ముమ్మడివరం: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కోనసీమలో అపూర్వ స్పందన లభిస్తోంది. ముమ్మడివరం నియోజకవర్గంలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్ర జన నీరాజనాలతో హోరెత్తుతోంది. 212వరోజు ముమ్మిడివరం ఉమెన్స్ కళాశాల వద్ద క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ముమ్మిడివరం సెంటర్ లో జరిగిన బహిరంగసభకు భారీగా జనం హాజరయ్యారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా జనగళమే యువగళమై మహా ప్రభంజనంలా సాగుతున్నయువగళం పాదయాత్ర ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం పాతఇంజరం వద్ద 2900 కి.మీ.ల మైలురాయి చేరుకుంది.
ఈ సందర్భంగా కల్లుగీత, కొబ్బరి దింపు కార్మికులకు భీమా అమలు చేస్తామని హామీ ఇస్తూ యువనేత లోకేష్ శిలాఫలకం ఆవిష్కరించారు. దీనివల్ల కోనసీమలోని వేలాది కార్మికులకు మేలు జరుగుతుంది. ముమ్మడివరం, కొమానపల్లి, అన్నంపల్లి, మురమళ్ల, కొమరగిరి, ఎదుర్లంక, పాత ఇంజరం మీదుగా సుంకరపాలెం సెంటర్ వరకు పాదయాత్ర కొనసాగింది. మురమళ్ల సమీపంలోని గోదావరి పాయ వద్ద మత్స్యకారులు బోట్లపై యువగళం జెండాలు, బెలూన్లను ప్రదర్శించి లోకేష్ కు సంఘీభావం తెలిపారు. దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు.
యువనేతను కలిసిన వారిలో డ్వాక్రా మహిళలు, గౌడలు, దళితులు, బుడగజంగాలు, వివిధ గ్రామాల ప్రజలు ఉన్నారు. యువగళం పాదయాత్రకు సంఘీభావంగా జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. 212వరోజు యునేత లోకేష్ 18.6 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2904.9 కి.మీ.ల మేర పూర్తయింది. గురువారం కోరంగిలో యువనేత లోకేష్ శెట్టిబలిజలతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు.
చంద్రబాబు అరెస్టుతో జగన్ సెల్ఫ్ గోల్!
జగన్ ఒక సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్… సింపుల్ గా చెప్పాలి అంటే భస్మాసురుడు. లేటెస్ట్ గా జగన్ వేసిన సెల్ఫ్ గోల్ చంద్రబాబు అరెస్ట్ అని టిడిపి యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ముమ్మిడివరంలో జరిగిన యువగళం బహిరంగసభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… జగన్ అనుకున్నది ఒక్కటి… అయ్యింది ఇంకొకటి. చంద్రబాబుకి అవినీతి మరక అంటించాలని అక్రమంగా అరెస్ట్ చేసాడు. కానీ చంద్రబాబు గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. ఇప్పటి యువతకి ఆయన విజన్ ఏంటో అర్ధమైంది. కుటుంబాన్ని కూడా కాదనుకొని ప్రజల కోసం ఆయన పడ్డ కష్టం అందరికీ తెలిసింది. చంద్రబాబు అవినీతి చేసారు అంటే ఎవరూ నమ్మడం లేదని ప్యాలెస్ బ్రోకర్ సజ్జల అన్నాడు. ప్రజల్ని నమ్మించడానికి మేము తిప్పలు పడుతున్నామని బహిరంగంగా చెప్పాడు. 53 రోజులు న్యాయానికి సంకెళ్లు వేసారు. చంద్రబాబుని జైల్లో బంధించారు. కానీ ఆఖరికి నిజమే గెలిచింది.
ఫ్యాన్ మాడి మసైపోవడం ఖాయం
ముమ్మిడివరం మాస్ జాతర అదిరిపోయింది. లోక్ సభ స్పీకర్ గా ఎదిగిన బాలయోగి గారు రాజకీయం ప్రస్థానం మొదలైంది ముమ్మిడివరం నియోజకవర్గం నుండే. బాలయోగీశ్వరస్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి ముమ్మిడివరం. ఎంతో ఘన చరిత్ర ఉన్న ముమ్ముడివరం నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. ఉభయ గోదావరి జిల్లాల్లో జన ప్రభంజనం చూసాను. మరో మూడు నెలల్లో ఫ్యాన్స్ మాడి మసై పోవడం ఖాయం.
