Suryaa.co.in

Editorial

కాళేశ్వరం కోటలో ఏం జరుగుతోంది?

– నాడు బస్సులేసి ఉచిత సందర్శన
– నేడు కాలుబెట్టకుండా ఖాకీల కాపలా
– మావోల బూచి నిజమేనా?
– ఎవరిని కాపాడేందుకు?
– ‘మెగా మాయ’పై విమర్శల వాన
( మార్తి సుబ్రహ్మణ్యం)

అక్కడికెళితే బూచాడు ఎత్తుకెళతాడు..
అమ్మో.. చెప్పింది వినకపోతే చీకట్లోకి తీసుకువెళతారు..
అటు వెళితే అక్కడ బోలెడు తొండలున్నాయి..
చిన్నప్పుడు అన్నం తినకుండా మారాం చేసే పిల్లలను తలిదండ్రులు భయపెట్టే పద్ధతీ, టెక్నిక్కులివి. కానీ.. ఇప్పుడు 70 ఏళ్ల వృద్ధులను సైతం తెలంగాణ సర్కారు మావోల పేరిట, అటు వెళ్లడానికి వీల్లేదని ‘పోలీసురేఖ’ గీస్తున్న వైచిత్రి కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర గ్రామాల్లో కనిపిస్తోంది. కొద్దికాలం క్రితమే స్వయంగా కేసీఆర్ సర్కారే ‘కాళేశ్వరం చూతమురారండీ’ అని పాటపాడి, బస్సులేసి మరీ తీసుకువెళ్లింది. ఇప్పుడేమో.. అసలు ఆ ఛాయలకు వెళ్లడానికే వీల్లేదంటూ లక్ష్మణరేఖ గీయడం వింతల్లో వింత.

కేసీఆర్, ఆయన పార్టీ నాయకులు, పాలక ప్రభువులను అవసరార్ధం రెండుచేతులా కొనియాడే మీడియా దృష్టిలో, కాళేశ్వరం అనేది ప్రపంచంలో ఒక అద్భుతం.. అనన్యసామాన్యం.. అనితరసాధ్యం.. అపురూపమైన ప్రాజెక్టు. ఒక ‘జలవిజ్ఞాన’కేంద్రం. నిజమే. కేంద్రం దమ్మిడీ ఇవ్వకపోయినా, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం తన రెక్కలకష్టంతోనే నిధులిచ్చిన ‘మెగా’ ప్రాజెక్టు.kaleswaram-pump-houseపాలకులు ‘కుర్చీలేసుకుని మరీ కట్టించిన’ భారీ ప్రాజెక్టు. మేఘా కంపెనీ ‘తన వ్యాపార చరిత్రలో, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కారు చౌక’గా చేసిన భారీ ప్రాజెక్టు అది. ఎంతలా అంటే.. ఎంత పెద్ద వర్షాలు, వరదలొచ్చినా ‘చెక్కు’చెదరకుండా, మహా సిమెంట్ మాదిరిగా నిలబడే బాహుబలి జనరేటర్లతో నిర్మించిన ప్రాజెక్టు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. నిఖిల లోకమే నివ్వెరపోయేలా, తెలంగాణ ప్రతిష్ఠకు మకుటాయమానంగా నిలిచిన అత్యద్భుత ప్రాజెక్టు. నిజమే. దానిని ఎవరూ కాదనరు. కోట్లాదిరూపాయల పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత కాదని మాత్రం ఎవరంటారు?

మరి ఇన్ని అద్భుతాలు.. ఇన్నేసి అపూర్వ దృశ్యాలు సాక్షాత్కరించే కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు సామాన్యులు, రాజకీయ పార్టీలూ వెళ్లేందుకు ప్రభుత్వానికి, పోలీసులకూ ఉన్న అభ్యంతరాలేమిటన్నదే

ప్రశ్న. పోనీ.. అధికారులే తమను ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్లమని రాజకీయ పార్టీలు అడిగినా.. కాదు, కుదరదన్నంత రహస్యాలేమున్నాయి? ఏముంటాయి? వరదలకు బాహుబలి మోటార్లు అన్నీ చెక్కుచెదరకుండా, అలాగే బాహుబలిగా నిలిచి ఉన్నాయా? మునిగిపోయి పాడయిపోయాయా? పోనీ పాడయితే ఎన్ని పోయాయి? అవి పనిచేయడానికి ఎంత కాలం పడుతుంది? అసలు ఎన్ని పనిచేస్తున్నాయని చూసేందుకయినా, వెళ్లనీయకుండా ఆపడంలో మతలబేమిటి? పోనీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాజెక్టును పేల్చేందుకేమైనా బాంబులు, బరిసెలూ తీసుకువెళ్లడం లేదు కదా? పంచెలు, ఫ్యాంటూ షర్టులేసుకునే కదా వెళ్లేది? కొంపదీసి రాజకోట రహస్యం మాదిరిగా, కాళేశ్వరం కోటలో కూడా అలాంటి రహస్యాలేమైనా ఉన్నాయా?.. ఇదీ బుద్ధిజీవుల సందేహం.

బుద్ధిజీవులకు మాత్రమే కాదు. నిన్న సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సారధ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కాళేశ్వరానికి వెళితే వారిని ఖాకీలు అడ్డుకున్న తర్వాత.. కాంగ్రెస్ వారికీ వచ్చినimageడౌటనుమానం ఇది. ‘కాళేశ్వరమైనా నిషేధిత ప్రాంతమా? 144 సెక్షన్ పెట్టాల్సిన పనేమిటి? అసలక్కడ కాళేశ్వరం ఉందా? మాయమైందా? మమ్మల్ని వెళ్లనీయకుండా ఆపుతున్నారంటే ప్రభుత్వ వైఫల్యం కచ్చితంగా ఉంద’ని అప్పటికీ భట్టి అడగనే అడిగేశారు. మరి అడగరూ?! అక్కడికి వెళ్లకుండా ప్రజాప్రతినిధులను అటకాయిస్తే, అక్కడేదో గూడుపుఠాణీ జరుగుతోందని.. సర్కారు ఏదో దాస్తోందని, ఎవరినో రక్షించడానికి ఆపసోపాలు పడుతోందని బుర్ర బుద్ధీ ఉన్న ఎవరైనా అనుమానిస్తారు కదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలకూ అలాంటి అనుమానమే వచ్చింది మరి. దానిని తప్పుపట్టడానికి వీల్లేదు కదా? అయినా ఒక ప్రైవేటు ప్రాంతంలో పర్యటించాలంటే అనుమతి కావాలి గానీ, ప్రభుత్వ స్థలాలను పరిశీలించేందుకు వెళ్లడానికీ అనుమతులేమిటో ఎవరికీ అర్ధం కాదు.

ఇంతకూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లకుండా అడ్డుకుంది ఎందుకంటే.. మావోయిస్టుల సమస్య ఉన్నందుకట. అందుకనే వారిని అటు వెళ్లకుండా ఆపారట. ఇదీ పోలీసుల ‘కథ’నం! బాగుంది. ‘ఆయనే ఉంటే మంగలెందుక’ని.. అసలు మావోలే ఉంటే ఇంత కతెందుకన్నది నేతల వ్యాఖ్య. అప్పటికీ గతంలో ఓసారి రేవంత్‌రెడ్డి.. ఈ పరిస్థితిలో నక్సలైట్లు లేకపోవడం దురదృష్టకరమని కూడా వాపోయారు కూడా.

పోనీ.. కాసేపు పోలీసు ’కథ’నం ప్రకారమే అక్కడ మావోల కదలికలు ఉన్నాయనుకుందాం. మరి పోలీసులు ఉన్నది రక్షించడానికే కాబట్టి, ప్రజాప్రతినిధులను క్షేమంగా తీసుకువెళ్లి, లాభంగా తీసుకురావచ్చు కదా? అయినా ప్రభుత్వ కట్టడాల వద్ద తీవ్రవాదులుండి, కట్టడాల బయట ప్రజాప్రతినిధులు ఉంటే ఆ అవమానం ఎవరికి? పోయే ఇజ్జత్ ప్రభుత్వానికీ, పోలీసులకే కదా? అది ఆలోచించవద్దూ?!

కనీసం ఆ పట్టుదలతోనయినా ఎమ్మెల్యేలను, కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్లి ఉంటే పోలీసుల ప్రతిష్ఠ మరింత పెరిగేదే కదా? అలాకాకుండా.. అక్కడేదో రహస్యం ఉన్నట్లు.. దాన్ని సర్కారు దాస్తున్నట్లు పిడికిలి మూయడం ఎందుకు? తెరిస్తే అంతా బహిరంగమే కదా? అందునా కేసీఆర్ పారదర్శక పాలనలో ఈ రహస్యాలెందుకబ్బా?!

LEAVE A RESPONSE