Suryaa.co.in

Editorial

‘గీత’ దాటినందుకేనా?

– మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్టుతో బీజేపీ ఇచ్చే సంకేతాలేమిటి?
– సీబీఐ ఎన్డీఏ గూటిలో చిలక కాదని చెప్పడమే లక్ష్యమా?
– సొంత పార్టీ నేతలయినా అరెస్టు చేస్తామని చెప్పేందుకేనా?
– అందుకే మాజీ ఎంపీ గీతను ఎంపిక చేసుకున్నారా?
– మరికొన్ని అరెస్టులకు ఇది సంకేతమా?
– గీత అరెస్టును చూపించి ప్రత్యర్ధుల నోరు మూయించే ఎత్తుగడ?
– మరి మిగిలిన కళంకితుల మాటేమిటి?
( మార్తి సుబ్రహ్మణ్యం)

మాజీ ఎంపీ, బీజేపీ నేత కొత్తపల్లి గీతను సీబీఐ అరెస్టు చేయడం వెనుక ఏమైనా సుదీర్ఘ రాజకీయ వ్యూహం ఉందా? కళంకితగా మారిన సీబీఐని పులుకడిగిన ముత్యమని సంకేతమిచ్చేందుకే గీతను అరెస్టు చేశారా? తాజా అరెస్టు పరిణామం.. భవిష్యత్తులో మరికొందరు విపక్ష నేతల అరెస్టుకు సీబీఐ ఇచ్చిన సంకేత మేనా? విపక్షాల నోళ్లు మూయించేందుకే గీత అరెస్టు వ్యవహారం ఉండబోతుందా? సొంత పార్టీ నాయకురాలినే అరెస్టు చేయించామన్న క్రెడిట్‌ కొట్టేసి, ఆ ప్రచార హోరులో.. అనేక ఆరోపణలెదుర్కొంటున్న, విపక్ష నేతలనూ అరెస్టు చేసే ఎత్తుగడ ఏమైనా ఉందా? ‘బీజేపీలో చేరితే కేసులు మాఫీ’ అంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారానికి తెరదించేందుకే గీత అరెస్టును రాజకీయంగా వాడుకోనున్నారా? మాజీ ఎంపీ ‘గీత’దాటింది సరే.. మరి బీజేపీలోనే ఉంటూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన కళంకితుల మాటేమిటి? మొత్తంగా.. బీజేపీ వ్యూహానికి గీత రాజకీయ పనిముట్టు కానున్నారా? అరకు మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు కొత్తపల్లి గీతను సీబీఐ అరెస్టు చేసిన తర్వాత రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ పేరుతో, 42.79 కోట్లకు మోసం చేశారన్న అభియోగంతో సీబీఐ ఆమెను అరెస్టు చేసింది. భర్త రామకోటేశ్వరరావును కూడా అరెస్టు చేయగా, ఇద్దరికీ సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నిజానికి కొత్తపల్లి గీత వైసీపీ ఎంపీ. ఆ పార్టీ నాయకత్వంతో విబేధించి 2018లో జనజాగృతి పేరుతో పార్టీ పెట్టినా దానిని నడపపలేకపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరి జనజాగృతిని అందులో విలీనం చేశారు. నిజానికి ఈ కేసు ఆమె బీజేపీలో చేరకముందే ఉండటం గమనార్హం. ఆమెపై కేసు 2015లో అంటే వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడే నమోదు కాగా, గీత 2018లో వైసీపీని వీడి బీజేపీలో చేరడం గమనార్హం. దీనితో.. ఆమె తన పార్టీలో చేరకముందే జరిగిన నేరం అని బీజేపీ ఎదురుదాడి చేసినా ఆశ్చర్యం లేదు.

ఇక కొత్తపల్లి గీత అరెస్టు వ్యవహారం బీజేపీకి ఒక అస్త్రంగా అందివచ్చినట్లయింది. పార్టీలో ఉన్న సమయంలో సీబీఐ అరెస్టు చేసింది కాబట్టి, ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడం ద్వారా.. తాము కళంకితులను ప్రోత్సహించమన్న సంకేతం ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదే అస్ర్తాన్ని విపక్షాలపై సంధించి.. దమ్ముంటే మీరు కూడా కళంకితులను పార్టీ నుంచి బహిష్కరించడని సవాల్‌ చేసి, ప్రత్యర్ధులను రాజకీయంగా ఇరకాటంలో పెట్టినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

తాజా పరిణామాల వెనుక భారీ రాజకీయ వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే విపక్ష నేతల ఇళ్లపై సీబీఐ దాడులు చేసి, కేసులు నమోదు చేసింది. తాజా ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం ఆప్‌, టీఆర్‌ఎస్‌, వైసీపీని కుదిపివేస్తోంది. ఆ కేసులో ఆదనపు చార్జిషీట్లు వేసేపనిలో ఉంది. ఈ క్రమంలో తన సొంత పార్టీకి చెందిన నాయకురాలిని సీబీఐ అరెస్టు చేసిన వైనం బీజేపీకి బ్రహ్మాస్త్రంగా మారనుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, సొంత పార్టీ అరెస్టును అడ్డుకోకపోవడం బట్టి, సీబీఐకి కేంద్రం స్వేచ్ఛ ఇచ్చినట్లు అర్ధం చేసుకోవాలన్న కొత్త ప్రచారానికి బీజేపీ తెరలేపనుంది.