టిడిపి-జనసేన పొత్తు కుదరొద్దని కుయుక్తులు!
జగన్ కి ఆత్మలతో మాట్లాడే జబ్బు ఉంది… టిడిపి – జనసేన పొత్తు కుదరకుండా చూడమని ఆత్మ చెప్పినా జగన్ సెల్ఫ్ గోల్ వలన పొత్తు కుదిరింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ని ఖండించి పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించారు. మరో మూడు నెలల్లో రాబోయేది టిడిపి – జనసేన ప్రభుత్వం. బాంబులకే భయపడని కుటుంబం మనది…జగన్ పెట్టే కేసులకు, అరెస్టులకు భయపడతామా? భయం మా బ్లడ్ లో లేదు బ్రదర్ జగన్. యువగళాన్ని ఆపడానికి జగన్ అనేక ప్రయత్నాలు చేసాడు. రాజారెడ్డి రాజ్యాంగం ఇచ్చి పోలీసుల్ని పంపాడు… నేను అంబేద్కర్ రాజ్యాంగం చూపించి సమాధానం చెప్పాను. పిల్ల సైకోలను పంపి గుడ్లు వేయించాడు.. పసుపు సైన్యం వాళ్ల మొహం మీద ఆమ్లెట్ వేసి పంపారు.
మరో మూడునెలల్లో వైసిపి ప్యాకప్!
జగన్ ఆపితే ఆగిపోవడానికి నేను ప్యాలస్ లో బ్రోకర్ ని కాదు… నేను ప్రజల్లో ఒక్కడిని.. నేను ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్ర అని. జగన్ పనైపోయింది. మరో మూడు నెలల్లో వైసిపి ప్యాకప్. ఈ మాట నేను అనడం లేదు. జగన్ దగ్గర పనిచేసిన అధికారులే అంటున్నారు. కొంతమంది అధికారులు ఢిల్లీ కి డెప్యుటేషన్ పెట్టుకున్నారు అంట. వాళ్లు ఢిల్లీకి వెళ్తున్నారు అంటే అర్ధం ఏంటి? జగన్ జైలుకి వెళ్ళిపోతున్నాడు. డెప్యుటేషన్ పెట్టుకున్న వారిలో కొంతమంది జగన్ చెప్పిన మాట విని చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్లు కూడా ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళిపోయినా చేసిన తప్పులకు శిక్ష అనుభవించడం తప్పదు.
జగన్ కి టీచర్లు అంటే కోపమెందుకంటే?
జగన్ కి టీచర్లు అంటే కోపం. టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసినప్పుడు టీచర్లు జగన్ ని గట్టిగా వాయించారు. అప్పటి నుండి టీచర్లు పై జగన్ కక్ష పెంచుకున్నాడు. కరోనా టైం లో టీచర్ల ను మద్యం దుకాణాల ముందు నిలబెట్టి అవమానించాడు. రకరకాల యాప్స్ పెట్టి వేధించాడు. ఆ తరువాత ఎన్నికల విధుల నుంచి తొలగించాడు. ఎన్నికల సంఘం ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో వినియోగించాలని చెప్పింది. టీచర్లు లేకుండా చేసి ఎన్నికల్లో అక్రమాలు చెయ్యాలని జగన్ వేసుకున్న ప్లాన్ తుస్సుమంది. మరోసారి జగన్ కి టీచర్ల మీద కోపం వచ్చింది. ఇప్పుడు ఏకంగా మెమో లు ఇస్తున్నారు. ఏ తప్పు చేయకపోయినా అడ్డగోలుగా మెమోలు ఇస్తున్నారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ఇతర బెనిఫిట్స్ రాకుండా మెమోలు ఇస్తున్నారు. టిడిపి – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే టీచర్ల సమస్యలు అన్ని పరిష్కరిస్తాం.
జగన్ మందు విషం కంటే ప్రమాదం!
రోజుకి క్వార్ట్రర్ తాగే వాళ్ల దగ్గర నుండి జగన్ ఎంత కొట్టేస్తున్నాడో తెలుసా? క్వార్ట్రర్ పై రూ.25 రూపాయలు. నెలకి రూ. 750, ఏడాదికి రూ.9 వేలు, 5 ఏళ్లకు ఎంత?రూ.45 వేలు. అంటే రోజుకి క్వార్ట్రర్ తాగే వ్యక్తి జగన్ కి కడుతున్న జే ట్యాక్స్ రూ.45 వేలు. ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ గురించి నేను చెప్పడం లేదు. ఇది జనం రక్తం తాగుతూ జగన్ సంపాదిస్తున్న సొమ్ము. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. కానీ గెలిచిన తరువాత సొంత లిక్కర్ కంపెనీలు, ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచాడు. జగన్ అమ్ముతున్న జే బ్రాండ్ లిక్కర్ పాయిజన్ లాంటిది. జగన్ మందు విషం కంటే ప్రమాదం. రాష్ట్రంలో ఏ ఆసుపత్రి కైనా వెళ్లండి డేటా తీసుకోండి. గత నాలుగున్నర ఏళ్లలో జే బ్రాండ్ లిక్కర్ తాగి చనిపోతున్న వాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. జే బ్రాండ్ లిక్కర్ లో ఉండే ప్రమాదకరమైన కెమికల్స్ దెబ్బకి బాడీ పార్ట్స్ అన్ని డ్యామేజ్ అవుతున్నాయి. మహిళల తాళిబొట్లు తెంచుతున్నావ్, పసుపు కుంకుమ చెరిపేస్తున్నావ్. ఈ పాపం నిన్ను ఊరికే వదలదు జగన్.
క్లాస్ వార్ కాదు… నిశ్శబ్ధ విప్లవం!
జగన్ క్లాస్ వార్ జరుగుతుంది అంటున్నాడు. కానీ జరగబోయేది సైలెంట్ వార్. నిశబ్ద విప్లవం. జగన్ పేదలకు – పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నాడు. జరగబోయేది పేదలకు – దోపిడీదారులకు మధ్య యుద్ధం. లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా? బెంగుళూరులో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కట్టాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నవాడు పేదవాడా? సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టివి, ఛానల్ ఉన్నవాడు పేదవాడా? రుషి కొండను కొట్టేసి రూ. 450 కోట్లతో ప్యాలస్ కట్టుకున్నవాడు పేదవాడా?పేదవాళ్లకు జగన్ కట్టే ఇళ్లు చిన్నపిల్లాడు తోస్తే పడిపోతుంది. జగన్ పేదవాడు కాదు… దేశంలోనే అతిపెద్ద దోపిడీదారు. జగన్ కి పేదవాళ్లు మంచి ఇంట్లో ఉండటం ఇష్టం ఉండదు. అందుకే టిడిపి కట్టిన టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా వేధిస్తున్నాడు.
కటింగ్ అండ్ ఫిటింగ్ మాస్టర్ జగన్!
జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. కిలో టమాటో రూ.100, కిలో పచ్చిమిర్చి రూ.100, మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్.
మహిళలను ఆదుకునేందుకు మహాశక్తి
జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు. 2900కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.
అధికారంలోకి వచ్చాక ప్రతిఏటా జాబ్ నోటిఫికేషన్
జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
మోటార్లకు మీటర్లు పెడితే పగులగొట్టండి!
జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.
ఉద్యోగులు, పోలీసులను మోసగించారు!
జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు సరెండర్స్, టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్ కూడా కోతపెట్టాడు జగన్. 15 శాతం అలవెన్స్ కట్ చేసాడు. ఎస్ఐ కి 10 వేలు, హెడ్ కానిస్టేబుల్ కి 8 వేలు, కానిస్టేబుల్ కి 6 వేలు కట్ చేసాడు. జగన్ తెచ్చిన జిఓ 79 రద్దు చేస్తాం. అలవెన్స్ యధాతధంగా ఇస్తాం.
బిసిల కోసం ప్రత్యేక రక్షణ చట్టం!
బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. అమర్నాధ్ గౌడ్ ని పెట్రోల్ పోసి చంపేసారు. సైకోపాలనలో 26 వేల బిసిలపై అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి కొవ్వూరు లో మహేంద్ర వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.
మైనారిటీలకు తప్పని చిత్రహింసలు
జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. టిడిపి – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేసిన మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు, ఇస్లామిక్ బ్యాంక్ ప్రారంభిస్తాం.
ముమ్మిడివరాన్ని అవినీతి అడ్డాగా మార్చేశారు!
ముమ్మిడివరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని సతీష్ కుమార్ గెలిపించారు. ముమ్ముడివరం అభివృద్ధి చెందిందా? సతీష్ కుమార్ ముమ్మిడివరాన్ని అవినీతి కి అడ్డాగా మార్చేసారు. అందుకే ఆయన పేరు మార్చా, ఆయన సతీష్ కుమార్ కాదు కలెక్షన్ కుమార్. సెంటు స్థలాల్లో భారీ స్కాం. తక్కువ ధర కి భూములు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధర కి అమ్మేసారు. రూ.15 లక్షలు విలువ చేసే భూమిని రూ. 50 లక్షలకు ప్రభుత్వానికి అమ్మేసారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను వేధిస్తున్నారు. లే అవుట్ వేసే వారి నుండి ఎకరానికి రూ. 10 లక్షలు వసూలు చేస్తున్నారు.
మత్స్యకారుల పరిహారంలోనూ చేతివాటం
మత్స్యకార సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే కలెక్షన్ కుమార్ మత్స్యకారులకు ఓఎన్సీసీ ఇచ్చే పరిహారంలోనూ వాటాలు వసూలు చేస్తూ పేద మత్స్యకారులకు తీరని అన్యాయం చేస్తున్నారు. మత్సకారులకు కేటాయించిన డీజిల్ దారిమళ్లించేస్తూ పెద్దఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. ఇసుక, మట్టిని అక్రమంగా రవాణా చేస్తూ తీవ్ర అవినీతికి పాల్పడుతున్నాడు. ముమ్మడివరం మండల పరిధిలోని గేదెల్లంక ఇసుక రీచ్ లో ఎమ్మెల్యే అనుచరులు భారీఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే బావమరిది, కుటుంబసభ్యులు నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారు. యానాం నుండి లిక్కర్ తెచ్చి ముమ్మిడివరంలో అమ్మేస్తున్నారు. ఈ నాలుగున్నర ఏళ్లలో ఎమ్మెల్యే కరెప్షన్ కుమార్ అక్రమార్జన రూ. 400 కోట్ల పైమాటే. ఇది నేను చెబుతుంది కాదు వైసిపి నాయకులే, కార్యకర్తలే మాట్లాడుతున్నారు.
జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
ముమ్ముడివరానికి జగన్ అనేక హామీలు ఇచ్చాడు కానీ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. ఎదుర్లంక వద్ద రూ.79 కోట్లుతో గ్రోయిన్ల నిర్మాణానికి 2019లో శంకుస్థాపన చేశారు. అది శిలాఫలకానికే పరిమితమైంది. 2022 మే నెలలో ఐ. పోలవరం మండలానికి రక్షణ వలయంగా ఉన్న 22 కిలోమీటర్లు ఏటిగట్టు ఆధునికీకరణకు హామీ ఇచ్చి, తర్వాత పట్టించుకోలేదు. రూ.71 కోట్లతో పల్లకుర్రు-మూలపొలం వంతెన నిర్మాణానికి, రూ.45 కోట్లతో గోగుల్లంక వంతెన నిర్మాణానికి, రూ.24 కోట్లుతో ముమ్మిడివరం కాట్రేనికోన రహదారి నిర్మాణానికి శిలాఫలకాలను ఆవిష్కరించి గాలికొదిలేశారు. నదీకోత నివారణకు నియోజకవర్గంలో రివిట్మెంట్ నిర్మాణానికి రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత పట్టించుకోలేదు.
