Suryaa.co.in

Telangana

గవర్నర్‌పై ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలేవీ?

– పోలీసులకు టీడీపీ నేత ప్రసూన, లత ఫిర్యాదు

tamilsaiగవర్నర్ తమిళసైపై సోషల్‌మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి తెలంగాణ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, రాష్ట్ర కార్యదర్శి సూర్యదేవర లత డిమాండ్ చేశారు. ఆ మేరకు వారు బంజారాహిల్స్ ఏసీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. ఒక మహిళా గవర్నర్‌కు రక్షణ కల్పించకపోవడం సిగ్గుచేటని, రాష్ట్రంలో రౌడీ రాజ్ పెరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.టీడీపీ మహిళా నేతల ఫిర్యాదు సారాంశం ఇదీ..

తేది: 20-04-2022
శ్రీయుతగౌరవనీయులైన బంజారాహిల్స్‌ ఏసీపీ గారికి,
హైదరాబాద్‌,
తెలంగాణ రాష్ట్రం

అయ్యా!
విషయం: గవర్నర్‌ను అవమానపరిచేలా ట్విట్టర్‌లో ట్రోల్స్‌ చేసిన వారిపై చర్యల గురించి..

రాజ్యాంగాన్ని పరిరక్షించే గవర్నర్‌కి ఈ రాష్ట్రంలో రక్షణ కరువా..?
చట్టాలను అమలు చేయవలసిన బాధ్యత ఉన్న వ్యక్తికే చట్టపరమైన హక్కులు కరువా..?
– ఇదా.. ఈ రాష్ట్ర పరిస్థితి?

రాష్ట్ర ప్రధమ పౌరురాలు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను అవమానిస్తూ కొందరు సోషల్‌ మీడియాలో ఆమెపై అభ్యంతరక పోస్టులు పెడుతున్నారు. ఆమె ఫోటోపై ఎర్రటి తిలకం దిద్ది అవమానిస్తూ అనేక రకాల కామెంట్లు పెడుతూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ విధంగా మహిళ అనే గౌరవం లేకుండా ఉన్నత పదవిలో ఉన్న మహిళను అవమానిస్తూ పోస్టులు పెడుతుంటే ఇక రాష్ట్రంలో సామాన్య మహిళల పరిస్థితి ఏమిటనేది అర్థం కావడం లేదు.

మన దేశంలో మహిళను దేవతల మాదిరిగా పూజిస్తుంటారు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని నానుడి. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని అర్థం. కానీ ఏ తప్పు చేయకుండానే రాష్ట్ర గవర్నర్‌పై రాష్ట్ర ప్రభుత్వమే కక్షకట్టి ప్రోటోకాల్‌ పాటించకుండా, ఆమె కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులెవరూ హాజరు కాకుండా అవమానిస్తున్నారు.

ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, మంత్రులే గవర్నర్‌ను అవమానిస్తుంటే వారిని అనుసరిస్తూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సైతం ట్విట్టర్‌లో ఆమెను అవమానిస్తున్నారు. షీ-టీమ్‌లు పెట్టి మహిళలను వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ రాష్ట్ర గవర్నర్‌ను అవమానిస్తున్న వారిపై షీ-టీమ్‌ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు ఎవరిని వేధించినా, వారి వేధింపులకు గురై రాష్ట్రంలో ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నా పోలీసులు వారిపై చర్యలు తీసుకోవడం లేదు.

కనుక టీఆర్‌ఎస్‌ నాయకులు రెచ్చిపోయి సామాన్యులపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చట్టానికి అతీతులని ప్రభుత్వం చెబుతున్నదా..? వారు ఎన్ని దుర్మార్గాలైనా చేయవచ్చునని పోలీసులు వారికి లైసెన్సులేమైనా ఇచ్చారా?

ఇప్పటికైనా గవర్నర్‌ను అవమానిస్తున్నవారిపై సైబర్‌క్రైం కింద కేసులుపెట్టి తక్షణం అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున పోలీసులను డిమాండ్‌ చేస్తున్నాం. ఎవరు తప్పు చేసినా పార్టీలకతీతంగా వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

-కాట్రగడ్డ ప్రసూన
ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే,
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం.
-సూర్యదేవర లత
తెలుగుమహిళా ప్రధాన కార్యదర్శి
తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం.

LEAVE A RESPONSE