Suryaa.co.in

Andhra Pradesh

నాడు పోలవరం కాంట్రాక్టర్లు ఎవరు..?

– రామోజీ బంధువులు, బాబు ఆత్మబంధువులు కాదా..?
– పొంగులేటికి, మాకు ఏం సంబంధం?
– మాకు సంబంధం ఉంటే.. జగన్ గారిపై కత్తి కట్టిన కాంగ్రెస్ లో పొంగులేటి ఎందుకు చేరతాడు?
– రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ రివ్యూలో గెలిచినవారికే కాంట్రాక్టు దక్కుతుంది
– టీడీపీ హయాంలో అంచనాలు పెంచి, తమ వారికి కాంట్రాక్టులు ఇచ్చి దోచుకున్నారు.
– ఇంతకీ నవయుగ, ఆర్ వీఆర్, ట్రాన్స్ ట్రాయ్, రిత్విక్.. వీరంతా ఎవరి బంధువులు బాబూ..?
– నవయుగను తప్పించారనే రామోజీ విషం కక్కుతున్నాడు
– వైఎస్ఆర్ మరణించినా పోలవరాన్ని బతికించారు
– మీ దోపిడి ఆగిపోయిందనే కదా? మీ అక్కసు, కక్ష?
– మీ రాతలన్నీ బాబుకే వర్తిస్తాయి తప్ప, జగన్‌గారికి కాదు
– సెల్ ఫోన్ కనిపెట్టిన బాబు సెల్ఫీ తీసుకోలేకపోయాడు!
– చంద్రబాబుపై కేసు పెట్టకపోతే రాజ్యాంగం, చట్టం లేనట్టే..
– బాబుకు అధికారంలో ఉంటే శాంతి.. లేకపోతే హింస కావాలి
– సినీ పరిశ్రమ పిచ్చుక అయితే, నాపై బ్రహ్మాస్త్రమా?
– నా క్యారెక్టర్‌ను సినిమాలో పెట్టడం తప్పు కాదా?
– అది నాపై కక్షతో చేసింది కాదా? అవమానించడం కాదా?
– సినీ పరిశ్రమపై యుద్ధం కానేకాదు.. “బ్రో” పైనే..
– రెమ్యునరేషన్ ఎంతో చెప్పనప్పుడు ఆ ఉపన్యాసాలెందుకు..?
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

సెల్ ఫోన్ కనిపెట్టిన బాబు సెల్ఫీ తీసుకోలేకపోయాడు!:
ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో చంద్రబాబు పర్యటిస్తున్నారు. యువగళం పేరుతో ఆయన సొంత పుత్రుడు, దత్తపుత్రుడు వారాహి యాత్ర మరోవిడత చేపడుతున్నాడు. ఆ విధంగా ప్రభుత్వం మీద ముగ్గురూ కలిసి పిచ్చిపిచ్చిగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు సందర్శించిన చంద్రబాబు స్పిల్‌వే మీద సెల్ఫీ తీసుకున్నారు.
కానీ అది కూడా సరిగ్గా తీయలేకపోయారు. సెల్‌ఫోన్‌ను కనిపెట్టిన చంద్రబాబు, సెల్ఫీ తీసుకోలేకపోయారు.
కారణం ఏమిటంటే.. పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేసి, అక్కడికి వచ్చి అన్నీ అబద్ధాలు చెబుతున్నందుకు, అది ఆయన ఆత్మకు కూడా తెలుసు కాబట్టి, సెల్ఫీ సరిగ్గా రాలేదేమో?
పోలవరం ప్రాజెక్టు వద్ద చంద్రబాబు బాధతో మాట్లాడినట్లు నాటకాలు ఆడాడు. మహానటుడు ఎన్టీ రామారావును మించి చంద్రబాబు నటిస్తున్నాడు.

పోలవరానికి చంద్రబాబే శాపం:
ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉందని ఇప్పుడు పదే పదే చెబుతున్న చంద్రబాబు, 1995 నుంచి 2004 వరకు అధికారంలో ఉండి, ఏరోజు కూడా పోలవరంపై ఒక్క మాట మాట్లాడలేదు.
కానీ ఇవాళ ఏమంటున్నాడు?. పోలవరం ప్రాజెక్టు తన బ్రెయిన్‌ ఛైల్డ్‌ అని, దాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లానని పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు.
అసలు పోలవరం ప్రాజెక్టును చేపట్టింది వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిగారు. ఆయన హయాంలోనే పనులు మొదలయ్యాయి. వేగంగా ముందుకు సాగాయి. ఆయన మరణించినా కూడా ప్రాజెక్టును బతికించారు. ఆ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. అలాంటి జాతీయ ప్రాజెక్టును చంద్రబాబు, మళ్లీ అధికారంలోకి వచ్చాక ఎంత చేయాలో అంత సర్వనాశనం చేశారు.

నవయుగను తప్పించారనే రామోజీ విషం:
అదే చంద్రబాబు ఈరోజు ప్రాజెక్టుల పర్యటన పేరుతో డిజిటల్‌ ప్రజెంటేషన్స్‌ ఇస్తూ.. అద్భుతంగా నటిస్తూ.. ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం..
చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను నవయుగ కంపెనీకి ఇస్తే.. మా ప్రభుత్వం వచ్చాక, రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లి, మరో కంపెనీకి తక్కువ వ్యయానికే ఇవ్వడం జరిగింది.
దీంతో చంద్రబాబుతో పాటు, రామోజీరావు ఇద్దరూ రంగంలోకి దిగారు. ఎందుకంటే, నవయుగ కంపెనీ రామోజీరావు బంధువుది. తమకు దోచుకునే అవకాశం లేకుండా పోవడంతో.. ప్రభుత్వం మీద రామోజీ విషం కక్కుతూ.. ఇష్టం వచ్చినట్లు అడ్డగోలు వార్తలు రాస్తున్నారు.
ఇంక ఆయన తమ్ముడు, రాధాకృష్ణ కూడా జత కట్టాడు. ఇద్దరూ కలిసి రోజూ విషం కక్కుతున్నారు. తమ పత్రికల్లో రోజూ తప్పడు వార్తలు రాస్తున్నారు. బురద చల్లుతున్నారు.
ఈరోజు ఈనాడులో అలాగే విషం కక్కుతూ రాశారు. అంచనాలు పెంచి, అయిన వాళ్లకు పంచారంటూ రాశారు. రూ.1194 కోట్ల పనులు షిరిడిసాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కంపెనీకి పనులు ఇచ్చామని రాశారు.

మాతో సంబంధం ఉంటే కాంగ్రెస్ లో ఎందుకు చేరతారు?:
నిజానికి గతంలో ఆ పని చేసింది చంద్రబాబు. అంచనాలు పెంచి, సొంత మనుషులకు నామినేషన్‌ విధానంలో పనులిచ్చింది, దోచుకుంది.. చంద్రబాబు హయాంలో. అందుకే ఆ రాతలన్నీ ఆయనకే వర్తిస్తాయి తప్ప, జగన్‌గారికి కాదు. చంద్రబాబు తన హయాంలో రామోజీరావుకు ఆ విధంగా దోచి పెట్టాడు.
జగన్‌గారు సీఎం అయిన వెంటనే, రివర్స్‌ టెండరింగ్‌ విధానం తీసుకొచ్చారు. ఆ విధంగా ప్రాజెక్టుల వ్యయాన్ని తగ్గిస్తున్నారు. పూర్తి పారదర్శకంగా దీన్ని అమలు చేస్తున్నారు. రూ.100 కోట్లకు పైబడిన పనులుంటే, రిటైర్డ్‌ జడ్జి రివ్యూకు పంపిస్తున్నారు.
అయితే దీంట్లో చాలా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయని మాపై నింద మోపుతున్నారు. ఎందుకంటే వారి హయాంలో ఆ విధంగా యథేచ్ఛగా దోచుకున్నారు కాబట్టి.. మా ప్రభుత్వాన్ని నిందిస్తూ, విషం కక్కుతున్నారు.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మా బంధువు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో పొంగులేటి మా ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరారు. మరి ఈనాడు రాస్తున్నట్లు.. వైయస్సార్‌సీపీకి, బీఆర్‌ఎస్‌కు దగ్గరి సంబంధాలు ఉంటే.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలి కానీ, కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్లారు?.

బంధువులకు కాంట్రక్టులు ఇచ్చి దోచుకుంది మీరే..:
నిజానికి చంద్రబాబు కేవలం నామినేషన్‌ విధానంలో పనులు ఇచ్చిన నవయుగ కంపెనీ, రామోజీరావు దగ్గరి బంధువులది. అదే విధంగా పుట్టా సుధాకర్‌యాదవ్‌. ఆయన యనమల రామకృష్ణుడి బంధువు. ఆయనకు కూడా పోలవరంలో పనులిచ్చారు. ఆ విధంగా దోచుకునే పని చేశారు. అలా దోచుకునే పనులు చేసింది వైయస్సార్‌సీపీ కాదు. కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే.
కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఇక సీఎం రమేశ్‌. ఆయనను చంద్రబాబే బీజేపీలోకి పంపాడు. ఆయనకూ కాంట్రాక్ట్‌ పనులు ఇచ్చాడు. ఆ విధంగా వ్యయం పెంచుకోవడం, పనులు పంచుకోవడం, దోచుకునే పనులన్నీ చంద్రబాబు చేశారు. మేము కాదు.
అదే మేము ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తుంటే, ప్రజల మనస్సుల్లో అపోహలు సృష్టించేలా మొదటి పేజీల్లో వార్తలు రాస్తున్నారు.

