– మేడారం పనులు పొంగులేటి కంపెనీకి ఎలా ఇస్తారు?
– మా జిల్లాలో పొంగులేటి పెత్తనమేంటి?
– ఖర్గే, సోనియా, రాహుల్, మీనాక్షికి కొండా మురళి ఫిర్యాదు
– నా శాఖలో పొంగులేటి జోక్యం ఏంటి?
– సీఎం రేవంత్‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
– పొంగులేటిపై భగ్గుమంటున్న బడుగులు
– అగ్రకుల మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకునే దమ్ముందా అని ఆగ్రహం
– కాంగ్రెస్‌లో కాంట్రాక్టుల కిరికిరి
హైదరాబాద్: తెలంగాణలో ఇద్దరు కీలక నేతల మధ్య ఆధిపత్యపోరు ముదురుపాకాన పడింది. వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ శాఖలో ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకోవడంతో అగ్గిరాజుకుంది. దీనితో వరంగల్ జిల్లా ఫైర్‌బ్రాండ్ కొండా మురళి మంత్రి పొంగులేటి పెత్తనాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మంత్రి కొండా సురేఖ సైతం సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేయడంలో కాంగ్రెస్‌లో కాంట్రాక్టుల కథ కొత్త మలుపు తిరిగినట్లయింది.
వరంగల్ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని, మంత్రి తన సొంత కంపెనీకి మేడారం పనులను ఇప్పించుకుంటున్నారని, వరంగల్ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది మేడారం జాతరను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మేడారం టెండర్ల వ్యవహారంలో పొంగులేటి తన సొంత కంపెనీకి పనులు ఇప్పించుకుంటున్నారని కొండా మురళి భార్య, మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు కూడా కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో అధిష్ఠానం నుంచి తమకు సానుకూల స్పందన వచ్చిందని కొండా మురళి తెలిపారు.
కాగా ఇద్దరు మంత్రుల మధ్య తలెత్తిన వివాదం, ఆధిపత్యపోరును సీఎం రేవంత్‌రెడ్డి ఎలా పరిష్కరిస్తారో చూడాలి. నిజానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబానికి ఫాలోయింగ్ ఉంది.
భగ్గుమంటున్న బీసీ సంఘాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీసీలకు బాసటగా నిలిచే కొండా కుటుంబానికి, మంత్రి పొంగులేటి చెక్ పెట్టే ప్రయత్నం చేయడంపై బీసీ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీసీలను అణగదొక్కే పొంగులేటి రాజకీయ కుట్రను ఎదుర్కొంటామని, జిల్లాలో రెడ్ల పెత్తనం ఏమిటని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి కొండా కుటుంబం చేసిన పోరాటం, త్యాగాలు వేరే జిల్లాకు చెందిన పొంగులేటికి ఏం తెలుసని బీసీ సంఘ నేతలు విరుచుకుపడుతున్నారు. పొంగులేటి ఇదే మరో అగ్రకులానికి చెందిక మంత్రి శాఖలో జోక్యం చేసుకునే ధైర్యం చేస్తారా? రెడ్డి,వెలమ, కమ్మ మంత్రుల శాఖల్లో ఇలాగే జోక్యం చేసుకుంటారా? బీసీలంటే ఎందుకంత అసలు? అని బీసీ సంఘాలు విరుచుకుపడుతున్నాయి.