– వైసీపీ ఎంపీలు ఆవలింతలు వచ్చినపుడు తప్ప ఆంధ్రప్రదేశ్ సమస్యలపై ఏనాడైనా పార్లమెంట్ లో నోరు తెరిచారా ?
– జగన్ రెడ్డికి అప్పులు తేవటం మీద ఉన్న శ్రద్ద పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావటంపై లేదు
– టీడీపీ శాసనసభ్యులు బెందాళం అశోక్
వైసీపీ ప్రభుత్వ అసమర్ధ, చేతకాని పాలనలో యువత భవిత ప్రశ్నార్ధకంగా మారింది, ఉద్యోగాలు,ఉఫాధిలేక కన్నవారికి భారం కాలేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక్క ఏడాదిలోనే 258 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే..జగన్ రెడ్డి పాలనలో నిరుద్యోగుల పరిస్థితి ఎంత అగమ్యఘోచరంగా ఉందో స్పష్టమౌతోంది.
ఎన్నికలకు ముందు 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఊరూరు తిరిగి ఊదరగొట్టిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల్ని నిలువునా మోసగించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్న జగన్ రెడ్డి రెండున్నరేళ్ల తర్వాత నిద్రలేచి కేవలం 10,143 పోస్టులతో ఫేక్ క్యాలండర్ విడుదల చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. 10,143 పోస్టులు కూడా ఇప్పటి వరకు నిర్ణీత సమయాల్లో నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు.
ప్రతి ఏటా డీఎస్సీ జరుపుతామని చెప్పారు, కానీ 3 ఏళ్లు కావొస్తున్నా…ఇంతవరకు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. రెండున్నరేళ్ల నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవటంతో నిరుద్యోగులు వయోపరిమితి పెరిగిపోయి ఆందోళన చెందుతున్నారు. బ్యూరో ఆఫ్ పోలీసు రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (బిపిఆర్ డి) గణాంకాల ప్రకారం 2020 జనవరి 1నాటికి రాష్ట్రంలో 14,341 పోలీసు ఉద్యోగాలు ఖాళీలుంటే ఇంతవరకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు.
టీడీపీ పాలనలో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే కాక, 13.5 లక్షల కోట్ల పెట్టుబడులతో 34 లక్షల మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురాగపోగా కమీషన్ల కోసం ఉన్న కంపెనీలను తరిమేసి 34 లక్షల మంది యువత భవిష్యత్ ను నాశనం చేసింది. వేలాది మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తొలగించి వాళ్ల కుటుంబాలను రోడ్డున పడేశారు.
చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్లు, సబ్సిడితో బ్యాంకు రుణాల ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తే జగన్ రెడ్డి వాటిని రద్దు చేసి నిరుద్యోగుల పొట్టకొట్టారు. నిరుద్యోగ భృతి రద్దు చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 కి పెంచి లక్షలాదిమంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు.నాడు హోదాతోనే ఉద్యోగాల విప్లవం అన్న జగన్ నేడు ముఖ్యమంత్రి హోదా వచ్చాక ప్రత్యేక హోదా మరిచిపోయారా?
25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచుతామన్నారు, కానీ ఏనాడైనా వైసీపీ ఎంపీలు ఆవలింతలు వచ్చినపుడు తప్ప ఆంధ్రప్రదేశ్ లో సమస్యలపై పార్లమెంట్ లో నోరు తెరిచి మాట్లాడారా? ముఖ్యమంత్రికి అప్పులు తేవటం పై ఉన్న శ్రద్ద రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించటంపై లేకపోవటం సిగ్గుచేటు. జగన్ నిరుద్యోగుల్ని మోసం చేయటం మాని ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి.