– అప్పుల పై తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
-వడ్డీలపై కాంగ్రెస్ ‘కాకి లెక్కల’ డొల్లతనం బట్టబయలు చేసిన అక్టోబర్ నెల కాగ్ CAG నివేదిక
– నెలకు రూ. 2300 కోట్లు కూడా లేని వడ్డీని రూ. 7 వేల కోట్లని అబద్ధాలు చెబుతున్నారు
– సంక్షేమ పథకాలకు, ప్రాజెక్టుల కు బదులుగా ‘స్క్యామ్’ల కోసమే అప్పులు
– ఏ ఏ పథకాలకు, ఏ ఏ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశారో వెంటనే వివరాలు విడుదల చేయాలి
– గత 7 నెలలుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల వివరాలను కూడా తక్షణమే ప్రజల ముందు ఉంచాలి
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన అప్పులపై పదేపదే చెబుతున్న ‘కాకి లెక్కల’ డొల్లతనం కాగ్ (CAG) నివేదిక ద్వారా మరోసారి పూర్తిగా బట్టబయలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాగ్ నివేదిక అక్టోబర్ నెల కోసం విడుదల చేసిన లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అప్పులు వాటికి కడుతున్న వడ్డీలను తన నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొన్నదని కేటీఆర్ తెలిపారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ పదేపదే అప్పుల కాకి లెక్కలు అన్ని మరోసారి తేలిపోయాయని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ప్రభుత్వ ఆదాయం, కొత్త అప్పులు సరిపోతున్నాయంటూ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కాగ్ తాజా లెక్కలు పూర్తిగా కొట్టిపారేశాయని ఆయన ధ్వజమెత్తారు.
ప్రతి నెలా రూ. 6,000 నుంచి రూ. 7,000 కోట్లు వడ్డీల కోసమే చెల్లిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. కానీ కాగ్ ఇచ్చిన తాజా నివేదిక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధాల పైన మరోసారి చెంప దెబ్బ లాంటి వాస్తవాలను బయటపెట్టింది అని కేటీఆర్ విమర్శించారు. కాగ్ లెక్కల ఏప్రిల్ 2025 నుండి అక్టోబర్ 2025 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన మొత్తం వడ్డీ కేవలం రూ. 16,529.88 కోట్లు. అంటే నెలకు సగటున కేవలం రూ. 2,361.41 కోట్లు మాత్రమే అన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం పదేపదే 6000 నుంచి 7000 కోట్లు ప్రతినెల వడ్డీలు కడుతున్నామంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకులు చెబుతున్న దానిలో సగం కూడా వడ్డీలకు వెళ్లడం లేదు. వడ్డీల పేరుతో అబద్ధాలు చెప్పి, పాలన చేతకానితనాన్ని, తాము చేస్తున్న తప్పులను అవినీతిని అప్పుల మాటున దాచిపెడుతుందని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల మధ్య ఉన్న తేడాను కేటీఆర్ వివరంగా స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రతి పైసా ద్వారా ఆస్తులను సృష్టిస్తే ఈ ప్రభుత్వం మాత్రం అప్పుల సునామిని సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తుందని మండిపడ్డారు.
పార్లమెంటు లెక్కల ప్రకారం పది సంవత్సరాల కాలంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం కేవలం 2.80 లక్షల కోట్ల అప్పులు తీసుకువస్తే, 23 నెలల కాలంలోనే దాదాపు రెండు లక్షల 30 వేల కోట్ల అప్పులను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని కేటీఆర్ అన్నారు. ఆనాడు మిషన్ భగీరథ కాలేశ్వరం పాలమూరు రంగారెడ్డి మిషన్ కాకతీయ వేలకోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం వంటి అనేక ఉత్పాదక ఆస్తులను సృష్టించిందని, కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకం లేకుండానే, ఒక్క ప్రాజెక్టు ప్రారంభం కూడా చేయకుండానే, కనీసం మౌలిక వసతుల కోసం ఒక్క ఇటుక పేర్చకుండానే రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువచ్చి ఏం చేసిందని కేటీఆర్ ప్రశ్నించారు.
అక్టోబర్ నెల కోసం విడుదల చేసిన కాగ్ నివేదికతో వడ్డీల వాదనలో డొల్లతనం బయటపడటంతో, ఇంత భారీ మొత్తంలో చేస్తున్న అప్పులన్ని ఎవరి జేబుల్లోకి పోతున్నాయో ప్రజలుకు తెలియజేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వడ్డీల పేరుతో పదేపదే అబద్ధాలు చెబుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, వాస్తవానికి ఈ అప్పులన్నింటినీ తమ అనుచరులు, మధ్యవర్తులు మరియు ఢిల్లీకి మూటలను పంపడానికే ఉపయోగిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ‘స్కామ్గ్రెస్ ఏటీఎం’ గా మార్చారు.
ఇన్ని రోజులు వడ్డీల కోసమే అప్పులు చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొచ్చినా, కాగ్ నివేదికతో మరోసారి వాదనలోని డొల్లతనం బట్టబయలైనందున, ఈ అప్పులన్నీ దేని కోసం చేశారో వెంటనే ప్రజలకు వివరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ కొన్ని ముఖ్యమైన డిమాండ్లు చేశారు. వడ్డీల లెక్కలపై పదేపదే అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి.
గత 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి తెచ్చిన రూ. 2.23 లక్షల కోట్ల అప్పులు ఏ ఏ పథకాలకు, ఏ ఏ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశారో వెంటనే వివరాలు విడుదల చేయాలి. అదే విధంగా, గత 7 నెలలుగా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల వివరాలను కూడా తక్షణమే ప్రజల ముందు ఉంచాలన్నారు. వీటితోపాటు ఈ అంశంలో ప్రజలను ముఖ్యంగా శాసనసభను తప్పుదోవ పట్టించినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కేటీఆర్ మరోసారి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అప్పుల పేరు చెప్పి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను, 420 హామీలను అమలు చేయకుండా తప్పించుకుంటే కుదరదని, కాంగ్రెస్ పార్టీ చెబుతున్న అప్పుల కాకి లెక్కలు ప్రజలు నమ్మరని కేటీఆర్ అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత జేబులు నింపుకోవడం పక్కన పెట్టి తీసుకు వస్తున్న అప్పులతో ప్రజలకు సంక్షేమ పథకాలను రాష్ట్ర భవిష్యత్తు కోసం మౌలిక వసతుల నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టాలని డిమాండ్ చేశారు.