రాష్ట్రమంతా చీకట్లో మగ్గుతుంటే.. తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ దేదీప్యమానంగా వెలుగుతోంది
– ప్రభుత్వ అసమర్థత, అవగాహన లేమి, చేతకాని తనంవల్లే కరెంటు కోతలు విపరీతంగా పెరిగాయి
• ప్రజలను విసనకర్రలతో విసురుకునే పరిస్థితి నుండి కాపాడాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, అవగాహన లేమి, చేతకాని తనంవల్లే కరెంటు కోతలు విపరీతంగా పెరిగాయని, రాష్ట్రమంతా చీకట్లో మగ్గుతుంటే.. తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ దేదీప్యమానంగా వెలుగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడిన మాటలు …
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, అవగాహన లేమి, చేతకాని తనంవల్ల కరెంటు కోతలు విపరీతంగా పెరిగాయి. ఎన్నికలకు ముందు రైతులకు 9 గంటలు నిరాటంకంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి నేడు రాష్ట్రంలో మూడు నాలుగు గంటలు కూడా కరెంటు ఇవ్వడంలేదు. రాష్ట్ర ప్రజలు కరెంటు కోతలతో కొట్టు మిట్టాడుతున్నారు. ప్రజలను విసన కర్రలతో విసురుకునే పరిస్థితి నుండి కాపాడాలి.
రైతులు తమ నారు మడులు ఎండిపోయి అయ్యో రామా! అంటున్నారు. విద్యుత్ కోతలతో ఇంతటి దుర్భర పరిస్థితులుంటే ఎందుకు ఈ పరిస్థితులు దాపరించాయని సీఎం విద్యుత్ శాఖతో ఏనాడైనా సమీక్షించారా? పీపీఎల్ రద్దు చేయొద్దు, ఆ అగ్రిమెంట్ కొనసాగించండని చంద్రబాబు ఎంత కోరినా కమీషన్లకు కక్కుర్తి పడి సీపీఎస్ ని రద్దు చేశారు. తక్కువ రేటుకు కరెంటు దొరుకుతుంటే ఎక్కువ రేటుకు ఎందుకు కొంటున్నారని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశ్నించడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని సార్లు చీవాట్లు పెట్టినా, ఎన్ని నోటీసులు జారీ చేసినా బుద్ధి రావడంలేదు. ఎన్నికలకు ముందు కరెంటు చార్చీలు పెంచనని నంగనాచి కబుర్లు చెప్పి 8 సార్లు కరెంటు చార్జీలు పెంచారు. చంద్రబాబునాయుడు హయాంలో ఒక్కసారి కూడా కరెంటు చార్జీలు పెంచలేదు. ఆయన పూర్తి అవగాహనతో కరెంటు కోతలు లేకుండా చూశారు. కరెంటు కోతలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాల్లో ఏపీని మొదటిస్థానంలో పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది.
మిగులు కరెంటు రాష్ట్రంగా చేసి రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన ఘనత చంద్రబాబుది.
ఎండాకాలంలో కాస్తో కూస్తో కరెంటు కోతలుంటాయేమోగానీ, వర్షాకాలంలో కరెంటు కోతలు వైసీపీ అసమర్థ పాలనకు నిదర్శనం. పులివెందుల సబ్ స్టేషన్ ముందు రైతులు బైఠాయించి కరెంటు సరిగా ఇవ్వమని అడిగినందుకు వారిపై కేసులు పెట్టారు. అలా అయితే.. కరెంటు సరిగా ఇవ్వని ప్రభుత్వంపై ఎన్ని కేసులు పెట్టొచ్చు?. పవర్ లేక ప్రజలు అల్లాడుతున్నారు.
