Suryaa.co.in

Andhra Pradesh

నేను సామాజిక సమతుల్యత గురించి ఆలోచించే సమయంలో… జగన్ బెంగళూరులో అవినీతి లెక్కల్లో ఉన్నాడు

  • జగన్ అవినీతి గురించి ప్రజలు ఆలోచించి ఉంటే అధికారంలోకి వచ్చేవాడే కాదు
  • అవినీతి డబ్బు సరిపోక ప్రజల నుంచి దౌర్జన్యం చేసి లాక్కోవడం జగన్ పాలన
  • 80 శాతం పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారు
  • కులాల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు
  • నేను కులాల వెనకబాటు గురించి మాట్లాడతాను
  • అధికారం అందని కులాలకు సంపూర్ణ అధికారం అందేలా చేస్తాం
  • నిర్ణయాత్మక శక్తి ఉన్న పదవులను అందజేస్తాం
  • వామ పక్షం, సనాతన ధర్మం కలగలిపే భావజాలం నాది
  • వైసీపీకి మరో ఛాన్స్ ఇవ్వకూడదనే బలమైన సంకల్పంతోనే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం
  • 2009 రాజకీయ ప్రస్థానం తప్పు మళ్లీ జరగకూడదు
  • మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురిని పార్టీలోకి ఆహ్వానించి ప్రసంగించిన పార్టీఅధ్యక్షులు  పవన్ కళ్యాణ్  

‘సమాజంలో అణన, వెనకబడిన వర్గాలకు నిర్ణయాత్మక అధికారం కావాలి. వారి వారి కులాలకు సంబంధించి అభివృద్ధి వైపు నడిపించే నిజమైన అధికారం వారికి చెందాలన్నదే జనసేన పార్టీ ఆకాంక్ష. ఇప్పటి వరకు అధికారం చూడని కులాలకు నిజమైన అధికారం దక్కాలి. ఆయా వర్గాలు వారిని వారు అభివృద్ధి చేసుకునేందుకు దారి చూపాలన్నదే జనసేన అసలు సిద్ధాంతమ’ని పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  అన్నారు. నేను ప్రతి సభలోనూ కులాల గురించి మాట్లాడతానని వైసీపీ నాయకులు అంటారు… 80 శాతం నామినేటెడ్ పోస్టులను, ఇతర పదవులను ఒకే కులానికి కట్టబెట్టిన వైసీపీకి అసలు కులాల గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు అని గుర్తించుకోవాలని స్పష్టం చేశారు.

శనివారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  సమక్షంలో పలువురు కీలక నేతలు పార్టీలో చేరారు. వారికి  పవన్ కళ్యాణ్  పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “నేను కులాల గురించి ఎప్పుడు మాట్లాడినా విద్వేషాలు నింపేలా మాట్లాడను. ఆయా కులాల సాధికారత, అభివృద్ధి ఎలా జరగాలి అన్నదానిపైనే నిజాలు మాట్లాడతాను. భారతదేశం కులాల సమూహం. కులాల గురించి, ఆయా సామాజిక వర్గాల అసలు స్థితిని చెప్పకపోతే ఎలా? 2008లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించక ముందే 2004 నుంచి కూడా నేను దళిత, బీసీ సంఘాల నాయకులతో ఎన్నో విషయాలపై సుదీర్ఘంగా చర్చించాను. అధికారం లేని వారికి ఎలాంటి సాధికారత కావాలి… నిర్ణయాత్మక శక్తి ఎలా ఇవ్వాలి అన్న దానిపై చర్చించాను. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లలో నిధులు, అధికారం లేకపోతే ఆయా వర్గాలకు నిజమైన అభివృద్ధి ఎలా దక్కుతుంది? అది నిజమైన సాధికారత ఎలా అవుతుంది? కేవలం లెక్కలు, ప్రజలను మభ్యపెట్టడానికి పదవులు ఇవ్వడం సరికాదు. ఒక కులం, మతం, ప్రాంతం కోసం ఆడే రాజకీయ ఆట చాలా చిన్నది. ఏ కులానికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇస్తూ, సంపూర్ణ సాధికారత వారికి అందజేసేందుకు జనసేన ఉంది.

2004లో వై.ఎస్.ది ఎన్నికల్లో నిలబడటానికి డబ్బు లేని పరిస్థితి
జనాభాపరంగా సమాజంలో అధిక సంఖ్య ఉన్నప్పటికీ ఎలాంటి అధికారం, పదవులు, అభివృద్ధి చాలా కులాలకు అందడం లేదు. నేను అన్నగా భావించే ప్రజా యుద్ధ నౌక  గద్దర్  చనిపోయే ముందు నాకు చెప్పిన మాట ఏమిటంటే…  సమాజంలో అభివృద్ధి చెందిన కులాలను ద్వేషించడం అంటే మనం ఎదుగుతున్నట్లు కాదు. వారి సహాయంలో మనం ఎలా ఎదగాలి అనే ఆలోచన చేసినప్పుడే ఎదుగుదల మొదలవుతుంది. ఒక చేయితో అభివృద్ధి చెందిన కులాల వారి సహాయాన్ని పట్టుకొని, మరో చేత్తో అణన కులాలకు చేయి అందించాలి. అప్పుడే నిజమైన సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుంది. నేను దానిని కచ్చితంగా పాటిస్తాను.  సమాజంలో ఉన్న రెల్లి, మాదిగ ఉప కులాలు, అరుంధతీయులకు, బీసీలకు, ఇతర సామాజిక వర్గాలకు ఇప్పటి వరకు అందని నిజమైన అధికార సాధికారితను అందిద్దాం. జనాభాలో ఆయా వర్గాలకు చెందిన జనాభా ఎంత ఉంటే అంతే దమాషా పద్ధతిలో వారికి అధికారం అందాలి. దీనికోసం రాజకీయ మార్గంలో ఓ ప్రణాళిక ప్రకారం ప్రయాణం చేద్దాం.

ప్రతిసారి జగన్ అవినీతి గురించి ఎంత మాట్లాడినా ప్రజలు దాన్ని పెద్ద సీరియస్ విషయంగా తీసుకోవడం లేదు. ఈ రోజుల్లో ఎవరు తినడం లేదు అంటూ  ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. నేను ఇవన్నీ క్షుణ్ణంగా గమనించే జగన్ అవినీతి మీద మాట్లాడటం మానేశాను. ప్రజలకు నష్టం చేకూరుస్తున్న అంశాలు, ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడాల్సిన అవసరం ఉంది. సమాజంలో జరుగుతున్న కోట్ల రూపాయల అవినీతి తతంగం ఎవరికీ పట్టడం లేదు. అవినీతి విషయంలో సగటు మనిషి ఆలోచన తీరు మారిపోయింది. దీనిపై వారిలోనే మార్పు రావాలి. అవినీతి గురించి సీరియస్ గా ప్రజలు ఆలోచించి ఉంటే జగన్ అసలు అధికారంలోకి వచ్చే వాడే కాదు. జగన్ దోపిడీ మీద కూడా కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేద్దామని ఆలోచిస్తే వారికి ఈ విషయం తెలీదా..? అనే సందేహం నాకు కలుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ఎన్నికల్లో నిలబడటానికి డబ్బు లేని పరిస్థితి నుంచి అధికారం వచ్చిన తరువాత సాక్షి లాంటి పత్రికలు నడిపే స్థాయికి వచ్చారంటే ఏం జరిగిందో ఈజీగా అర్ధమవుతుంది. నేను బీసీలు, ఎస్సీల గురించి ఆలోచించే సమయంలో జగన్ బెంగళూరు అవినీతి లెక్కల్లో ఉండేవాడు. రూ. 30 రూ. 40 వేల కోట్లు వీరికి చాలా చిన్న విషయం.

