– కేసు కోల్డు స్టోరేజీలోనేనా?
– నాడి సీఐడి చీఫ్ సునీల్‌పై గత జూన్‌లో ఫిర్యాదు చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు
– ఆ కేసులో సునీల్, పీఎస్సార్, జగన్‌పై కేసు నమోదు
– ఏ-1గా సునీల్, ఏ-2గా పీఎస్సార్, ఏ-3గా జగన్, ఏ-4గా విజయపాల్, ఏ -5గా డాక్టర్ ప్రభావతి
– ఇప్పటికే విజయపాల్ అరెస్టు, బెయిల్‌పై విడుదల
– డాక్టర్ ప్రభావతికి ముందస్తు బెయిల్
– ఇదే కేసులో తులసీబాబు అరెస్టు, బెయిల్
– ఇప్పటివరకూ సునీల్‌ను పిలిపించని పోలీసులు
– డిఐజీ సునీల్‌నాయక్‌ను పిలిపించరేం?
– జిత్వానీ కేసులో పీఎస్సార్, విశాల్ గున్నీని విచారించిన పోలీసులు
– ఏసీబీ కేసులో సంజయ్ విచారణ, అరెస్టు
– మరి రఘురామరాజు కేసులో సునీల్‌ను విచారించరా?
– డిప్యూటీ స్పీకర్ ఫిర్యాదుకే దిక్కులేకపోతే ఎలా?
– కేసు నత్తనడక పై టీడీపీ వర్గాల విస్మయం
( మార్తి సుబ్రహ్మణ్యం)
నత్తలూ నవ్వుతున్నాయ్ మరి… ఆయన ఒక డిప్యూటీ స్పీకర్. అంటే స్పీకర్ తర్వాత రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తిన్నమాట. మరి స్వయంగా ఆయన ఇచ్చిన ఫిర్యాదుకే దిక్కులేకపోతే ఎలా? ఫిర్యాదు చేసి ఏడాది దాటినా ఏ-1ను విచారించే ధైర్యం ఎందుకు చేయడం లేదు? ఆయనను విచారణకు పిలిచేందుకు పోలీసులు ఎందుకు మొహమాటపడుతున్నారు? ఆయన కంటే పైహోదాలో ఉన్న అధికారులనే విచారణకు పిలిచి, జైలుకు పంపిన పోలీసులు.. ఆ అధికారిని చూసి మాత్రం ఎందుకు వణికిపోతున్నారు? ఎవరి ఒత్తిళ్లు వారి చేతులు ముడుచుకునేలా చేస్తున్నాయి? చేతులు కట్టేసేలా చేస్తున్నాయి? అసలు కూటమిలో సదరు అధికారిని కాపాడుతున్న అదృశ్యశక్తులెవరు? మంత్రి, ఎంపి, ఎమ్మెల్యే ముచ్చటగా ముగ్గురు మూర్తులే ఆయనకు రక్షణ కవచంగా ఉన్నారా? అసలు బాధితుడయిన రఘరామరాజు కేసులో నిందితుడిగా ఉన్న ఐపిఎస్ అధికారిని విచారించకుండా తెరవెనక ఏం జరుగుతోంది? ఒక డిప్యూటీ స్పీకర్‌కే తక్షణ న్యాయం జరగకపోతే, ఇక సామాన్య కార్యకర్తల సంగతేమిటి?..
ఇదీ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్‌టాపిక్. టీడీపీ అధినేత చంద్రబాబు మినహా.. మిగిలిన విపక్ష నేతలు వైసీపీ నియంత పాలనకు నిలువునా వణికిపోయి, కేసుల భయంతో వెనకంజ వేసిన కాలంలో.. జగన్‌పై సమరశంఖం పూరించి, ఢిల్లీ వేదికగా వైసీపీ సర్కారు అవినీతిపై రచ్చబండ పెట్టి, జగన్ అవినీతిని దేశానికి చాటిన నాటి వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణంరాజుపై జగన్ సర్కారు కేసు పెట్టింది.