పవర్ మినిష్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కి మైన్స్ తవ్వుకుకోవడం, ఇసుక దోచుకోవడం తప్ప కరెంటు కోతలు నివారించాలనే ఆలోచన, ధ్యాస లేవు. ప్రజల కష్టాల గురించి ఏనాడైనా ఆలోచించారా? పవర్ హాలిడే ప్రకటించే స్థాయికి రాష్ట్రం వెళ్లడం దౌర్భాగ్యం. విద్యుత్ లేక ఆక్సిజన్ యంత్రాలు పనిచేయక ఆక్వా రంగం కుదేలైంది. రాష్ట్రమంతా చీకట్లో మగ్గుతుంటే.. తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ దేదీప్యమానంగా వెలిగితే సరిపోతుందా? తన ముఠాకు జగన్ క్విడ్ ప్రోకో ద్వారా లబ్ది చేకూర్చే పనులు చేయడం తప్పితే ప్రజలకు లబ్ది చేకూరే పనులెప్పుడైనా చేశారా?
దళితుడికిచ్చే 200 యూనిట్ల ఉచిత కరెంటు దళితవాడలో ఉంటేనే అని మెలికపెట్టి దళితులను అన్యాయం చేయడం తగదు. దళిత బిడ్డల మేనమామ అని చెప్పి ఓట్లు దండుకొని దళితులకు తీరని అన్యాయం చేయడం సబబుకాదు. క్విడ్ ప్రోకో కింగ్ అయిన ముఖ్యమంత్రి ఏ కంపెనీ, ఏ కార్పొరేట్ సంస్థ నుంచి ఎంత విద్యుత్ కొనుగోలు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి. హిందూజా కంపెనీ వారు ఆశించినంత ఇస్తారని క్విడ్ ప్రోకోకు పాల్పడుతున్నారనే ఊహాగానాలున్నాయి.
హిందూజా కంపెనీకి 11 ఎకరాల భూమి క్విడ్ ప్రోకో కింద ధారాదత్తం చేసింది నిజంకాదా? కరెంటు కోతలు ఇలాగే ఉంటే చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితేంటి? ప్రజలు తాము చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి సమయం కోసం వేచి ఉన్నారని సీఎం గ్రహించాలి. బాధలు తీర్చే, కరెంటు కోతలు లేకుండా చేసే ముఖ్యమంత్రి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని సీఎం తెలుసుకోవాలి.
ఎందుకన్నా జగన్ మాటలు నమ్మాం, ఆనాడు జగన్ కు ఓటేసి మన నెత్తిని మనమే గొరుక్కున్నామని ప్రజలు అనుకుంటున్నారు. జగన్ వచ్చినప్పటినుంచి విద్యుత్ రంగానికి గ్రహణం పట్టింది. ప్రతి వీధి, వాడ వెలుగులు జిమ్మాల్సిన పరిస్థితుల్లో జగన్ అధికారంలోకి వచ్చాక గ్రహణం పట్టి చీకటి రోజులొచ్చేలా చేశారు. రాత్రయితే చాలు ప్రజలు గాలి, వెలుతురు కోసం రోడ్లపైకి వస్తున్నారు. పవర్ సరిగా లేకపోవడంవల్ల చేనేత కార్మికులకు పనిలేకుండా పోయింది.
చేనేత కార్మికులు మాకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. రాయితీకి పవర్ కొనే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. 3,669కోట్ల భారాన్ని ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై వేశారు. అదనపు లోడ్ చార్జీల పేరుతో మరింత భారం మోపారు. ప్రజల్ని కరెంటు చార్జీల పేరుతో బందిపోటుల్లా దోచుకుంటుంటున్నారు. విద్యుత్ వినియోగదారులను ఈ రీతిన మోసం చేయడం బాధాకరం. ఈ ప్రభుత్వం మనకు సాయపడదని అందరికీ అర్థమైపోయింది. కన్జ్యుమర్ ని రక్షించాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ కోశాన లేదు.
ఎంతసేపు వినియోగదారులను దోచుకోవాలనే చూస్తుంటారు. విద్యుత్ చార్జీల పెంపు పేరిట వినియోగదారులను ఈ ప్రభుత్వం దోచుకుంటోంది. ఇది ప్రభుత్వం కాదు ఒక దోపిడీదారు వ్యవస్థ. దీనికి ముఖ్యమంత్రి జగన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ కరెంటు కోతల నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రభుత్వాన్ని కోరారు.