జనసేన కలి‘విడి’ కదనం?

- కుదిరిన చోట కూటమితో కలసి పోరు
- కలవని చోట ఫ్రెండ్లీ ఫైట్
-ఇకపై 15 శాతానికి పరిమితం ఉత్తిమాటే - అది అసెంబ్లీ ఎన్నికలకే పరిమిత బంధం
- బలం ఉన్న చోట పోటీ చేసి తీరాల్సిందే
- నిర్ణయాధికారం పార్లమెంటు నియోజకవర్గ నేతలదే
- సీట్లపై కుండబద్దలు కొట్టిన జనసేనాని
- జనసైనికుల రుణం తీర్చుకోనున్న పవన్ కల్యాణ్
- విశాఖ, విజయవాడ మేయర్ స్థానాల్లోనూ పోటీ?
- విశాఖను పవన్‌కు బహుమతిగా ఇస్తామన్న జనసేన నేత పీతల మూర్తి యాదవ్
- నాదెండ్ల ప్రకటనలపై జనసైనికుల కన్నెర్ర
- సీట్ల చర్చల్లో మనోహర్‌ను తప్పించాలంటున్న జనసైనికులు
- చర్చల్లో నాగబాబును పెట్టాలని డిమాండ్
- నాదెండ్లలో పార్టీ కోణం నిపించడం లేదన్న ఫిర్యాదులు
- బలం ఉన్న చోట అనే పదానికి ప్రాతిపదిక ఏమిటని నిలదీస్తున్న జనసైనికులు
-పవన్ నిర్ణయంపై జనసైనికుల్లో ఖుషీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
రాష్ట్ర రాజకీయాల్లో తనను ఈ స్థాయికి చేర్చిన జనసైనికుల రుణం తీర్చుకునేందుకు జనసేన దళపతి పవన్ కల్యాణ్ మానసికంగా సిద్ధమవుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలను గెలిపించాలన్న లక్ష్యంతో స్థిరమైన అడుగులేస్తున్నారు. అందులో భాగంగా, తన కార్యకర్తలకు న్యాయం చేయడం కోసం అవసరమైతే, ఫ్రెండ్లీఫైట్‌కు సిద్ధమేనని ప్రకటించడం ద్వారా.. పవన్ కల్యాణ్ తన రాజకీయ భవిష్యత్తును వ్యూహాత్మకంగా నిర్మించుకునే ఎత్తుగడలో అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
‘‘రాష్ట్రంలో కూటమి బలంగా ఉండాలి. అదే సమయంలో ఎవరి గౌరవం తగ్గకూడదు. అలాగే జనసేన గౌరవానికి భంగం కలగకుండా అడుగులు వేస్తున్న’’ట్లు పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన వెనక అసలు కారణం కూడా అదేనంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం పరిమితమైన ‘15 శాతం’ అనే పదానికి స్వయంగా ఆయనే తెరదించి.. ‘ఎక్కడ బలం ఉంటే అక్కడ’ అన్న సూత్రంతో కార్యకర్తలను గెలిపించాలన్న కొత్త నిర్ణయానికి తెరలేపడం, జనసైనికుల పెదవులపై చిరునవ్వులు పూయించింది. పవన్ తాజా నిర్ణయంపై, జనసైనికుల్లో ఎన్నికల సమరోత్సాహం తొంగిచూస్తోంది.
స్థానిక సమరంపై జనసేనాధిపతి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా చేసిన ప్రకటన జనసైనికుల్లో సమరోత్సాహం నింపాయి. ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర రాజకీయాల్లో జనసేన విస్తరణ కాంక్షను స్పష్టం చేశాయి. అదే సమయంలో తన పార్టీని ఇక 15 శాతానికే పరిమితం చేశారన్న ప్రచారానికి ఆయనే స్వయంగా తెరదించడం మరో కీలక పరిణామం.
