– కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా
– జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
ఎన్ఠీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరులో మార్పు చేయడం ద్వారా ఏమి సాధించాలనుకొంటున్నారు? దీనిపై రాష్ట్ర పాలకులు సహేతుకమైన వివరణ ఇవ్వాలి. ఎన్టీఆర్ బదులుగా వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వైద్య వసతులు మెరుగైపోయాతాయా? రాష్ట్రంలో వైద్య వసతులు ప్రమాణాలకు తగ్గ విధంగా లేవు అనేది వాస్తవం.
ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తగినన్ని పడకలు లేవు.సిబ్బంది అందుబాటులో లేరు. ఔషధాలు ఉండవు.కోవిడ్ సమయంలో మాస్కులు అడిగినందుకే డా.సుధాకర్ గారిని వేధించారుఆయన మానసిక వ్యధకి లోనై మరణించిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు.మెరుగుపరచాల్సిన మౌలిక వసతులను వదిలిపెట్టి విశ్వ విద్యాలయం పేరు మార్చడంలో అర్థం లేదు.ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకో… కొత్త వివాదాలు సృష్టించేందుకో వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నంలా ఉంది.
పాలకులు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ వెళ్తే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు.పేర్లు మార్చాలి అనుకొన్న పక్షంలో విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా.ఆ పేరు ఇంకా బ్రిటిష్ వాసనలతో ఉంది.స్వాతంత్ర్య అమృతోత్సవాలు చేసుకున్నాం కాబట్టి విశాఖ కేజీహెచ్ పేరు మార్చి వైద్య ప్రముఖులలో ఒకరి పేరు పెట్టండి.
ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రజ్ఞుల్లో ఒకరైన యల్లాప్రగడ సుబ్బారావు పేరయినా ఈ పాలకులకు తెలుసా? బోదకాలు, టైఫాయిడ్ లాంటి రోగాలకు మందులు కనుగొని ప్రపంచానికి అందించిన గొప్ప శాస్త్రవేత్త,మన తెలుగు వారైన యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరుని కనీసం ఒక్క సంస్థకైనా ఈ పాలకులుపెట్టారా?ఇంట్లో వాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టే ముందు – ప్రజల కోసం జీవితాలను ధారపోసిన మహనీయుల గురించి పాలకులు తెలుసుకోవాలి.