Suryaa.co.in

Andhra Pradesh

శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం

– దుష్ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు
– టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయం
– ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి

శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ అంశంపై రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి మీడియా ప్రతినిధులకు వివరించారు.

సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించడం కోసం 2019లో టీటీడీ శ్రీవాణి ట్రస్టును ఏర్పాటుచేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతోపాటు తెలంగాణ, పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని గిరిజన, ఎస్పీ, మత్స్యకార గ్రామాల్లో మొత్తం 2,445 ఆలయాల నిర్మాణం జరుగుతోంది. ఈ ట్రస్టు నిధులతో పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం అందిస్తున్నాం.

టీటీడీలో పూర్తి పారదర్శక పాలన జరుగుతోంది. ఇందుకు సంబంధించి మా పాలకమండలి టీటీడీ ఆస్తులపై 2021 జూన్‌ 21వ తేదీన, బంగారు, నగదు డిపాజిట్లపై 2022 నవంబరు 5వ తేదీన శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 300 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ప్రతినెలా ఆలయ కమిటీ బ్యాంకు అకౌంట్‌లో రూ.5 వేలు జమ చేయాలని మా పాలకమండలి నిర్ణయించింది.

శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేకంగా బ్యాంకు అకౌంటు ఉంది. అందులోనే విరాళాలు జమ అవుతాయి. టీటీడీ నుండి ఒక రూపాయి కూడా పక్కదారి పట్టే ప్రసక్తే లేదు.శ్రీవాణితోపాటు ఇతర ఏ ట్రస్టుల్లో అయినా అవినీతి జరుగుతోందనే అనుమానం ఉంటే ఎవరైనా వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ విషయం పై 2023 జనవరి 23వ తేదీ ఈవో ఎవి ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి శ్రీవాణి ట్రస్ట్ నిధులు, ఈ నిధులతో నిర్మిస్తున్న, నిర్మించిన, నిర్మించబోయే ఆలయాల వివరాలు పూర్తిగా వివరించారు. అయినా కొందరు పదే పదే ఆరోపణలు చేయడం శోచనీయం.

శ్రీవాణి టికెట్‌ తీసుకునే భక్తులకు ట్రస్టుకు విరాళం కింద రూ.10 వేలకు, దర్శనం టికెట్‌ కోసం రూ.500కు రెండు రసీదులు ఇస్తున్నాం. ఆన్‌లైన్‌లో ఈ టికెట్‌ బుక్‌ చేసుకున్నా రెండు రసీదులు వస్తాయి.

రూ.500/-కు మాత్రమే రసీదు ఇచ్చి మిగిలిన రూ.10 వేలు దోచుకుంటున్నారని కొందరు వ్యక్తులు రాజకీయ, వ్యక్తిగత లబ్ధి కోసం ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం.

LEAVE A RESPONSE