-స్పీకర్ ను మరమనిషి అంటే తప్పేముందన్న సంజయ్
-మోదీని కేసీఆర్ ఫాసిస్ట్ అనలేదా? అంటూ ప్రశ్న
-ప్రధాని గురించి అగౌరవంగా మాట్లాడిన కేసీఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదని వ్యాఖ్య
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అన్నారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఈటల చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. మీరు చెప్పినట్టు ఆడే స్పీకర్ ను మరమనిషి అంటే తప్పేముందని అడిగారు. నిండు సభలో ప్రధాని మోదీని ఫాసిస్ట్ అని కేసీఆర్ అన్నారని… ప్రధానిపై సభలో అగౌరవంగా మాట్లాడిన కేసీఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను శాశ్వతంగా సస్పెండ్ చేస్తారని చెప్పారు. ప్రతిపక్షాలు అంటేనే కేసీఆర్ భయపడుతున్నారని… అందుకే అసెంబ్లీలో విపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనీయడం లేదని మండిపడ్డారు. విపక్ష సభ్యుల సలహాలను కూడా తీసుకోవడం లేదని అన్నారు. ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేసిన అంశంపై న్యాయపరంగా పోరాడుతామని చెప్పారు.