అన్ని ఫ్యాక్టరీలకూ చంద్రబాబు హయాంలోనే శంకుస్థాపన చేశారని రాసుకుంటే టీడీపీ అనుకూల పత్రికలకు ఏం ప్రయోజనం?
(వేణుంబాక విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు)
‘‘ నవ్యాంధ్రప్రదేశ్‌లో అన్ని పరిశ్రమల (ఫ్యాక్టరీలు) శంకుస్థాపనలు, అంతకుముందు వాటికి భూసేకరణలు, కేటాయింపులు, అన్ని రకాల అనుమతులు వంటి పనులన్నీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చివరి పాలనా కాలం 2014–2019లోనే జరిగిపోయాయి.’’ ఇదీ–పూర్వపు పాలకపక్షం, ప్రస్తుత విపక్షం తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల ప్రచార ధోరణి. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉనికిలో ఉన్న కాలం 1956–2014 మధ్య రోజులు ఈ టీడీపీ ప్రేరేపిత మీడియాకు గుర్తుంటుంటాయో లేదో అనుమానమే.
కానీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి ఆఖరి హయాం సంగతులు మాత్రం ఆయన నీడన ప్రయోజనం పొందిన తెలుగు మీడియాకు ఇప్పుడు బాగా జ్ఞప్తికి వస్తున్నాయి. అందుకే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గత మూడున్నరేళ్లుగా ఏపీలో ఏమూలన ఏ ఫ్యాక్టరీ లేదా పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభ కార్యక్రమానికి హాజరైనా ఈ ‘పక్షపాత’ పత్రికలు ఒక్కసారిగా 2014-19 కాలంలోకి శరవేగంతో పయనిస్తాయి. బాబు గారి ఆధ్వర్యంలో అప్పుడు జరిగిన ‘నిర్మాణాత్మక’ శంకుస్థాపన కార్యక్రమాలు పాఠకులకు గుర్తుచేస్తాయి.
ఈ తంతు ఈ మీడియాకు ఒక ఆనవాయితీగా మారిపోయింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో ఏర్పాటైన ‘రామ్ కో సిమెంట్స్’ కర్మాగారాన్ని బుధవారం బజర్ నొక్కి ప్రారంభించారు సీఎం జగన్. ఈ వార్తతోపాటే చంద్రబాబు గారి ‘కీర్తి కిరీటాన్ని’ చంద్ర మండలం దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేసేలా ఒక కథనాన్ని ఈ పత్రికలు ప్రచురించాయి. ఈ కర్మాగారం శంకుస్థాపన తెలుగుదేశం హయాంలోనే జరిగిందని పెద్ద పరిశోధన చేసి వెలుగులోకి తెచ్చామనే రీతిలో రెచ్చిపోయాయి ఈ టీడీపీ ఘన చరిత్రను నిరంతరం గుర్తుచేసే పత్రికలు.
ఒక రాష్ట్రంలో ఐదేళ్ల పదవీ కాలానికి ఎన్నికైన రాజకీయ పక్షం పాలనాకాలంలో అనేక కంపెనీలు అక్కడ ఫ్యాక్టరీలు, ప్లాంట్లు పెట్టడానికి శ్రీకారం చుట్టడం సర్వసాధారణం. అయితే, నిర్మాణం పూర్తయి ఈ కర్మాగారాలు ఉత్పత్తి ప్రారంభించడానికి ఈ ఐదేళ్ల కాలం చాలదు. ఈలోగా ఎన్నికలొచ్చి పాలకపక్షం మారితే, కొత్త పాలక పార్టీ హయాంలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించడం కూడా మామూలు వ్యవహారమే. ఏ నిర్మాణాత్మక కార్యక్రమమైనా ఏ రాజకీయ పార్టీ పాలనా కాలంలో ఉత్పత్తి దశకు చేరుకుంటే సహజంగానే ఈ ప్రారంభోత్సవాలకు ఎక్కువ ప్రచారం లభిస్తుంది.
2019 మే 30 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో ఇలా అనేక కంపెనీల కర్మాగారాల్లో ఉత్పత్తి మొదలైంది. ప్రారంభ కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగాయి. ఈ సాధారణ పారిశ్రామిక ప్రక్రియను ఈ పత్రికలు రెండు దశలుగా విభజించి, చంద్రబాబు హయాంలో శంకుస్థాపన, జగన్ గారి హయాంలో ప్రారంభం అంటూ పాఠకులకు కొత్త పాఠాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నవ్వులపాలవుతున్నాయి. ఇలాంటి పోకడలు ఈ మీడియా సంస్థల విశ్వసనీయతను తగ్గిస్తాయేగాని పెంచవు.