దోచుకున్నది సరిపోకే కల్తీ మద్యం
దోచుకున్న ఇన్ని వేల కోట్లు సరిపోక మరింత కూడబెట్టడానికి కల్తీ మద్యం రూపంలో ప్రజల ప్రాణాలు తీసి సంపాదిస్తున్నారు. ఇసుకను దోచేస్తూ ఆర్జిస్తున్నారు. వైసీపీ చేస్తున్న అన్యాయాలను ఎవరైనా అడిగితే, ప్రశ్నిస్తే బెదిరించడం ప్రాణాలు తీయడం చాలా సులభం అయిపోయింది. ఇంత డబ్బు సరిపోక ప్రజల నుంచి దౌర్జన్యంగా లాక్కోవడం జగన్ చేస్తున్న పాలన. జగన్ అవినీతి గురించి ప్రజలు ఆలోచించడం మానేసి చాలా రోజులైంది. వారికి కావాల్సిన రోడ్లు, పన్నులు, మైనింగ్ దోపిడీ, దౌర్జన్యాలు, బెదిరింపులు మీద చైతన్యవంతం చేస్తూ పోరాడాల్సిన అవసరం ఉంది.

వామపక్ష భావజాలం, సనాతన ధర్మానికి దగ్గరగా ఉన్న వారు నన్ను అమితంగా ఇష్టపడతారు. ఈ రెండు భావజాలాలను ఏకతాటిపైకి తేవడం అనేది నా ఆలోచన. సుప్రసిద్ధ కవులు, పోరాట నాయకులు    దాశరథి కృష్ణమాచార్య,  దాశరథి రంగాచార్య గార్లు గొప్ప భావాలు కలిగిన కవులు. వామపక్ష పోరాటలు చేసిన గొప్ప పోరాట యోధులు.  రంగాచార్య  వేదాలను తెలుగులోకి తర్జుమా చేసిన గొప్ప కవి. అలాగే నేను ఎంతో ఇష్టపడే  గుంటూరు శేషేంద్ర శర్మ  సైతం వామపక్ష భావజాలంతో తన కలానికి పదునుపెడితే, రామాయణంలో షోడశి రహస్యాలు రాసిన వ్యక్తి. ఇలాంటి ఎందరో గొప్ప మహోన్నత వ్యక్తులు వామపక్ష భావజాలంతో ప్రజల గురించి ఆలోచిస్తూనే సనాతన ధర్మానికి తగిన గౌరవం ఇచ్చి కాపాడిన వ్యక్తులు. ఇలాంటి రెండు భావాలను కలగలిపి ముందుకు వెళ్లాలి… భావి తరాలకు అందించాలి అన్నది నా తాపత్రయం.

ప్రతికూల పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చాం
2009 తరవాత కొంత కాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ 2014లో ప్రతికూల పరిస్థితుల్లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాం. రాష్ట్ర విభజన జరిగిన సమయంతో పాటు ఎలాంటి పొలిటికల్ స్పేస్ లేని సమయంలో రాజకీయాల్లోకి వచ్చాం. రాష్ట్రంలో చాలా మంది సీనియర్ పార్లమెంటేరీయన్లకు నా ఆంధ్ర, తెలుగు అనే భావన లేదు. జనసేన ఏడు సిద్ధాంతాలు చాలా బలమైనవి. రాజకీయాల్లో ఒక కులాన్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్లలేం. అది తెలుసుకోలేకపోతే రాజకీయాలు నడపలేం. బలమైన సైద్ధాంతిక బలంతో నిలబడటానికే వచ్చాను. ఎంతో అభిమాన బలం ఉన్న, ప్రాణాలకు తెగించి నాతో నిలబడే అభిమానులు ఉన్నా అక్కడే ఆగిపోలేదు. వారికి చూసుకొని నాలో ఏదో శక్తి ఉందని అనుకోలేదు. దశాబ్దంపాటు ప్రజల్లో నలిగాను. వారి కష్ట సుఖాలు తెలుసుకున్నాను. అడుగడుగునా అవమానాలు, అనుమానాలు ఎదుర్కొన్నాను. నేను ప్రజలకు ఇచ్చే మాట మీద నాకు ఎంతో గౌరవం ఉంటుంది. 2009లో ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడతాం అని మాట ఇచ్చాం. దానిని నిలబెట్టుకోలేకపోయాం అనే బాధ నన్ను ఎంతో కాలం వెంటాడింది. నాతో పాటు ఎందరో నాయకులు కూడా ఇలాంటి అవమానాలకు ఎదుర్కొన్నారు. అలాంటి అవమానాలకు, వేధింపులకు తగిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

