దోపిడీ ముక్త తిరుమల ఎప్పుడు?

- తిరుమలలో భక్తిని చంపుతున్నారు..దోపిడీ పెంచుతున్నారు
- దేవుణ్ణి వ్యాపారంగా మార్చిన వారికి హెచ్చరిక
నేను ఒక హిందువుగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, గుండెలో భరించలేని బాధతో ఈ మహా వ్యాసం రాస్తున్నాను. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, నేను దేవుని పక్షం.
కలియుగంలో మనకు దిక్కు ఆ ఏడుకొండల వాడు ఒక్కడే. కష్టం వస్తే, అప్పుల బాధ వస్తే, బిడ్డకు జబ్బు చేస్తే మనం వెళ్ళేది తిరుపతికే. కానీ ఇవాళ ఆ కొండ మీద జరుగుతున్నది ఏమిటి? భక్తుడి భక్తిని, కన్నీళ్లను, కష్టార్జితాన్ని దోచుకునే పెద్ద దోపిడీ యంత్రం నడుస్తోంది. భక్తుడు భక్తితో వెళ్లి విరక్తితో వెనక్కి వస్తున్నాడు. ఇంతకంటే హిందూ ధర్మానికి అవమానం ఇంకేముంటుంది?
విఐపి దర్శనం పేరుతో జరుగుతున్న అతిపెద్ద టికెట్ వ్యాపారం
దేవుని ముందు అందరూ సమానం అని మన వేదాలు చెబుతున్నాయి. కానీ టిటిడిలో మాత్రం దేవుని ముందు కూడా రెండు రకాలు – డబ్బున్న విఐపి మరియు పేద భక్తుడు.
ప్రతిరోజూ ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, జడ్జి, ఐఏఎస్ ఐపిఎస్ పేరుతో వేలల్లో సిఫార్సు దర్శన టికెట్లు ఇస్తున్నారు. ఇవి ఉచితం. కానీ ఆ ఉచిత టికెట్లు గుడికి వెళ్లడం లేదు. అవి బయట ఉన్న బ్రోకర్ల చేతిలోకి వెళ్లి ఒక్కో టికెట్ రూ.2000 నుండి రూ.5000 వరకు అమ్ముడవుతోంది. ఇది బహిరంగ రహస్యం. తిరుపతిలోని ప్రతి హోటల్ దగ్గర, ప్రతి ఆటో స్టాండ్ దగ్గర ఈ బ్రోకర్లు విఐపి టికెట్ కావాలా సార్?” అని అడుగుతారు.
ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు దేవుని టికెట్లను అమ్ముకుని సొమ్ము చేసుకోవడం కంటే దిగజారుడు ఇంకేముంటుంది? ఈ టికెట్ల కోసం కొన్ని ప్రత్యేక కౌంటర్లు, ప్రత్యేక ఉద్యోగులు. సామాన్యుడికి మాత్రం ఆ కౌంటర్లు కనబడవు. సామాన్యుడికి కనబడేది 20 గంటల క్యూ మాత్రమే.
క్యూ కాంప్లెక్స్ లు కాదు, అవి నరకపు జైళ్లు
ఒక్కసారి మీరు సామాన్య భక్తుడిగా క్యూలోకి వెళ్లి చూడండి అన్నా. 2 అడుగుల ఇరుకు ఇనుప గొట్టాల్లో, గాలి ఆడని, ఫ్యాన్ తిరగని కొట్టాల్లో చిన్న పిల్లల్ని చంకలో పెట్టుకున్న తల్లులు, 80 ఏళ్ల ముసలి తాతలు, గుండె జబ్బుతో వచ్చిన భక్తులు 12 గంటలు, 14 గంటలు, 24 గంటలు బంధించబడతారు. కూర్చోవడానికి చోటు ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు, టాయిలెట్లు నరకంలా ఉంటాయి. పిల్లలు ఏడుస్తుంటే టిటిడి సిబ్బంది కసురుకుంటారు, తోస్తారు.
ఇదే సమయంలో పక్కనే ఉన్న వీఐపీ బ్రేక్ గేటు తెరుచుకుంటుంది. అందులో నుండి సినిమా వాళ్ళు, రాజకీయ నాయకుల బినామీలు, డబ్బున్న వ్యాపారస్తులు నవ్వుకుంటూ 60 నిమిషాల్లో దర్శనం చేసుకుని బయటకు వస్తారు. క్యూలో ఉన్న పేద భక్తుడు ఆ దృశ్యం చూసి ఏమనుకుంటాడు? “స్వామీ నీకు కూడా ధనవంతుడే కావాలా? పేదవాడు అంటే లెక్కలేదా?” అని వాడి మనసులో దేవుడి మీదే అనుమానం వస్తుంది. మీరే హిందువును గుడికి దూరం చేస్తున్నారు. ఇది మత ద్రోహం కాదా?
రూములు, లడ్డూలు, బస్సులు – ఎక్కడ చూసినా దోపిడీయే
వందల కిలోమీటర్ల నుండి వచ్చే భక్తుడికి కొండ మీద రూము దొరకదు. ఆన్ లైన్ లో చూస్తే 90 రోజులు ఫుల్ అని చూపిస్తుంది. కానీ కొండ మీద చాలా భవనాలు ఖాళీగా కనబడతాయి. ఎందుకంటే ఆ రూములు కూడా బ్రోకర్ల చేతిలో ఉన్నాయి. ఆఫ్ లైన్ కౌంటర్ దగ్గర 6 గంటలు నిలబడినా “లేదు” అంటారు, అదే బ్రోకర్ కి రూ.3000 ఇస్తే 5 నిమిషాల్లో రూము ఇస్తాడు.
లడ్డూ ప్రసాదం దగ్గర కూడా అదే తంతు. కావాల్సినన్ని ఇవ్వరు, కృత్రిమ కొరత. బయట బ్లాక్ లో రూ.50 లడ్డూ రూ.300 కి అమ్ముతారు. గతంలో కల్తీ నెయ్యి వాడారు అనే ఆరోపణ వచ్చినా, ఒక్కరిపైనా కఠిన చర్య లేదు.
ఆన్ లైన్ బుకింగ్ అనే సాఫ్ట్ వేర్ మోసం
రూ.300 దర్శనం టికెట్ కోసం 3 నెలలు ముందు కంప్యూటర్ ముందు కూర్చోవాలి. బుకింగ్ ఓపెన్ అయిన 60 సెకన్లలోనే అన్నీ అయిపోయాయి అని చూపిస్తుంది. సామాన్యుడికి OTP కూడా రాదు. ఎలా అయిపోతున్నాయి? దీని వెనుక పెద్ద సాఫ్ట్ వేర్ మాఫియా ఉంది. బ్రోకర్లు బాట్ సాఫ్ట్ వేర్ లు, ఆటోమేషన్ తో వేల టికెట్లు బుక్ చేసి, వాటిని బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. టిటిడి ఐటి విభాగానికి ఇది తెలియదా? తెలిసి కూడా ఎందుకు ఆపడం లేదు? అంటే అందులో వాటాలు వెళుతున్నాయి కాబట్టే.
హుండీ లెక్కలు, భూములు, బంగారం – శ్వేతపత్రం ఎక్కడ?
రోజుకు హుండీలో 4 కోట్ల నుండి 6 కోట్ల వరకు ఆదాయం, కిలోల బంగారం, వజ్రాలు వస్తాయి. సంవత్సరానికి రూ.4000 కోట్లకు పైగా. భక్తులు తమ పొలాలను, ఇళ్ల స్థలాలను స్వామికి రాసిస్తారు. టిటిడికి దేశవ్యాప్తంగా వేల ఎకరాల భూములు ఉన్నాయి. వాటి లెక్క ఏమైంది? ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి? ఎంత బంగారం బ్యాంకుల్లో ఉంది? ఎంత వడ్డీ వస్తోంది? ఎందుకు ప్రతి ఏడాది శ్వేతపత్రం విడుదల చేయరు? భక్తుడికి తన సొమ్ము ఏమైందో తెలుసుకునే హక్కు లేదా? ఆ డబ్బుతో పేద హిందువులకు గురుకులాలు, వేద పాఠశాలలు, ఉచిత ఆసుపత్రులు కట్టాలి.
ప్రభుత్వాలు మారినా దోపిడీ మారలేదు – పవన్ కళ్యాణ్ కలగచేసుకోవాలి
గత ప్రభుత్వ హయాంలో తిరుపతిని భ్రష్టు పట్టించారు అని అందరూ అన్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏం మారింది? చైర్మన్ లు మారారు, ఈఓ లు మారారు కానీ లోపల ఉన్న బ్రోకర్ వ్యవస్థ, అవినీతి వ్యవస్థ అలాగే ఉంది. పైపైకి రంగులు, కింద అంతా దోపిడీ.
పవన్ కళ్యాణ్ గారు! మీరు సనాతన ధర్మం కోసం గొంతు చించుకుంటారు, మేము గౌరవిస్తాం. కానీ సనాతన ధర్మానికి మూలమైన తిరుపతిలోనే ధర్మం చచ్చిపోతుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక్కసారి మీరు విఐపిగా కాదు, ఒక సామాన్య భక్తుడిగా క్యూలో 12 గంటలు నిలబడి చూడండి, ఒక్కసారి రూముల కోసం లైన్ లో వెళ్ళండి.
తరవాత మళ్లీ లడ్డు లైన్ వెళ్ళండి .. ఆది రాబోయే బ్రహ్మోత్సవాలలో ..
హిందుత్వాన్ని నాశనం చేస్తున్నది ఎవరు?
హిందుత్వాన్ని నాశనం చేస్తున్నది మతం మార్చే వాళ్ళు కాదు. హిందువును గుడికి దూరం చేస్తున్న ఈ దోపిడీదారులు కూడా … ఒక భక్తుడు తిరుపతికి వెళ్లి “ఛీ ఇంత , ఇంత అవమానమా, ఇక నేను గుడికే రాను” అనుకునే పరిస్థితి తెచ్చారు. ఇంతకంటే పెద్ద మత ద్రోహం ఇంకోటి ఉండదు.
కొన్ని డిమాండ్లు
విఐపి సిఫార్సు కోటా వెంటనే రద్దు చేయాలి: లేదా లక్కీ డ్రా లో 50% టికెట్లన్నీ సామాన్యులకు ఇవ్వాలి. దేవుని ముందు అందరూ సమానమే.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: ఉదయం 1 గంటకి కుదించి ఆ మిగతా సమయం వృద్ధులకు పిల్లల తల్లులకు కేటాయించాలి.
బ్రోకర్ వ్యవస్థపై సీబీఐ ఏసీబీ దాడులు: రూములు, టికెట్లు, లడ్డూల బ్రోకర్లపై, వారికి సహకరిస్తున్న టిటిడి ఉద్యోగులపై, రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టాలి.
ఆన్ లైన్ వ్యవస్థలో పారదర్శకత: బుకింగ్ సర్వర్ లను ఓపెన్ చేయాలి, బాట్ బుకింగ్ లను ఆపాలి. రోజు విఐపి మరియు బ్రేక్ దర్శనలతో సహా . కొండపైన విఐపి రూమ్ లు ఎవరికి కేటాయిస్తున్నారో వెబ్సైట్ లో రోజు తెలియపరచాలి.
ఆదాయంపై శ్వేతపత్రం: ప్రతి ఏడాది హుండీ ఆదాయం, బంగారం, భూముల లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
అన్నదానంలో నాణ్యత: దాతల సొమ్ముతో భక్తులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం పెట్టాలి.
ఇప్పటికైనా ప్రభుత్వం, టిటిడి పాలకమండలి కళ్లు తెరిచి చర్యలు తీసుకోవాలి.
ఈ మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టే దాకా .. సోషల్ మీడియా లో ఇలా ప్రశ్నిస్తూనే ఉంటాం.
దేవుడు అందరివాడు, కొందరు దోపిడీదారుల అబ్బ సొత్తు కాదు!
జై శ్రీమన్నారాయణ! జై హింద్!

ఒక భక్తుడి ఆవేదన