హైదరాబాద్‌లోని తన నివాసంలో..కుటుంబసభ్యుల మధ్య తన పుట్టినరోజు సంతోషంగా నిర్వహించుకుంటున్న రఘురామరాజును సీఐడి పోలీసులు చెరబట్టి, గుంటూరుకు తీసుకువచ్చిన వైనం తెలిసిందే. ఆ సమయంలో సీఐడి చీఫ్‌గా ఉన్న సునీల్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం తనను కస్టోడియల్ టార్చర్ పెట్టిందంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గత ఏడాది జూన్‌లో గుంటూరు ఎస్పీకి స్వయంగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తన న్యాయవాది ఉమేష్‌తో జిల్లా ఎస్పీని కలిసి, తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పించారు. ఆ మేరకు ఏ-1 గా నాటి సీఐడీ చీఫ్ సునీల్, ఏ-2 గా నాటి ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్, ఏ-3గా నాటి సీఎం జగన్, ఏ-4 గా నాటి అడిషనల్ ఎస్పీ విజయపాల్, 1-5 గా గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరెంటెండెంట్ డాక్టర్ ప్రభావతిపై కేసు నమోదయింది.
ఆ తర్వాత విజయపాల్‌ను విచారణకు పిలిపించి, ఆయనను అరెస్టు చేశారు. విచారణకు వచ్చిన తర్వాత డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఆ తర్వాత రఘురామరాజు గుండెపై కూర్చుకుని హింసించిన గుడివాడకు చెందిన తులసిబాబును విచారించి, ఆయనను అరెస్టు చేశారు. కొద్దినెలల క్రితం తొలుత విజయపాల్, తర్వాత తులసిబాబుకు బెయిల్ వచ్చింది. తులసిబాబును గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పరామర్శించారు. ఇదీ రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటివరకూ జరిగిన పురోగతి. ఇది కూడా రఘురామరాజు డజన్ల సార్లు.. గుంటూరు ఎస్పీని కలసి.. నా ఫిర్యాదు ఏమైందంటూ ప్రశ్నించిన తర్వాతనే కేసు కదలడం ప్రస్తావనార్హం. కాగా ఈ కేసులో ఏ-4 విజయపాల్తోపాటు, గుడివాడ తులసిని విచారణకు పిలిపించిన పోలీసులు ఇప్పటివరకూ ఏ-1 గా ఉన్న నాటి సీఐడీ దళపతి సునీల్‌ను మాత్రం ఇప్పటివరకూ కనీసం విచారణకు పిలిపించకపోవడమే ఆశ్చర్యం.
అప్పుడంటే ఆయన సర్వీసులో ఉన్నందున, పోలీసులకు కొంత మొహమాటం ఉందనుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. అయినా ఇప్పటిదాకా నోటీసు కూడా ఇవ్వకపోవడం బట్టి, కూటమిలో సునీల్‌ను తెరవెనక శక్తులు రక్షిస్తున్నాయన్న తప్పుడు సంకేతాలు వెళ్లేందుకు కారణమవుతోంది. ఇది తమ ప్రభుత్వ ప్రతిష్ఠకు దెబ్బేనని టీడీపీ వర్గాలు, రఘురామరాజు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి అదే పోలీసులు.. ముంబయి నటి జిత్వానీ కేసులో ఇంటలిజన్స్ చీఫ్‌గా పనిచేసిన సీనియర్ ఐపిఎస్ పీఎస్సార్ ఆంజనేయులును పిలిచి, విచారించి జైలుకు పంపించారు.