ముమ్మిడివరాన్ని అభివృద్ధి చేసింది టిడిపినే!
ముమ్మిడివరాన్ని అభివృద్ధి చేసింది టిడిపి ప్రభుత్వం. అప్పటి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు రూ.1800 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసారు. తాగు, సాగునీటి ప్రాజెక్టులు, సిసి రోడ్లు, 11 సైక్లోన్ రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేసాం, స్కూల్స్ ని అభివృద్ధి చేసాం, రోడ్లు వేసాం, పేదలకు ఇళ్లు, వంతెనలు, కమ్యూనిటీ భవనాలు ఆఖరికి స్మశానాలు కూడా అభివృద్ధి చేసింది టిడిపి. ముమ్మిడివరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. తాగునీటి సమస్య పరిష్కారం కోసం టిడిపి ప్రభుత్వం రూ.110 కోట్లు నిధులు కేటాయించింది. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు నిలిపేసింది. టిడిపి – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. నియోజకవర్గంలో రోడ్లు చూస్తుంటే భయం వేస్తుంది. టిడిపి – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త రోడ్లు వేస్తాం.
డ్రెయిన్ల ఆధునీకరణకు చేపడతాం!
పంట కాలువలు, డ్రెయిన్లు ఆధునికీకరణకు నోచుకోక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పంట కాలువలు, డ్రెయిన్లు ఆధునీకరిస్తాం. ముమ్మిడివరంలో డిగ్రీ కళాశాలకు సొంత భవనం, జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పిస్తాం. జోన్, నాన్ జోన్ తో సంబంధం లేకుండా రూ. 1.50 కే ఆక్వా రైతులకు విద్యుత్ అందిస్తాం. కొబ్బరి రైతులు, కార్మికుల కష్టాలు నాకు తెలుసు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మిమ్మల్ని ఆదుకుంటాం. టిడిపి కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. చట్టాన్ని ఉల్లంఘించిన అందరి పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నా. టిడిపి నాయకుల్ని, కార్యకర్తల్ని వేధించిన వైసిపి నాయకులు ముమ్మడివరం లో ఉన్నా మలేషియా పారిపోయినా పట్టుకొని లోపలేస్తాం. సైకో పాలన పోతుంది.. సైకిల్ పాలన వస్తుంది.
పేదలను ఏడిపించి పైశాచికానందం పొందడం సైకో లక్షణం!
ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేకపోవడం, వారిని ఇబ్బందులు పెట్టి పైశాచికానందం పొందడం సైకో లక్షణాలు.గత టిడిపి ప్రభుత్వం ముమ్మడివరంలో ఏర్పాటుచేసిన అన్నాక్యాంటీన్ భవనం ఇది. ప్రస్తుతం వార్డు సచివాలయంగా మార్చేశారు. నిరుపేదలు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబుగారు రాష్ట్రవ్యాప్తంగా అన్నాక్యాంటీన్లు ఏర్పాటుచేసి లక్షలాదిమంది క్షుద్భాద తీరిస్తే, వాటిని రద్దుచేసి పేదోళ్ల నోటికాడ కూడు లాగేశాడు సైకో జగన్. సిగ్గు,లజ్జా వదిలేసి తాను పేదల పక్షమంటూ వేదికలెక్కి ఉపన్యాసాలిస్తున్నాడు. ఆకలితో అలమటించే పేదోళ్ల కడుపుమంటలే నీ అరాచక ప్రభుత్వానికి చితిమంటలు కాబోతున్నాయి… రాసిపెట్టుకో జగన్మోహన్ రెడ్డీ!!