కొత్తపల్లి గీత అరెస్టు.. దేశంలో జరగనున్న మరికొన్ని అరెస్టులకు, ఒక భారీ సంకేతంగానే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సొంత పార్టీ నేత అరెస్టును చూపించి, విపక్ష నేతలను అరెస్టు చేసే వ్యూహం ఇందులో లేకపోలేదంటున్నారు. అప్పుడు భవిష్యత్తులో జరగబోయే అరెస్టులపై విపక్షాలు విమర్శించే ఆస్కారం ఉండదన్నది బీజేపీ వ్యూహంలా కనిపిస్తోంది.

ఒకవేళ ఎవయినా విమర్శించినా.. మా పార్టీ నాయకురాలయినప్పటికీ, సీబీఐ అరెస్టు చేసిందంటే కేంద్రం దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు మీకు అర్ధం కావడం లేదా’ అని ఎదురుదాడి చేయడం ద్వారా, విపక్షాల నోళ్లు మూయించే వ్యూహం కూడా అమలుచేయనుంది. ఆ విధంగా దేశవ్యాప్తంగా సీబీఐ-ఈడీ, ఐటీలపై విమర్శలు చెలరేగుతున్న వేళ.. కొత్తగా పార్టీలో చేరిన కొత్తపల్లి గీత అరెస్టు పరిణామం, బీజేపీకి భారీ బ్రహ్మాస్త్రంగా పరిణమించినట్లు స్పష్టమవుతోంది.

అయితే.. కొత్తపల్లి గీత అరెస్టు తర్వాత మరికొన్ని సందేహాలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే చాలామంది కళంకితులు, నేరచరితులు బీజేపీ గూటికి చేరినందున.. మరి వారి సంగతేమిటన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఇతర పార్టీల నుంచి చేరిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులున్నందున.. వారిపై కొనసాగుతున్న కేసులను కూడా కొత్తపల్లి బాటలోనే వేగంగా నడిపిస్తుందా? లేక నత్తనడక సాగిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా.. బీజేపీలో ఎలాంటి పదవి అనుభవించకుండా ఆ పార్టీలో కొనసాగుతున్న కొత్తపల్లి గీత.. తన అరెస్టు తర్వాత తన పార్టీకి కొత్త అస్త్రం అందించనున్నారు.

చట్టం ముందు అంతా సమానమే: పురిఘళ్ల రఘురాం
కొత్తపల్లి గీత అరెస్టు వ్యవహారంపై బీజేపీ సీనియర్‌ నేత పురిఘళ్ల రఘురాం స్పందిస్తూ.. చట్టం-రాజకీయం వేర్వేరని వ్యాఖ్యానించారు. ‘ఇన్నాళ్లూ ప్రతిపక్షాలు సీబీఐ ఎన్డీఏ గూటి చిలక అంటూ విమర్శించారు. దానికి స్వతంత్ర ప్రతిపత్తి లేదని ఆరోపించారు. మరిప్పుడు సీబీఐ అరెస్టు చేసింది బీజేపీ నాయకురాలినే కదా? కోర్టు, దర్యాప్తు సంస్థల వ్యవహారాల్లో కేంద్రం గానీ, బీజేపీ గానీ ఏనాడూ జోక్యం చేసుకున్న దాఖలాలు ఒక్కటి చూపండి. కొత్తపల్లి గీత వ్యవహారంలో సీబీఐ 2015 నుంచి దర్యాప్తు జరుపుతోంది. అప్పుడు ఆమె వైసీపీ ఎంపీ. బీజేపీ కాదు. అయినా తర్వాత మా పార్టీలో చేరింది. మా పార్టీలో చేరిందని సీబీఐ ఏమీ కేసును బలహీనపరచలేదు కదా? ఆధారాలు కోర్టుకు సమర్పించి, అరెస్టు చేసింది. రేపు కోర్టు సీబీఐ ఆరోపణల్లో నిజం లేదని భావిస్తే బెయిల్‌ ఇవ్వవచ్చు. లేదా నిజం ఉందని భావిస్తే బెయిల్‌ ఇవ్వకపోవచ్చు. కాబట్టి దీన్నిబట్టి అర్ధమయ్యేదేమిటంటే ఏ కేసులోనూ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కేంద్రం-బీజేపీ జోక్యం చేసుకోలేదు. విపక్షాలు ఈ ఉదంతం చూసయినా ఇకపై నోరు మూసుకుంటే మంచిద’ని రఘు వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE