– ప్రతి పక్ష నాయకుడిని విమర్శించడమే జర్నలిస్టు యూనియన్ల లక్ష్యమా?
– యాజమాన్యాలను విమర్శిస్తే మీకు నొప్పెందుకు…?
– జర్నలిస్టుల సంక్షేమాన్ని వీడి రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నారా?
– మీరు చంద్రబాబు ఫోటో పెట్టుకుని బైక్ ర్యాలీలు చేసినప్పుడే మీ క్రెడిబిలిటీ పోయింది
– రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టులపై కేసులు, దాడులు
– జర్నలిస్టుల స్వేచ్ఛను హరిస్తుంటే ఈ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు?
– యూనియన్ వాదులు కొంత మంది నాయకుల తీరును గమనించాలి
విజయవాడ: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ మీడియాను విమర్శించారంటూ ఈ రోజు ఇండియన్ జర్నలిస్టు యూనియన్, ఏపీయూడబ్ల్యూజే, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేసింది. దాన్ని చూసి యూనియన్ లో వ్యక్తిగా నాకు చాలా ఆశ్చర్యమేసింది. మా యూనియన్లు ఎప్పుడు జర్నలిస్టుల పక్షాన్ని వీడి యాజమాన్య పక్షాన చేరాయో అర్ధం కావడం లేదు.
కేవలం జగన్ ను విమర్శిస్తే మీకు చంద్రబాబు వద్ద పబ్బం గడుస్తుందంటే అలానే విమర్శలు చేయండి. కానీ ఒక జర్నలిస్టు యూనియన్ గా మీరు జర్నలిస్టుల సంక్షేమం, భద్రతను గాలికొదిలి టీడీపీ ఎజెండాను పట్టుకుని తిరుగుతున్నప్పుడే మీరేంటో స్పష్టమవుతోంది. యూనియన్ కొంత మంది నాయకత్వంలో దిగజారిపోతుందనడానికి ఇదొక నిదర్శనం.
ఎప్పుడైతే చంద్రబాబు ఫోటో పెట్టుకుని బైక్ ర్యాలీలు చేసినప్పుడే, మీరు ఏ పక్షమో రాష్ట్రంలోని జర్నలిస్టులకు అందరికీ అర్ధం అయ్యింది. ఇప్పుడు ఏకంగా ముసుగు తొలగించి టీడీపీ ఎజెండాలో వాళ్లు చెప్పినట్లే రాజకీయ విమర్శలు చేస్తున్నారు.
వైఎస్ జగన్ కొన్ని సంస్థలను విమర్శిస్తే…మీరు ఆ యాజమాన్యాలకు ఒత్తాసు పలకడం ఏమిటి? రాష్ట్రంలోని నిజమైన యూనియన్ వాదులు దీన్ని ప్రశ్నించాలి. ఏకచత్రాధిపత్యంగా యూనియన్ ను తప్ప చెప్పుచేతల్లో పెట్టుకుని చంద్రబాబుకు తాకట్టు పెడతామంటే ఎలా? మీరు రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై ఏనాడైనా స్పందించారా? కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి సీనియర్ జర్నలిస్టు డిబేట్ లో ఎవరో ఏదో మాట్లాడితే..ఒక సీనియర్ జర్నలిస్టు మాట్లాడింది తప్పు అని యూనియన్ చెప్పింది.
రోజూ డిబేట్లలో అడ్డంగా మాట్లాడే పచ్చ జర్నలిస్టుల మాటలు మాత్రం మీకు కనిపించవు. సాక్షి ఎడిటర్ ఇంటిపై దాడి చేసినా, సాక్షి కార్యాలయాలకు నిప్పు పెట్టినా మీరు నామమాత్రపు స్పందన చూపుతారు. ఇప్పటికి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పదికి పైగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. మీరు ఎందుకు ఆ విషయంపై ఉద్యమాన్ని లేవదీయడం లేదు? ఒక ఎడిటర్ ఇంటిలో సోదాలు చేస్తే జర్నలిస్టు యూనియన్ గా మీరు చేసిందేమిటి?
అక్రెడిటేషన్ కమిటీల్లో ఆ జర్నలిస్టుల పేర్లు ఎందుకు తొలగించారు?
అక్రిడియేషన్ కమిటీల్లో సాక్షి, టీవీ9, 10టీవీ, ఎన్ టీవీల జర్నలిస్టులు ఉండటానికి వీళ్లేదని ఈ ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేస్తే మీరు ఎందుకు జీహుజూర్ అన్నారు? ఆయా సంస్థల పేరుపై కాకుండా యూనియన్ పేరుపై మీరు జర్నలిస్టులను సిఫార్సు చేసి మళ్లీ ఎందుకు వెనక్కు తీసుకున్నారు?
వారు మా యూనియన్ వారు…సంస్థలతో సంబంధం ఏముంది అని మీరెందుకు అనలేకపోయారు? ఇక్కడ గురివింద గింజ సామెత మీకే వర్తిస్తుందేమో ఓ సారి చెక్ చేసుకోండి. పక్షపాతంతో ప్రభుత్వం నిషేదించిన చానళ్లను మీ అక్రిడియేషన్ల లిస్టు నుంచి తీసేనప్పుడే మీరు పక్షపాతం వ్యవహరించారని తేటతెల్లమవుతోంది. ఇక గురివింద గింజలా ఇప్పుడు మీరు జగన్ ను విమర్శించడాన్ని మీరే బేరీజు వేసుకోండి.
దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టులపై మన రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదు చేశారు. దాడులు చేశారు. వారి కోసం యూనియన్ ఎంత గట్టిగా పోరాడింది అనేది యూనియన్ లో ప్రతి ఒక్కరికీ తెలుసు. దేశంలో మీడియా స్వేచ్ఛ విషయంలో రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉంది. ఏ ఒక్క జర్నలిస్టు స్వేచ్ఛగా తమ విధులను నిర్వర్తించుకునే పరిస్థితి లేదనేది జగమెరిగిన సత్యం. మరి యూనియన్ పెద్దలు చంద్రబాబు మెప్పు కోసం పాకులాడటం తప్ప ఈ పరిస్థితిపై ఒక్కరోజన్నా మాట్లాడారా?
మీకు జగన్ పై ఉన్న కక్ష్య ఇప్పటిది కాదు. అది అందరికీ తెలుసు. మీడియాపై జగన్ కు చులకన భావం ఉందని పెద్దలు చెప్పుకొచ్చారు. ఎవరికి చులకభావం ఉందో ఒంగోలు సభ సాక్షిగా గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తులేవా? రాష్ట్రంలో ఉన్న కొన్ని పత్రికలు, చానళ్లకు చీమ కుట్టినా గగ్గోలు పెట్టే మీరు ఇప్పటి వరకూ రాష్ట్రంలో జర్నలిస్టులపై జరిగిన దాడులు కనిపించడం లేదా? వాటి గురించి ఎందుకు మీరు నామ మాత్రపు స్పందన చూపుతున్నారు.
జగన్ కొన్ని మీడియా టార్గెట్ చేస్తున్నారంటూ మీరు మాట్లాడేటప్పుడు ఇదే మాట చంద్రబాబును కూడా అనాల్సింది. నాలుగైదు చానళ్లను, కొన్ని పత్రికలను 2014 నుంచి 2019 వరకూ నిషేదించిన చంద్రబాబు టార్గెట్ చేయలేదా? ఇప్పుడు కూడా ఆ మీడియాపై ఆయన, ఆయన తనయుడు కక్ష్య సాధించడం లేదా..? ఆ జర్నలిస్టులను నిత్యం వ్యక్తిత్వ హననం చేయలేదా.? అప్పుడు, ఇప్పుడూ ఆ జర్నలిస్టులను చంద్రబాబు నోటికొచ్చినట్లు విమర్శిస్తుంటే మీరు ఎందుకు నోరు మెదపడం లేదు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ ఉంది కానీ రాజకీయ ఎజెండాతో పార్టీ అధినేతలను విమర్శించడానికి యూనియన్ లేదని మాత్రం గుర్తుంచుకోవాలి. కొంత మంది చంద్రబాబుకు భజన చేసే వారు యూనియన్ ను ఓ పార్టీకి తాకట్టు పెడుతున్నారనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ముందు జర్నలిస్టులకు నిన్న జరిగిన ఐజేయూ సమావేశంలో కనీసం ఒక్క హామీ కూడా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.
అదే సభలో ప్రభుత్వ విధానాలపై డప్పులు కొడుతూ మాట్లాడటం జర్నలిస్టు నాయకులకు సబబేనా? అదే సమావేశానికి వచ్చిన చంద్రబాబు ఒక్కటంటే ఒక్కటైనా జర్నలిస్టులకు హామీ ఇచ్చారా? ఎంతో కాలంగా జర్నలిస్టులకు ఇంటి స్థలాల కోసం అడుగుతుంటే చంద్రబాబు ఏమి చేశారని ప్రశ్నించారా? కమిటీలతో కాలయాపన చేస్తుంటే మీరు గత ప్రభుత్వంలో స్పందించినట్లు ఇప్పుడెందుకు స్పందించడం లేదు..?
ఇప్పటికైనా యూనియన్ నేతలు రాజకీయ ఎజెండాను వీడి…యాజమాన్యాల తొత్తులుగా కాకుండా..జర్నలిస్టుల సారధులుగా ఉండాలని యూనియనిస్టుగా నేను కోరుకుంటున్నాను.
– శ్రీనివాస్ వెన్ను
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు