– ఆ 9,200 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందా ?
– ప్రభుత్వం ఆర్టీసీకి ఎంత బాకీ ఉంది?
– కొత్త పీఆర్సీని ఎప్పటినుంచి అమలు చేస్తారు?
– కొత్త బస్సులు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందా?
– అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి హరీశ్ రావు
అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంస్థ మనుగడపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సభలో గుర్తుచేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… మొన్నటి గవర్నర్ ప్రసంగంలో మహిళల ఉచిత ప్రయాణం వల్ల రూ. 9,200 కోట్లు ఆదా అయిందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. మరి ఆ 9,200 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందా? లేదా? ఒకవేళ ఇంకా చెల్లించకపోతే, ప్రభుత్వం ఆర్టీసీకి ఎంత బాకీ ఉందో మంత్రి స్పష్టంగా చెప్పాలి. ప్రస్తుతం ఆర్టీసీ లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా? ఒకవేళ సంస్థ లాభాల్లోనే ఉంటే.. కార్మికులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్, ఏరియర్స్, సీసీఎస్ బకాయిలను ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ డ్యూ ఉండి మూడేళ్లు అవుతోంది. వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ కొత్త పీఆర్సీని ఎప్పటినుంచి అమలు చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ యూనియన్లను పునరుద్ధరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ హామీని ఎప్పటిలోగా అమలు చేసి, యూనియన్లను పునరుద్ధరిస్తారో మంత్రి సూటిగా చెప్పాలి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుని, గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మరి ఆ ఉద్యోగులను ఏ తేదీ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ ప్రభుత్వం గుర్తిస్తుందో తేల్చి చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో, సిద్దిపేట సహా పలు డిపోల్లో బస్సుల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. కొత్త బస్సులు వేయాలని ప్రజలు అడుగుతుంటే, మా దగ్గర సరిపడా బస్సులు లేవు అని డిపో మేనేజర్లు చేతులెత్తేస్తున్నారు.
ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? అలాగే ఇప్పటికే కాలం చెల్లిన పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఎప్పుడు ఇస్తారో మంత్రి గారు సమాధానం చెప్పాలి. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. దాటవేత ధోరణి మాని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను, బస్సుల కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.