‘ 15 శాతానికి అంగీకరించామన్న మాట ఎవరు చెప్పారో నాకు తెలియదు. ఆ మాట చెప్పిన వారికి ఆ స్థాయి లేదు. నేను సీఎం గారితోనే నే రుగా మాట్లాడతా. గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను రాష్ట్ర ప్రయోజనాల కోణంలో కొంత తగ్గిన మాట నిజం. ఎంపి సీట్లలోనూ సర్దుకుపోయినందుకే మనకు ఢిల్లీ వాళ్లు విలువ, ప్రాధాన్యం ఇస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ సూత్రం కుదరదు. ఇది కార్యకర్తల ఎన్నికలు. మేం మీతో ఉండాల్సిన ఎన్నికలు. మీరు ఎన్నికల్లో మన పార్టీ సత్తా చాటండి. కుదిరిన చోట కలసి పోటీ చేద్దాం. లేకపోతే ఫ్రెండ్లీ ఫైట్ చేద్దాం. ఇంకా ఏమైనా ఉంటే నేను సీఎం గారితో మాట్లాడతా. నేను ఎట్టి పరిస్థితిలో కార్యకర్తలను నిరాశపరచను. స్థానిక సంస్థల్లో ఏయే స్థానాల్లో పార్టీ బలంగా ఉంది? ఎక్కడెక్కడ పోటీ చేస్తే బాగుంటుందో అధ్యయనానికి నియమించిన కమిటీలతో నేతలు కలసి తగిన నిర్ణయం తీసుకోండి. ఎక్కడైనా కూటమి పార్టీలకు చెందిన స్ధానాల్లో ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందని భావిస్తున్నారో అక్కడ పోటీ చేస్తే చేయవచ్చు. ఈ వ్యవహారంలో నేను జోక్యం చేసుకోను. పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులే నిర్ణయం తీసుకుంటారు. జనసేనను ఈ స్థాయికి తీసుకువచ్చింది మీరే. రానున్న రోజుల్లో జనసేన విస్తరణపై దృష్టి పెడదాం’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అంటే ఎన్నికల్లో కూటమి సీట్ల చర్చల్లో తాము కోరిన స్థానాలు, మున్సిపాలిటీలు దక్కకపోతే అక్కడ ఫ్రెండ్లీ ఫైట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతుంది. పొత్తు కుదిరిన చోట మాత్రం కూటమి గానే పోటీ చేయాలని పవన్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అంటే సూటిగా చెప్పాలంటే కుదిరిన చోట కలసి, కుదరని చోట విడిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు స్పష్టమవుతుంది.
సేనాని ప్రకటనతో సైనికుల్లో నయా జోష్.. కానీ
జనసేనాధిపతి ప్రకటన తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఉంటుందా? ఉండదా? టీడీపీ తమకు ఎన్ని సీట్లు ఇస్తుంది? అని ఊగిసలాడుతున్న జనసైనికులకు ఫుల్ జోష్ వచ్చింది. ఒకవేళ తాము అడిగిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, డివిజన్లు, వార్డుల్లో సీటు ఇవ్వకపోతే పవన్ చెప్పినట్లు..అక్కడ ఫ్రెండ్లీ ఫైట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు జనసైనికులు పవన్‌కు కృతజ్ఞత చెబుతున్నారు.
అయితే.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమ కోసం ఇంత స్థిరంగా నిలబడితే, మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం పలు సందర్భాల్లో క్యాడర్‌ను గందరగోళంలో పడేసే ప్రకటనలు చేస్తున్నారని, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలిచే స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తామని చెప్పడంపై మండిపడుతున్నారు.
‘గెలిచే చోట, బలం ఉన్న చోట అన్న దానికి ప్రాతిపదిక ఏమిటి? మనం పోటీ చేస్తేనే కదా తెలిసేది? మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 చోట్ల బలం ఉంటనే గెలిచిందా? టీడీపీ అన్ని స్థానాలు బలం ఉంటేనే గెలిచిందా? కాదు కదా?! అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ పడింది. కానీ ఈసారి కూడా మేం ఎందుకు రాజీపడతాం? ఆ పనిచేయాల్సింది కూటమిలోని మిగిలిన రెండు పార్టీలు కదా? అసలు ఈ 15 శాతానికి పరిమితం అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు చెబితే వచ్చిందో మాకు తెలుసు. అది కల్యాణ్ గారికీ తెలుసు. కానీ స్థానిక ఎన్నికల్లో 15 శాతం పోటీ అనేది కుదరదు. ఇకపై ఆ 15 శాతం అనే మాట వినిపించకుండా చేస్తాం. మీరు ఒక విషయం గమనించాలి. కల్యాణ్ గారు పోటీపై నిర్ణయం తన చేతుల్లో లేదు. స్థానిక నాయకుల చేతిలో పెట్టానని చెప్పారు. అంటే కూటమి నేతలు స్థానికంగా మాట్లాడుకోవాలన్నమాట’’ అని జనసేన సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు.
ప్రస్తుత పరిస్థితిలో అటు మిత్రపక్షమైన టీడీపీలో కూడా పోటీ తీవ్రంగా ఉందని, వారు కూడా సీట్లు ఆశిస్తున్నందున చివరలో దాదాపు మెజారిటీ స్థానాల్లో ఫ్రెండ్లీఫైట్ తప్పకపోవచ్చని జనసేన సీనియర్ నాయకులు చెబుతున్నారు.
‘టీడీపీ నేతల పోటీని తప్పుపట్టలేం. వారి వాదనలో కూడా న్యాయం ఉంది. పైగా చాలాకాలం నుంచి వాళ్లు జనంలో ఉంటున్నారు కాబట్టి సీటు ఆశించడంలో తప్పులేదు. మేము, బీజేపీ రంగంలో ఉన్నందున ఆయా చోట్ల వాళ్ల అవకాశాలు పోతాయి. అందువల్ల కల్యాణ్ గారు చెప్పినట్లు ఫ్రెండ్లీ ఫైట్ చేయడమే అందరికీ మంచిది. అప్పుడు ఏ పార్టీకి ఎంత బలమన్నది తేలిపోతుంది’’ అని ఆయన విశ్లేషించారు.
విశాఖ, విజయవాడపైనే గురి కాగా విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లపైనా జనసేన సీనియస్‌గా దృష్టి సారిస్తోంది. సీట్ల సర్దుబాటు చర్చల్లో, ఆ రెండు కార్పొరేషన్లను కచ్చితంగా తీసుకునేందుకు పట్టు పట్టాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మిగిలిన కార్పొరేషన్లు విడిచిపెట్టి..కేవలం విశాఖ, విజయవాడ కార్పొరేషన్లు మాత్రం కచ్చితంగా తీసుకోవాలని భావిస్తోంది. అక్కడ పార్టీ క్యాడర్ ఎక్కువగా ఉండటం, కాపు సామాజిక కోణం దానికి కారణంగా చెబుతున్నారు. అందుకు తగినట్లుగానే విశాఖ జనసేన మాజీ కార్పొరేటర్, ప్రజల్లో విపరీత ఆదరణ, ఇమేజ్ ఉన్న పీతల మూర్తి యాదవ్ సైతం.. విశాఖ మేయర్ గెలిచి పవన్ కల్యాణ్ గారికి బహుమతిగా ఇస్తామని’ ముందస్తుగా ప్రకటించడం ప్రస్తావనార్హం.
సీట్ల సర్దుబాటు చర్చల్లో నాగబాబును పెట్టండి
ఇక సీట్ల సర్దుబాటు, పోటీ అంశాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవలి కాలంలో చేస్తున్న ప్రకటనలు, క్యాడర్‌ను గందరగోళంలో పడేస్తున్నాయన్న విమర్శలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆయన ధోరణి పరిశీలిస్తే.. పార్టీ 15 శాతం స్థానాల్లోనే పోటీకి పరిమితం అవుతుందన్న భావన, కూటమిని ఇబ్బంది పెట్టకూడదన్న వైఖరి కనిపిస్తోంది తప్ప, జనసైనికుల్లో ఉత్సాహం నింపడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఒకవైపు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ క్యాడర్‌లో సమరోత్సాహం నింపుతుంటే.. మరోవైపు మంత్రి మనోహర్ వైఖరి మాత్రం మనకు బలం ఉన్న చోట మాత్రమే పోటీ చేద్దామనే నిరుత్సాహపూరితంగా ఉందంటున్నారు. ‘మనోహర్ గారి వైఖరి చూస్తుంటే టీడీపీకి ఇబ్బందికలగకుండా చూడాలన్నట్లుంది. ఇది మా పార్టీ నాయకులు కూడా గమనించారు. తెనాలిలో జనసేన బలంగా లేకపోయినా పోటీ చేసి గెలిచాం కదా? మరి అక్కడ బలం లేదని తెనాలిని సీట్ల సర్దుబాటులో తీసుకోకుండా ఉండలేదు కదా? ఆయన గెలిచారు కాబట్టి తెనాలిలో పార్టీ బలంగా ఉందని అర్ధమయింది. అదే తెనాలిలో పార్టీ బలంగా లేదని దానిని తీసుకోకపోతే, మనోహర్ ఎమ్మెల్యే అయి, మంత్రిగా ఉండేవారు కదా? ఇవి కూడా అంతే! ఆయన ప్రకటనలు క్యాడర్‌ను పూర్తి నిరుత్సాహంతో నింపేస్తున్నాయి. కాబట్టి సీట్ల సర్దుబాటు చర్చల్లో సాధ్యమైనంతవరకూ మనోహర్ గారిని పక్కన పెట్టి, పార్టీ కోణంలో ఆలోచించే ఎమ్మెల్సీ నాగబాబును ఉంచితే పార్టీకే మంచిద’ ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.
పవన్ స్వయంగా మనం ఈ స్థాయిలో ఉండేందుకు కారణమైన జనసైనికులకు సీట్లు, పదవుల్లో 30 నుంచి 40 శాతం ప్రాధాన్యం ఇవ్వాలని సభాముఖంగా కుండబద్దలు కొట్టారు. మంత్రి మనోహర్ కూడా.. బయట మీడియాకు అదే వైఖరి స్పష్టం చేయకుండా, అందుకు భిన్నమైన వాణి వినిపిస్తుండటమే కార్యకర్తల అసంతృప్తికి అసలు కారణం.
మనోహన్ దిద్దుబాటు
బహుశా తనపై పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న విషయం గమనించిన తర్వాతనే, నాదెండ్ల మనోహన్ దిద్దుబాటు ప్రకటన చేసినట్లుంది. తాజా సభలో ఆయన ‘ నా వ్యాఖ్యలను కొంతమంది జనసైనికులు అపార్ధం చేసుకున్నారు. కానీ నా ఉద్దేశం అది కాదు. పార్టీ బలంగా ఉన్నచోట పోటీ చేయాలన్నదే నా ఉద్దేశమ’ని వివరణ ఇచ్చుకోవలసి రావడం ప్రస్తావనార్హం. ఇది జనసైనికుల్లో నాదెండ్ల వ్యవహారశైలిపై వెల్లడయిన అసంతృప్తికి నిదర్శనమంటున్నారు.
