– అది ప్రజలకు చెప్పాల్సిందే
– డీజీపీకి వర్లరామయ్య లేఖ
మహారాజశ్రీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సవాంగ్ గారికి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పోలిట్‌బ్యూరో సభ్యులు
వర్ల రామయ్య నమస్కరించి వ్రాయు బహిరంగ లేఖ
ఆర్యా!
రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్‌గా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పోలీస్ శాఖ వ్యవహారశైలి చట్టాలలో నిక్షిప్తం చేయబడినది. వారి వ్యవహారశైలి ఆయా ప్రభుత్వాలు, వ్యక్తులపై ప్రేమ, అభిమానాలు ఉన్నా, చట్టపరిధి దాటనిది. కానీ, విచిత్రం, సవాంగ్ గారి అధ్యక్షతన అంటే మీ అధ్యక్షతన, పోలీస్ శాఖ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి అడుగడుగునా పరిధిదాటి, ప్రజా దృష్టిలో అభాసుపాలు అవుతున్నది.
పలు దఫాలు చట్టపరంగా పోలీస్ దోషిగా నిలబడిరది. పరిధిదాటి ఎన్నో దఫాలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంతో కూడా చీవాట్లు తిన్నది.
దీనికంతటికీ కారణం ఏమిటని విశ్లేషిస్తే, ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్‌గా మిమ్ము బహుగా ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆయనతో మీకు పరిచయం ఉన్నట్లు కూడా ఎవరూ చెప్పడం లేదు. పోనీ, పోలీసు శాఖకు ముఖ్యమంత్రి గారు ఎనలేని రాయితీలు అందించి, ఆ శాఖకు సొగసులు దిద్దారా అంటే అదీలేదు… పోలీసులకు ఇవ్వవలసిన లేక రావలసిన రాయితీలే అంతంతమాత్రంగా వస్తున్నట్లు పోలీస్ శాఖలో బహిరంగ రహస్యం.
పోనీ, ముఖ్యమంత్రి గారికి మన రాష్ట్ర పోలీసు శాఖ అంటే ఎనలేని అభిమానమా అంటే అదీలేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పదే పదే మన రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని చెప్పడం, ఆంధ్రప్రదేశ్ పోలీసులను నమ్మనని వ్యాఖ్యానించటం అందరికీ తెలుసు. తనపై కోడి కత్తితో దాడిచేస్తే రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యవహారం, ఆ రాష్ట్ర ఆసుపత్రిలో చికిత్స పొందిన నిజం అందరికీ తెలుసు. ఆయన చెల్లి షర్మిల గారు కూడా ఆమెపై సోషల్ మీడియాలో కొందరు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే, ఆ ఫిర్యాదు కూడా రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన వాస్తవం కూడా గుర్తించాలి.
మరి ఈ నేపథ్యంలో, రాష్ట్ర డిజిపి సవాంగ్ గారికి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి కుదిరిన రహస్య ఒప్పందం ఏమిటి? ఎందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో, చట్టపరిధి దాటి అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారు? ఎన్నికల సమయాలలో, పలువురు పోలీసులు తామే అధికార పార్టీ అభ్యర్థి అయినట్లు వ్యవహరిస్తున్నారు? పోలీసుల పరిస్థితి, వ్యవహరిస్తున్న తీరు, అటు న్యాయస్థానంలో ఇటు ఎన్నికల నిర్వహణ కమిషనర్‌తో చీవాట్లు తినడం నిజం కాదా?
ఎందుకు సవాంగ్ గారు, పోలీసు శాఖను ఈ విధంగా నిర్వీర్యం చేసి అభాసుపాలు చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఏర్పడిన నాటి నుండి, ఈ నాటి వరకు పోలీస్ శాఖ అధిపతులుగా వ్యవహరించిన వారి తీరుకు, మీ ఒక్కరి వ్యవహార శైలికి, ఇంత వ్యత్యాసం ఉన్నది. మీకూ, ముఖ్యమంత్రి గారికి మధ్య జరిగిన రహస్య ఒప్పందం రాష్ట్ర ప్రజలకు తెలియజేయగలరా?
మీరు వ్యవహరిస్తున్న తీరు సరైనదని రాష్ట్ర ప్రజలను ఒప్పించగలరా? బహిరంగ చర్చకు మీ వ్యవహార శైలి నిలబడగలదా? ఇప్పటికైనా మీరు ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిగా మీ బాధ్యతలను గుర్తెరిగి, చట్టరీత్యా, రాజ్యాంగ రీత్యా, న్యాయ పరంగా, ప్రజాస్వామ్యయుతంగా, వ్యవహరించాలని కోరుతూ, ఇప్పుడు జరుగుతున్న ఈ మినీ ఎన్నికలలో చట్టబద్దంగా పోలీస్ శాఖ వ్యవహరిస్తారని ప్రమాణం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రజలకు పోలీస్ శాఖపట్ల విశ్వాసాన్ని కల్పించండని గుర్తు చేస్తున్నాను.
ఇట్లు
తమ విధేయుడు
(వర్ల రామయ్య)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
మరియు పొలిట్ బ్యూరో సభ్యులు