నారా లోకేష్ ను కలిసిన డ్వాక్రా మహిళలు
ముమ్మిడివరంలో డ్వాక్రా మహిళలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.మా నియోజకవర్గంలోని డ్వాక్రా సభ్యులు వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలా ఇబ్బందులు పడుతున్నారు.టీడీపీ పాలనలో 60ఏళ్లు నిండిన సభ్యులకు అభయహస్తం పెన్షన్ ఇచ్చేవారు.వైసీపీ పాలనలో దీన్ని నిలిపేసి సభ్యులు కట్టిన డబ్బులను కూడా లాగేసుకున్నారు.మా ప్రాంతంలో రోడ్లు పాడైపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది.మద్యపాన నిషేధంపై జగన్మోహ్మన్ రెడ్డి మాట తప్పడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు.రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి పెరగడంతో మహిళలకు రక్షణ కరువైంది.మీరు అధికారంలోకి వచ్చాక డ్రగ్స్, గంజాయిని అరికట్టాలి.
లోకేష్ స్పందిస్తూ…. జగన్మోహన్ రెడ్డికి మోసం చేయడం, దోచుకోవడం తప్ప ఏమీ తెలియదు.మహిళలు దాచుకున్న రూ.2500 కోట్లు దోచుకున్న గజదొంగ జగన్.చంద్రబాబు పాలనలో డ్వాక్రా మహిళలకు అభయహస్తం పథకం ద్వారా ఆర్థిక చేయూతనిచ్చాం.మేం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్థిక తోడ్పాటునందిస్తాం.అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తాం.పాడైపోయిన రోడ్లను బాగుచేయించి రాకపోకలకు ఇబ్బందిలేకుండా చేస్తాం.రాష్ట్ర యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయి మాపియాపై ఉక్కుపాదం మోపుతాం.మహిళలు, యువత రక్షణకు కల్పించే చర్యలను విస్తృతంగా చేపడతాం.
నారా లోకేష్ ను కలిసిన గౌడ సంఘం ప్రతినిధులు
కోనసీమ జిల్లా గౌడ సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జీఓ-16 ద్వారా గౌడ ఉపకులాలకు గౌడలుగా అవకాశం కల్పించారు. ఈడిగ, శ్రీశయన, యాత, శెట్టిబలిజ కులాలు నాటి నుండి గౌడ కులంలో ఉన్నాయి.నేటికాలంలో గౌడ కులస్తులకు జీవనోపాధి లేక ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయి.మద్యం దుకాణాల్లో 30శాతం గౌడ కులస్తులకు కేటాయించాలి.కోనసీమ ప్రాంతంలో గౌడలకు రాజకీయాల్లో ప్రాధాన్యత లేదు.రాష్ట్ర, జిల్లా, మండల, నియోజకవర్గ స్థాయిలో మాకు రాజకీయ ప్రాధాన్యతనివ్వాలి.రాజకీయ నాయకులు గౌడ కులస్తులను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చాక గౌడ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి.మా కులస్తుల పిల్లలకు విదేశీవిద్యకు చర్యలు తీసుకోవాలి.మా జిల్లాకు గౌడ కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలి.
నారా లోకేష్ స్పందిస్తూ… బీసీలకు స్థానిక సంస్థల్లో 24శాతం రిజర్వేషన్ కల్పించింది ఎన్టీఆర్.34శాతానికి పెంచిన ఘనత చంద్రబాబుది.బీసీలకు రాజకీయాల్లో ప్రాధాన్యతనిచ్చిన ఘనత చంద్రబాబుది.జగన్మోహన్ రెడ్డి బీసీలకు స్థానిక సంస్థల్లో 10శాతం రిజర్వేషన్ రద్దు చేశాడు.16వేల మందిని రాజకీయ పదవులకు దూరం చేసిన బీసీ ద్రోహి జగన్.బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.75,760కోట్లు దారి మళ్లించిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీది.జగన్ పెట్టిన 56కార్పొరేషన్లు అలంకారప్రాయంగా మారాయి.మేం అధికారంలోకి వచ్చాక బీసీలకు రాజకీయ ప్రాధాన్యతనిస్తాం.గౌడ కులస్తులకు మేం అధికారంలో ఉండగా టీవీఎస్, పనిముట్లు అందించాం.మేం అధికారంలోకి వచ్చాక గౌడలను అన్ని విధాలా ఆదుకుంటాం.మద్యం దుకాణాల్లో అవకాశం కల్పిస్తాం.నీరా కేఫ్ లు పెట్టి ప్రోత్సహిస్తాం.బీసీ విద్యార్థులకు విదేశీవిద్యను అందించి ఆదుకుంటాం.
నారా లోకేష్ ను కలిసిన కొమానపల్లి ప్రజలు
ముమ్మిడివరం నియోజకవర్గం కొమానపల్లి ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.గత టీడీపీ ప్రభుత్వంలో మాకు ట్రాక్టర్ ఇసుక వెయ్యి నుండి రూ.1,500 మధ్య ఇంటికి చేరేది. వైసీపీ పాలనలో కొమానపల్లి, గేదెల్లంక, కమిని, తానేల్లంక, చింతపల్లిలంక, అన్నంపల్లి, ముమ్మిడివరం, మురమళ్ల గ్రామాల్లో ఇసుక బంగారమైంది.ట్రాక్టర్ ఇసుక రూ.11వేల వరకు పెంచారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులను రద్దుచేసి, మాకు ఇసుకను అందుబాటులో ఉంచాలి.
నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారంలోకి వచ్చాక బినామీలను అడ్డుపెట్టుకొని ఇసుకపై రూ.40వేల కోట్లు దోచేశాడు. సామాన్యులకు ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో 40లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారు. పనుల్లేక ఎంతోమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ పాలనలో ఇసుకను ఉచితంగా అందించి పేదలకు, భవన నిర్మాణదారులకు అండగా నిలిచాం. టిడిపి అధికారంలోకి వచ్చాక మెరుగైన ఇసుకపాలసీతో ప్రజలకు ఇసుక అందుబాటులోకి తెస్తాం. వైసీపీ అక్రమాలపై పోరాడిన వారిపై తప్పుడు కేసులు మాఫీ చేస్తాం.
యువనేత లోకేష్ ను కలిసిన దళితులు
ముమ్మడివరం నియోజకవర్గం పల్లెపాలెం సెంటర్ లో ఎస్సీ సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి, దళితుల సాధికారితను దెబ్బతీసింది. మీరు అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్దరించాలి. నాలుగున్నరేళ్లలో 6వేలమంది దళితులపై అక్రమకేసులు పెట్టి, 21మందిని హత్యచేసిన జగన్ ప్రభుత్వంపై జ్యుడీషియల్ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ… నా ఎస్సీలు, నా బిసిలు అంటూ కపటప్రేమను ఒలకబోస్తున్న జగన్… ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించే దళితులను ఊచకోత కోస్తూ రాక్షసానందం పొందుతున్నాడు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేయడమేగాక రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తీరని అన్యాయం చేసింది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కారు రద్దుచేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తాం. దళితులను వేధించిన వైసిపినేతలు, పోలీసులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటాం.
లోకేష్ ను కలిసిన మాదిగ సామాజికవర్గ ప్రతినిధులు
ముమ్మిడివరం నియోజకవర్గం అన్నంపల్లి సెంటర్ లో కోనసీమ జిల్లా మాదిగ సామాజికవర్గ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఆరోగ్యశ్రీ ద్వారా మాకు న్యాయం జరగడం లేదు. సొంత డబ్బులతో వైద్యం చేయించుకోవాల్సివస్తోంది.గుండె సంబంధిత వ్యాధులు వస్తే ఇళ్లు, ఆస్తులు అమ్మి వైద్యం చేయించుకుంటున్నాం.కొబ్బరి దింపు, వలుపు కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించాలి.పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించి భవిష్యత్తు కాపాడాలి.జగన్ ప్రభుత్వం తొలగించిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలి.అమలాపురంలో చెప్పులు కుట్టుకునే వారికి కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి.
నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయింది దళితులే.గత టిడిపి ప్రభుత్వంలో మాదిగలకు లిడ్ క్యాప్ కార్పొరేషన్ కు నిధులు ఇచ్చి, యువతకు నైపుణ్య శిక్షణతో ఉపాధి కల్పించాం.చర్మకారులకు షరతులు లేకుండా పెన్షన్లు ఇచ్చి ఆదుకున్నాం.జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ పథకాలన్నీ రద్దు చేశాడు.టిడిపి అధికారంలోకి వచ్చాక జగన్ రద్దు చేసిన దళిత పథకాలన్నీ పునరుద్ధరిస్తాం.దింపు, వలుపు కార్మికులను గుర్తించి పెన్షన్లకు చర్యలు తీసుకుంటాం.అమలాపురంలో చెప్పులు కుట్టుకునే వారికి కాంప్లెక్స్ ఏర్పాటును పరిశీలిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన బేడ,బుడగ జంగం ప్రతినిధులు
ముమ్మిడివరం నియోజకవర్గ బేడ,బుడగ జంగం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.కోనసీమ జిల్లాలో సుమారు 500మంది బేడ,బుడగ జంగాల వారు నివసిస్తున్నారు.గతంలో మాకు ఎస్సీలుగా కుల ధృవీకరణ పత్రాలు వచ్చేవి.2008లో బోగస్ సర్టిఫికెట్లు వచ్చాయనే నెపంతో మాకు సర్టిఫికెట్లు నిలిపేశారు.గత ప్రభుత్వంలో ఈ విషయాన్ని చంద్రబాబుకు చెబితే జేసీ శర్మ కమిషన్ వేశారు.జెసి శర్మ కమిషన్ నివేదిక నేటికీ ఇది కేంద్రం వద్ద ఆమోదం పొందలేదు.మాకు సర్టిఫికెట్లు లేక మా పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి.మాకు న్యాయంగా అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా మాకు అందడం లేదు.మీరు అధికారంలోకి వచ్చాక మాకు సర్టిఫికెట్లు ఇచ్చి ఆదుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని సామాజికవర్గాలు మోసపోయాయి.నాలుగున్నరేళ్లుగా శర్మ కమిషన్ రిపోర్టును గాలికొదిలేయడం దురదృష్టకరం.టిడిపి అధికారంలోకి కేంద్రం వద్ద ఉన్న శర్మ కమిషన్ నివేదిక ఆమోదింపజేసి, బేడ, బుడగ జంగాలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలను అందిస్తాం.బేడ, బుడగ జంగాలకు సంక్షేమ పథకాలు, విద్యకు ఆటంకం లేకుండా అందజేస్తాం.
యువనేత లోకేష్ ను కలిసిన కొమరగిరి గ్రామస్తులు
ముమ్మడివరం నియోజకవర్గం కొమరగిరి గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.కొమరగిరి సమీప లంకగ్రామాలైన పశువుల్లంక, శేర్లంక, చింతపల్లిలంక, మురమళ్ల, పాత ఇంజరం గ్రామాలు ఎన్ హెచ్-216కి చేర్చి ఒక ఎకరం ప్రభుత్వ భూమి ఉంది. అందులో పిహెచ్ సి ఏర్పాటుచేస్తే సమీప గ్రామాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది.ఎన్ హెచ్ -216 విస్తరణ సమయంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని తొలగించారు. ఆ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకోండి.8ఎకరాల్లో విస్తరించి ఉన్న కొమరగిరి గ్రామపంచాయితీ చెరువును మంచినీటి చెరువుగా అభివృద్ధి చేయాలి.కొమరగిరి శ్రీ జగ్గరాజు జిల్లాపరిషత్ హైస్కూలుకు హాస్టల్ సౌకర్యం కల్పించారు.కొమరగిరిలో రోడ్లు, ఇల్లులేని పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామసీమలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి.గ్రామపంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన రూ.9వేల కోట్ల ఫైనాన్స్ కమిషన్ నిధులను జగన్ ప్రభుత్వం దొంగిలించింది.దీంతో గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధులు లేని పరిస్థితి నెలకొంది.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కొమరగిరిలో పిహెచ్ సి, వెంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మిస్తాం.కొమరగిరి చెరువును అభివృద్ధి చేసి ఇంటింటికీ స్వచ్చమైన తాగునీరు అందిస్తాం.ఇల్లు లేని ప్రతిపేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం, విద్యార్థుల సంఖ్యను బట్టి హాస్ట్లల్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తాం.