్యానాయక్ వంటి అజాత శత్రువులను కూడా నక్సల్స్ ను కూడా నిర్దాక్షిణ్యం చంపేశారు కదా? అప్పుడు సామాజిక కోణం గుర్తుకురాలేదా? ఇదేం ద్వంద్వ నీతి? తుపాకీ వీడితేనే సామాజిక కోణమైనా, చర్చలైనా, పరిష్కారాలైనా చూపేది.
బాక్సైట్ తవ్వకం కోసమే చత్తీష్ ఘడ్ లో నక్సలైట్లను చంపుతున్నారని అర్బన్ నక్సలైట్లు కొందరు ఈ మధ్య విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్లను నేనొక్కడే అడుగుతున్నా గనుల తవ్వకాలు 1947 నుండి జరుగుతున్నాయి కదా? నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా తెలంగాణ, చత్తీష్ ఘడ్ ప్రాంతాల్లో గనుల తవ్వకాలు జరిగాయి కదా?
బాక్సైట్ సహా గనులు జాతీయ సంపద. ప్రజల అభివ్రుద్ధి కోసం నిరంతరం గనుల తవ్వకాలు కొనసాగుతూనే ఉంటాయి. భవిష్యత్తులోనూ కొనసాగుతాయి. దానికి, నక్సల్స్ నిర్మూలనకు సంబంధమేముంది? మేం బ్యాలెట్ తోనే సమాధానం చెప్పాలంటున్నం.. వాళ్లు మాత్రం బుల్లెట్ తో జవాబిస్తమంటున్నరు. ప్రజాస్వామ్యమనే ఒరలో బ్యాలెట్, బుల్లెట్ ఒకేచోట ఇమడలేవు.
తుపాకీ వీడితేనే చర్చలైనా, పరిష్కారాలైనా చూపేది. ప్రజాస్వామ్యంలో తుపాకీ ఒక్కరే పట్టాలి. అది పోలీసోడే కావాలి. ఆ పోలీసోడు పట్టిన తుపాకీ ప్రజలకు రక్షణ కవచం కావాలి. అంతే తప్ప ఎవరు పడితే వాళ్లు తుపాకీ పట్టి మనుషులను చంపుతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఏరిపారేసి తీరుతాం. మోదీ, అమిత్ షా నాయకత్వంలో వచ్చే మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తాం. ‘నక్సల్స్ ముక్త్ భారత్’ ను ఆవిష్కరించి తీరుతాం.