నన్ను అర్థం చేసుకుంటే నా అంత తేలికైన వ్యక్తి ఎవరూ ఉండరు
2009 రాజకీయ ప్రస్థానం లేకుంటే ఈ రోజు స్వతంత్రంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి స్పష్టంగా ఉండేది. 2018లో రాజమండ్రి కవాతులో లక్షల మంది వచ్చినా జాతీయ స్థాయిలో అది పెద్ద సంచలనం అయినా క్షేత్ర స్థాయిలో మనకి బలం లేకపోవడానికి అప్పటి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. తిత్లీ తుపాన్ సమయంలో బాధితులకు బాసటగా నిలవడానికి శ్రీకాకుళం వెళ్లినప్పుడు ఓ ఆడపడుచు అడిగిన మాట ఇప్పటికి నాకు గుర్తు. నువ్వు అయినా నిలబడతావా అని ఆమె అడగడమే కాకుండా … మీ కోసం అప్పట్లో నిలబడితే మమ్మల్ని ఊరు నుంచి వెలేసారని చెబుతూ ఆమె మాట్లాడిన తీరు నాకు ఇప్పటికీ గుర్తే. ఓ బలమైన నిర్ణయంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించాం. అప్పుడు జరిగిన తప్పు మళ్లీ జరగకూడదు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా బలంగా మన గొంతు వినిపించలేకపోవడానికి అప్పటి పరిస్థితులే కారణం. ఓ బలమైన లక్ష్యం సిద్ధాంతాలతో రాజకీయాల్లోకి వచ్చాం. నన్ను అర్ధం చేసుకుంటే నా అంత తేలికైన వ్యక్తి ఉండడు. అర్ధం చేసుకోకపోతే నా అంత క్షిష్టమైన వ్యక్తి ఉండడు. అన్ని అవరోధాలను దాటుకొని వచ్చిన వ్యక్తిగా చెబుతున్నాను. 2024లో జనసేన- తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించడం ఖాయం.

నేను ఎవరికీ కొమ్ము కాయను
తల్లిదండ్రులు తిట్టుకుంటూ నిద్ర లేస్తే… పిల్లలు కొట్టుకుంటూ నిద్ర లేస్తారు అనేది సామెత. మన పార్టీలో కొందరు నాయకులు తీరు ఇలానే ఉంది. నాయకత్వం ఇలా చేస్తే కార్యకర్తలు ఇంకా ఎలా చేస్తారో అర్ధం చేసుకోవచ్చు. నాయకత్వం అంటే పరిపూర్ణ వ్యక్తిత్వం. మనం మాట్లాడే మాట, నడవడిక అన్ని ఇతరులకు స్ఫూర్తివంతంగా ఉండాలి. నేను మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. అకారణంగా మాట విసిరితే ఏమవుతుందో నాకు తెలుసు. నా లక్ష్యం గెలవడం కాదు… మొదట నా కుటుంబం లాంటి మిమ్మల్ని రక్షించుకోవడం అని తెలుసుకోవాలి. దానికోసమే చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. నేను ఎవరికీ కొమ్ము కాసి రాజకీయాలు చేయడానికి రాలేదు. కష్టాల్లో ఉన్న వారికి, కడగండ్లు పాలైన వారికి మాత్రమే కొమ్ముకాయడానికి రాజకీయ ప్రస్థానం ప్రారంభించాను.

