– అందరి ఆశలూ నామినేటెడ్‌పైనే
– జనసేన-బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలున్న చోటనే ఆశలు
– టీటీడీ నుంచి డిప్యూటీ స్పీకర్, విప్‌ల వరకూ పెండింగే
– ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధి, ప్లానింగ్‌బోర్డు ఉపాధ్యక్షుడి వరకూ పెండింగ్
– బుచ్చయ్య చౌదరికి ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్ష పదవి?
– సలహాదారులుంటారా? లేదా?
– సీఎం సీపీఆర్‌ఓ కూడా లేని వైచిత్రి
– నామినేటెడ్ చైర్మన్లు, డైరక్టర్ల పదవుల కోసం తమ్ముళ్ల ఎదురుచూపు
– టీటీడీ చైర్మన్ రేసులో టీవీ5 అధినేత బీఆర్ నాయుడు, రఘురామరాజు, బీద రవిచంద్రయాదవ్?
– ఢిల్లీలో ఏపీ ప్రతినిధి రే సులో కనకమేడల, గల్లా జయదేవ్?
– డిప్యూటీ స్పీకర్‌గా కాల్వ? చీఫ్ విప్‌గా కూన పేరు పరిశీలన?
– టికెట్లు దక్కని త్యాగధనులకు తొలి అవకాశం?
– కీలక నేతలకు అవకాశాలు దక్కేనా?
– తెరవెనుక పనిచేసిన వారికీ గుర్తింపు దక్కుతుందా?
– పార్టీపై దృష్టి సారించాలంటున్న తమ్ముళ్లు
– గత పొరపాట్లను పునరావృతం చేయవద్దని సూచన
– మళ్లీ ప్రభుత్వానికే ఎక్కువ సమయం ఇస్తున్న బాబు
– ఇకపై పార్టీకే ఎక్కువ సమయం ఇస్తానని ఎన్నికల ముందు బాబు హామీ
– పార్టీ ఉంటేనే ప్రభుత్వం వస్తుందంటున్న సీనియర్లు
– నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
అధికారం కోసం ఐదేళ్లపాటు ఆవురావురమంటూ ఎదురుచూసిన తెలుగు తమ్ముళ్లు.. ఇప్పుడు పదవుల కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రత్యక్షంగా కష్టపడ్డనేతలు, తెరవెనుక పనిచేసిన ప్రముఖుల నుంచి.. జనసేన-బీజేపీ పొత్తులో టికెట్లు కోల్పోయిన త్యాగధనులు.. చివరకు గత ఎన్నికల్లో పార్టీ కోసం వివిధ రూపాల్లో పనిచేసిన మాజీ అధికారులు, జర్నలిస్టులు, మీడియా అధిపతులు కూడా పదవులు ఆశిస్తున్న పరిస్థితి. ఊహించని స్థాయిలో విజయం దక్కడంతో.. నేతల ఆశలు-అంచనాలు కూడా అదే స్థాయిలో ఉండటమే, టీడీపీ నాయకత్వంపై ఒత్తిడి పెరిగేందుకు కారణమవుతోంది.
పైగా కూటమి భాగస్వాములను కూడా తృప్తిపరచడం-అదే సమయంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్ని కష్టాలు భరిస్తూ జెండా ఎత్తిన సొంత పార్టీ నేతలను, ఏకకాలంలో తృప్తిపరచడం సవాలుగా పరిణమించింది. ఇది పార్టీకి తొలి అనుభవం. గతంలో బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటుచేసినా, ఈ ఒత్తిళ్లు కనిపించలేదు.
ఈ నేపథ్యంలో పదవుల పంపిణీ కత్తిమీదసాములా పరిణమించింది. పార్టీకి రెండుకళ్లయిన చంద్రబాబునాయుడు-లోకేష్ అపాయింట్‌మెంట్లు కూడా కష్టమవుతున్న పరిస్థితి. మధ్యలో మారిన పార్టీ వ్యవస్థలు. మొత్తంగా పార్టీలో, మునుపటి వాతావరణం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న వైనం. ఈ నేపథ్యంలో జరుగుతున్న పొలిట్‌బ్యూరో భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీఎంగా అవతరించిన, జూన్ 12 నుంచి.. పార్టీలో పదవుల పండగపై ఎదురుచూపులు మొదలయ్యాయి. ప్రధానంగా పొత్తులో సీట్లు దక్కని 31 నియోజకవర్గ నేతల్లో అయితే, ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. వీరు కాకుండా ఎన్నికల్లో ప్రత్యక్షంగా-పరోక్షంగా పనిచేసిన సీనియర్లు, మాజీ అధికారులు, జర్నలిస్టులు, వివిధ మీడియా సంస్థల అధిపతులు తమ స్థాయి పదవులు కోరుకుంటున్నారు. ఇక ఎన్నికల్లో విజయం కోసం వివిధ కుల-మత-ప్రజా-విద్యార్థిసంఘనేతలతో పనిచేయించుకున్నందున, వారు కూడా పదవులు ఆశిస్తున్న పరిస్థితి.
ఇప్పటివరకూ పార్టీకి సంబంధం లేకుండా, లక్ష్పీపార్ధసారధి ఒక్కరిని మాత్రమే నియమించారు. మిగిలిన అన్ని పదవులూ పెండి ంగ్‌లోనే ఉన్నాయి. టీటీడీ చైర్మన్-పాలకవర్గం కూడా భర్తీకాలేదు. టీటీడీ చైర్మన్ పదవి టీవీ5 అధినేత బీఆర్‌నాయుడుకు దక్కుతుందన్న ప్రచారం, చాలాకాలం నుంచి వినిపిస్తోంది. ఇక మంత్రి పదవి ఆశించిన, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పేరు కూడా గత కొద్దిరోజుల నుంచి తెరపైకొచ్చింది. బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్రయాదవ్ పేరు కూడా వినిపిస్తోంది.
అయితే టీటీడీ అడిషనల్ ఈఓగా వెంకయ్యచౌదరిని నియమించినందున, మళ్లీ కమ్మ వర్గానికి చెందిన టీవీ5 నాయుడుకి చైర్మన్ పదవి ఇచ్చే సాహసం చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈఓగా బీసీని నియమించినందున, మళ్లీ మరొక బీసీకి ఇస్తారా? అన్నది మరో చర్చ. 7 గురు ఎమ్మెల్యేలున్న క్షత్రియ వర్గానికి ఆ పదవి ఇచ్చి సంతృప్తి పరుస్తారా? లేదా కొత్తగా మరొకరిని తెరపైకి తీసుకువస్తారా? అన్నది ఇంకో చర్చ.
ఏపీ నుంచే కాకుండా తెలంగాణ నుంచి బక్కని నర్శింహులు, కాట్రగడ్డ ప్రసూన, అరవిందకుమార్‌గౌడ్ పేర్లు బోర్డు సభ్యుల పేర్లకు వినిపిస్తున్నాయి. ఏదేమైనా టీటీడీ పదవులను త్వరగా భర్తీచేయాలన్నది పార్టీ నేతల సూచన.
ఇక అధికారంలోకి వచ్చి రెండునెలలవుతున్నా ఇప్పటిదాకా డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్‌ల నియామకాలు చేయలేదు. అయితే బోయ వర్గానికి చెందిన సీనియర్ నేతల, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు డిప్యూటీ చైర్మన్, కూన రవికుమార్‌కు చీఫ్ విప్ దక్కుతుందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. ఈసారి 14 మంది విప్‌లను నియమిస్తారంటున్నారు. కాగా కీలకమైన సీఎం సీపీఆర్‌ఓను కూడా ఇప్పటిదాకా నియమించని వైచిత్రి. రమేష్ పేరు పరిశీలనలో ఉందంటున్నారు. దానిని కూడా త్వరగా ఖరారు చేయాల్సి ఉంది.
అదేవిధంగా ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధిని ఇంకా భర్తీ చేయలేదు. ఆ క్రమంలో మాజీ ఎంపి, ప్రముఖ న్యాయవాది కనకమేడల రవీందర్ పేరు చాలాకాలం నుంచి వినిపిస్తుండగా, కొత్తగా మాజీ ఎంపి గల్లా జయదేవ్ పేరు తెరపైకివచ్చిందంటున్నారు. ఇక ప్లానింగ్‌బోర్డు ఉపాధ్యక్ష పదవి కూడా పెండింగ్‌లోనే ఉంది. ఇది సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరికి దక్కవచ్చంటున్నారు. ఇవి కాక క్యాబినెట్‌లో ఒక మంత్రి పదవి భర్తీ చేయలేదు. దానిని ఇప్పట్లో భర్తీ చేసే అవకాశాలు లేవంటున్నారు.
ఇక వీరు కాకుండా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెన్నంటి ఉండే ఆయన రాజకీయ కార్యదర్శి టీడీ జనార్దన్, గత ఎన్నికల్లో సమన్వయకర్తలుగా పనిచేసిన బీద రవిచంద్ర, మంతెన సత్యనారాయణరాజు, హన్మంతరావుతోపాటు.. బుద్దా వెంకన్న, వర్ల రామయ్య, పట్టాభి, మాల్యాద్రి, కోనేరు సురేష్, విజయకుమార్, గోనెగుంట్ల కోటేశ్వరరావు వంటి నేతలకూ వారి స్థాయిలో పదవులు ఇవ్వాల్సి ఉంది. వీరిలో టీడీ జనార్దన్ గత ఎన్నికల్లో వివిధ వర్గ-కుల-మత సంఘాలతోపాటు.. సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తులు, వామపక్ష నేతలను సమన్వయ పరిచారు. ఎన్టీఆర్ అభిమానులను ఏకం చేసే లక్ష్యంలో ఆయన నిర్వహించిన సమావేశాలు విజయవంతమయిన విషయం తెలిసిందే.
కాగా జగన్ రాక్షసత్వానికి బలయిన మాజీ ఐపిఎస్ ఏబీవెంకటేశ్వరావుకు ఏ పదవి లభిస్తుందన్న అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టీడీపీ సర్కారుతో అంటకాగిన ఏబీ, వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్పించారన్న కసితో రగలిపోయిన జగన్.. ఆయనను రెండుసార్లు సస్పెండ్ చేశారు. నిజానికి జగన్‌పై న్యాయపోరాటం చేసి విజయం సాథించిన ఏబీకి, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దపీట వేస్తారన్న అంచ నాలు వ్యక్తమయ్యాయి.
రిటైరైన తర్వాత ఆయనకు ఉన్నత పదవి ఇచ్చి, పోలీసు శాఖకు సంబంధించిన వ్యవహారాలు అప్పగిస్తారన్న చర్చ జరిగింది. అయితే విచిత్రంగా లక్ష్మీపార్ధసారథికి పదవి ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తమయింది. ఇప్పుడు పార్టీ శ్రేణులు జగన్‌పై పోరాడిన ఏబీ-రఘురామరాజుకి, ఏ పదవి ఇస్తారన్న అంశంపై ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
కాగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మళ్లీ పార్టీని పక్కనబెట్టి, ప్రభుత్వానికే ఎక్కువ సమయం ఇస్తున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ విధానం వల్లే ఓడిపోయాయని, ఇకపై అధికారులకు ప్రాధాన్యం ఇవ్వకుండా, పార్టీ నేతలకే ఎక్కువ సమయం కేటాయిస్తానని బాబు గత ఐదేళ్లలో చాలాసార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
పార్టీని బలోపేతం చేసుకుని, క్యాడర్‌ను కాపాడుకుంటేనే పార్టీ పదికాలాలు అధికారంలో ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.పైగా లోకేష్ భవిష్యత్తుకు బాటలు వేసి, ఆయనను సీఎంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నందున, పార్టీపై ఎక్కువ దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
జగన్‌కు భిన్నంగా చంద్రబాబు-లోకేష్‌తోపాటు పార్టీ ఆఫీసులో మంత్రులు-పార్టీ నేతలు రోజూ వందలాదిమందిని కలుస్తుండటం మంచిదేనని, అయితే పార్టీ నేతలకు మాత్రం తగినంత సమయం కేటాయించడం లేదన్న వ్యాఖ్యలు, సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో నేతల స్థాయి-విలువ-వారి ప్రాధాన్యం తెలిసిన వారు బాబు దగ్గర ఉండటంతో, తమకు ఎలాంటి సమస్యలు రాలేదంటున్నారు.
ప్రస్తుతం వారిద్దరి అపాయింట్‌మెంట్ సిస్టమ్ మారిపోవడంతో.. అప్పటి పార్టీకి-ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంద ని సీనియర్లు చెబుతున్నారు. వారితో వన్‌టు వన్‌కు అవకాశం ఉండటం లేదంటున్నారు. ఈ క్రమంలో అపాయింట్‌మెంట్ విధానాన్ని సమీక్షించుకోవలసిన అవసరం ఉందంటున్నారు.
ఈ నేపథ్యంలో జరగనున్న పోలిట్‌బ్యూరో భేటీకి సహజంగానే ప్రాధాన్యం ఏర్పడింది. ఈ భేటీలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉంది. పీలా గోవింద్, బైరా దిలీప్ పేర్లు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి వినిపిస్తున్నాయి. దిలీప్‌కు బీజేపీ ఎంపి సీఎం రమేష్ మద్దతునిస్తున్నట్లు తెలుస్తోంది.