అదే కేసులో జిత్వానీని ముంబయికి వెళ్లి, ఆమెను తీసుకువచ్చిన ఐపిఎస్ అధికారి విశాల్ గున్నీని విచారణకు పిలిపించారు. తాను నాటి తనపై అధికారి కాంతిరాణా టాటా ఆదేశాల మేరకే, ముంబయి వెళ్లానంటూ అప్రూవర్‌గా మారారు. కానీ విచిత్రంగా కాంతీరాణాను ఆ కేసులో ఇప్పటిదాకా విచారణకు పిలవ కపోవడమే ఆశ్చర్యం. ఇక ఫైర్ సర్వీసు డీజీగా ఉన్న సంజయ్‌పై ఉన్న అవినీతి కేసులో విచారణకు పిలిచి, అరెస్టు చేశారు. కానీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు.. తనను కస్టోడియల్ టార్చర్ చేశారని ఫిర్యాదు చేసిన ఐపిఎస్ అధికారి సునీల్‌ను ఇప్పటివరకూ, పోలీసులు విచారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై విచారణాధికారిగా ఉన్న విజయనగరం ఎస్పీ దామోదర్‌ను వివరణ కోరగా.. విచారణ జరుగుతున్నందున తానేమీ చెప్పలేనని వ్యాఖ్యానించారు. సునీల్‌కు త్వరలో నోటీసులు ఇస్తాం. ఇంతకుమించి మేము మాట్లాడకూడదు అన్నారు. నిజానికి.. కళ్లకు కర్చీఫులు కట్టుకుని వచ్చిన ఐదుగురు కానిస్టేబుళ్లు తనను చిత్రహింసలకు పాల్పడ్డారని, అందులో తులసి అనే వ్యక్తి తన గుండె కూర్చున్నారని, ఇదంతా సునీల్ ఆదేశాల మేరకే జరిగింది కాబట్టి సునీల్‌తోపాటు, తనను హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనను కొడుతున్న దృశ్యాలను జగన్‌కు చూపించారని కూడా రాజు తన ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. దానితో విచార ణకు రంగంలోకి దిగిన ఎస్పీ దామోదర్.. ఆరోజు రఘురామరాజును నిర్బంధించిన పోలీసులను విచారించి వారి నుంచి 164 కింద స్టేట్మెంట్లు తీసుకున్నారు.
ఆ ప్రకారంగా.. తాము అప్పటి సీఐడి చీఫ్ సునీల్ ఆదేశాల మేరకు, డిఐజీ సునీల్ నాయక్ చెప్పినట్లే చేశామని స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. అదే సమయంలో ఈ విషయం బయటకు పొక్కితే ఎవరినీ వదిలిపెట్టమని బెదిరించారంటూ, అక్కడి పోలీసులు తమ స్టేట్మెంట్లో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా.. రఘురామరాజును కొడుతున్నప్పుడు, సునీల్ నాయక్ పక్క గదిలోనే ఉన్నారని వారు స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం.
సునీల్-నాయక్‌ను విచారణకు పిలవరా? రఘురామకృష్ణంరాజు కేసు విచారణలో ఇప్పుడు కీలక వ్యక్తి డిఐజి సునీల్ నాయక్. ఆయన ఇప్పుడు బిహార్ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. జగన్ జమానాలో డిప్యుటేషన్‌పై ఏపీకి వచ్చారు.
అయితే రఘురామరాజు ఫిర్యాదు తర్వాత, పోలీసులు ఆయనను విచారణకు రావాలని నోటీసులిచ్చారు. కానీ నాయక్.. బిహార్ క్యాడర్‌కు చెందిన తనను ఏపీ పోలీసులు విచారణకు పిలిచే అధికారం లేదని, కేసు పరిథి ఇక్కడికి కాదంటూ పాట్నా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దానితో ప్రభుత్వం ఆయనను విచారణకు అనుమతించాలని పాట్నా హైక్టోర్టులో పిటిషన్ వేసింది. బాధితుడయిన రఘురామరాజు కూడా అందులో ఇంప్లీడ్ అయ్యారు. నిజానికి ఈ కేసులో రఘురామకృష్ణంరాజుపై ఎవరూ ఫిర్యాదు చే యలేదు. సీఐడీనే సుమోటోగా తీసుకుంది. అప్పటి సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ ఫిర్యాదుదారుగా, రఘురామరాజుపై కేసు నమోదు చేశారు.
దానితో.. ఫిర్యాదుదారుడికి కేసు నమోదు చేసే అధికారం లేదంటూ, రఘురామరాజు పాట్నా హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై కేసు పెట్టినప్పుడు సునీల్ నాయక్ ఏపీలోనే పనిచేసినందున, ఆయనను విచారణకు హాజరుకావాలని ఆదేశించాలంటూ రఘురామరాజు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. అంటే దీన్నిబట్టి.. అటు రఘురామరాజును హింసించే కార్యక్రమానికి దర్శకత్వం వహించారంటున్న సునీల్‌ను గానీ.. పక్క గదిలోనే ఉండి, అదే రఘురామరాజును హింసిస్తున్నప్పుడు చోద్యం చూశారంటున్న సునీల్ నాయక్ గానీ.. ఎవరూ విచారణకు హాజరుకాలేదన్నమాట! –.. ఎవరా ఎంపీ? ఏమా కథ? డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కేసులో ఐపిఎస్ అధికారి సునీల్‌ను రక్షించేందుకు.. కూటమిలో కొందరు కీలక ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వివాదాస్పద నేతగా మారిన ఒక ఎంపీ.. సునీల్‌ను కాపాడేందుకు తీవ్రస్ధాయిలో ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో చేసిన ఆర్ధిక సాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఆ మేరకు రంగంలోకి దిగారంటున్నారు. ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగానే ఈ విషయం వెల్లడించిన విషయం తెలిసిందే. సునీల్ సస్పెన్షన్‌కు సంబంధించి విచారణాధికారిగా ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్‌పై ఆ మేరకు ఆ వివాదాస్పద ఎంపి ఒత్తిడి చేసి, సునీల్‌ను పరిశుద్ధుడిగా సర్టిఫికెట్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉండగా.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొత్తగా ఎన్నికయిన ఒక ఎన్నారై ఎమ్మెల్యే కూడా, సునీల్ కోసం శ్రమదానం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
విదేశాల్లో వ్యాపార భాగస్వామ్య బంధంతోనే సదరు ఎమ్మెల్యే, ఈ లాబీయింగ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఆయన భార్యతో, సదరు అధికారికి బంధుత్వం కూడా ఉందంటున్నారు. గుంటూరు సీఐడీ ఆఫీసులో రఘురామకృష్ణంరాజు గుండెపై కూర్చుని ఆయనను హింసించిన వ్యక్తి కూడా, సదరు ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడన్న విషయం బహిరంగమేనంటున్నారు.
ఇక ఉత్తరాంధ్రలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక మంత్రి కూడా, సునీల్‌కు మద్దతుగా రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. గత నెలలో విశాఖ ఎయిర్‌పోర్టులో వారిద్దరి మధ్య మంతనాలు జరిగాయన్న ప్రచారం జరుగుతోంది. ఇలాగైతే ఎలా? జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ఆయనను సవాల్ చేసి.. నాలుగేళ్లు నియోజకవర్గానికి దూరంగా, ఢిల్లీ కేంద్రంగా పోరాటం చే సిన డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుకే న్యాయం జరగలేదన్న సంకేతాలు వెళితే, క్షేత్రస్థాయిలో వైసీపీతో పోరాడుతున్న కార్యకర్తల పరిస్థితి ఏమిటన్న చర్చకు తెరలేచింది. సునీల్‌ను ఇప్పటివరకూ కనీసం విచారణకు పిలవలేని దుస్థితి ఏర్పండిందన్న భావన, పార్టీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుందంటున్నారు. సునీల్‌ను విచారణకు పిలవకపోతే.. ఆయన వెనుక కూటమి నేతలున్నారన్న ప్రచారం నిజమవుతుందని పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.