ఎవరి వద్దా చేయి చాపకుండా పార్టీ నడుపుతున్నాం
నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. పార్టీ కోసం సినిమాలు చేస్తున్నాను. నా కుటుంబ పోషణ కూడా సినిమాలే. రాజకీయాలు అనేవి బాధ్యతతో కూడిన ప్రజా ప్రస్థానం. దశాబ్ద కాలంపాటు ఎవరి వద్ద చేయి చాపకుండా పార్టీ నడుపుతున్నాం. తెలంగాణలో నేను ఇటీవల పర్యటించినప్పుడు అక్కడ పార్టీ సానుభూతిపరులు మత్స్యకారులకు సహాయం చేయమని చెక్ ఇచ్చారు. రూ.200 మనీ ఆర్డర్ నుంచి పార్టీకి విరాళాలు వస్తుంటాయి. అలాంటి వారితో కృతజ్ఞతతో మాట్లాడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఆలయాలకు విరాళాలు ఇస్తూ మంచి పనులు చేసే వారు కూడా ఆ డబ్బును పార్టీకి విరాళం ఇవ్వడం అంటే అది మనం ప్రజల్లో సంపాదించుకున్న గౌరవం, నమ్మకం.

మరో ఛాన్సు తీసుకోకూడదు… వైసీపీని ఇంటికి పంపాలన్నదే వ్యూహం
దశాబ్ధాల చరిత్ర ఉన్న అమరరాజా లాంటి పరిశ్రమను రాష్ట్రం నుంచి కక్షగట్టి బయటకు పంపేశారు.  గల్లా జయదేవ్ విపక్ష పార్టీ నుంచి పోటీ చేయడమే ఈ కక్షకు కారణం. అమరరాజా పరిశ్రమ తెలంగాణ వెళ్లిపోయింది. ఒక పరిశ్రమ మీద కక్ష తీర్చుకోవడం అంటే ఒక వ్యక్తి మీద కక్ష తీర్చుకోవడం కాదు. దాని మీద ఆదారపడిన కొన్ని వేల కుటుంబాలను రోడ్డున పడేలా చేయడం. ఇలాంటి పనే వైసీపీ చేస్తోంది. రాష్ట్రంలో ప్రజలను నిలువునా వేధించడం వీరు చేస్తున్న పాలన. మరోసారి వైసీపీ అధికారంలోకి రాకుండా ఉండాలి అనే క్లియర్ కట్ ఆలోచనతోనే మరో ఛాన్స్ తీసుకోకూడదనే ఉద్దేశంతోనే జనసేన – టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్లబోతున్నాయి. ఈ ప్రయాణంలో ఎలాంటి ఈగో, మనస్పర్ధలకు వెళ్లకుండా కచ్చితంగా గెలవాలి అన్నదే లక్ష్యం.

త్రిముఖ పోటీ జరిగితే రెండు మూడు శాతంతో జగన్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడితే వనరులు, వ్యవస్థలు అనేవి రాష్ట్రంలో ఏమీ ఉండవు.  2009లో మనం రాజకీయ ప్రస్థానం నిలబెట్టుకోకపోవడం వల్లే.. అథమస్థాయి ఆలోచన ఉన్న వ్యక్తులు మంత్రులు, ఎమ్మెల్యేలు అయిపోయారు. వ్యక్తులకు నిబద్ధత, నిలబడే తత్వం లేకపోతే ఫలితాలు నిష్పయోజనంగా ఉంటాయి. బీజేపీ లాంటి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న  జేపీ నడ్డా  లాంటి వ్యక్తే అడిగి మరి జనసేన పార్టీ కండువాను మెడలో వేసుకోవడం అంటే మన పార్టీకి ఇచ్చిన అత్యున్నత గౌరవంగా భావించాలి. ప్రజల కోసం నిలబడడం నా పంథా మార్చుకోను. నేను మారను. ఇలానే ముందుకు వెళ్తాను. నా కోసం నిలబడే వారికి వెన్నుదన్నుగా ఉంటాను. నేను మిమ్మల్ని రక్షించుకుంటాను. సమర్ధత, అంకిత భావం ఉన్న వారిని గుండెల్లో పెట్టుకుంటాను’’ అన్నారు.

LEAVE A RESPONSE