టీడీపీ హయాంలో యథేచ్ఛ దోపిడి:
అసలు దోచుకోవడం అంటే ఏమిటి? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా, గోదావరి పుష్కరాల పనుల కోసం దాదాపు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసి, నామినేషన్‌ విధానంలో పనులిచ్చారు. నీరు–చెట్టు కార్యక్రమం కింద దాదాపు రూ.14 వేల కోట్లు ఖర్చు చేశారు. ఆ పనులను కూడా నామినేషన్‌ విధానంలో ఇచ్చారు. ఆ విధంగా సమయాన్ని, డబ్బును దోచుకున్నారు.

ప్రజలు నమ్మొద్దు:
ఆ విధంగా అన్ని చేసిన మీరు, ఈరోజు మా ప్రభుత్వంపై నిందలు వేస్తూ.. నిత్యం బురద చల్లుతున్నారు. టెండర్‌ తక్కువకు కోట్‌ ఇస్తే.. వారికి పనులు వచ్చి ఉండొచ్చు. అంతేకానీ, ఎక్కడా దోపిడికి తావు లేదు. మేము ఎప్పటికీ ఆ పని చేయబోము. కాబట్టి ప్రజలు ఇలాంటి దుర్మార్గమైన వార్తలు నమ్మొద్దని కోరుతున్నాం.

చిత్తశుద్ధితో పోలవరం పనులు:

చంద్రబాబు ఎక్కడైనా తిరగనీయండి. మాకేమిటి అభ్యంతరం?
పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లిస్తున్నాం. అవకాశం ఉన్నంత వరకు రాయలసీమకు నీరిస్తాం.
చంద్రబాబు సమయంలో.. 2013–14 రేట్ల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తామని, చెప్పారు. అదే విషయాన్ని కేంద్రానికి కూడా చెప్పారు. ఆ తర్వాత అంచనాలు చాలా పెరిగాయి. అదే కేంద్రానికి నివేదించాం. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన రూ. 20 వేల కోట్లు అయిపోయాయి. ఇంకా 41.15 మీటర్లకు సంబంధించి ఇంకా రూ.19 వేల కోట్ల కోసం ప్రతిపాదనలు పంపగా.. దాంట్లో రూ. 12,911 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ప్రాథమికంగా అంగీకరించింది.
ఇప్పుడు ప్రాజెక్టు పనులను చేస్తామన్న మా ప్రభుత్వం, అదే మాటకు కట్టుబడి పని చేస్తోంది.

బాబు చరిత్రాత్మక తప్పులు:
పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చారిత్మక తప్పులు చేశారు.
– ప్రాజెక్టును తామే కడతామని తీసుకోవడం చంద్రబాబు చేసిన తొలి తప్పు.
– 2013–14 రేట్ల ప్రకారమే, ప్రాజెక్టును పూర్తి చేస్తానని 2016లో పనులు తీసుకోవడం మరో తప్పు.
– ఇంకో తప్పు అందరికీ తెలుసు. డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం. కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేయకుండా డయాఫ్రమ్‌ వాల్‌ కట్టడం.

అందుకు కారణం..:
ఇవన్నీ చంద్రబాబు ఎందుకు చేశారంటే.. ప్రాజెక్టు పనుల పేరుతో దోచుకోవడమే. తనకు కావాల్సిన రామోజీరావుకు, రాయపాటి సాంబశివరావుకు పనులు అప్పగించడం కోసమే. అలా ప్రాజెక్టును నిండా ముంచేశాడు.
రూ. 20 వేల కోట్లతో పోలవరం పనులు పూర్తి చేస్తామని 2016లో అప్పటి ప్రభుత్వం తీసుకుంది. కానీ 2017–18 అంచనాల ప్రకారం ఆ ప్రాజెక్టుకు రూ. 55 వేల కోట్లు కావాలి. ఇప్పుడు మళ్లీ రేట్లు పెరిగాయి కాబట్టి, రూ. 55 వేల కోట్లు కూడా సరిపోవు. వ్యయం పెరుగుతుంది. అంచనాలు కూడా పంపాం.

బాబే పోలీసులపై దాడి చేయించారు:
పుంగనూరులో చంద్రబాబు మీద హత్యాయత్నం అసలు జరగలేదు. చంద్రబాబు వర్గీయులే అక్కడ పోలీసులపై దాడి చేశారు. దాంతో చాలా మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. చివరకు ఒక పోలీస్‌ కళ్లు కూడా పోయాయి.
పోలీసులు చేసిన నేరం ఏమిటి? వారి డ్యూటీ వారు చేశారు? వారిపై దాడి చేసి, తీవ్రంగా గాయపర్చడం ఏమిటి? రాళ్లు, కర్రలు, రాడ్లతో పోలీసులను కొట్టారు. చాలా మంది పోలీసులు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రుల్లో ఉన్నారు. నిన్నేం చేయాలి?

బాబుపై కేసు పెట్టకపోతే రాజ్యాంగం, చట్టం అమలు కానట్టే..:
చంద్రబాబుకు అధికారం ఉంటే శాంతి కావాలి. అధికారంలో లేకపోతే హింస కావాలి. పర్మిషన్‌ లేకుండా పుంగనూరుకు ఎందుకు వెళ్లాలనుకున్నావ్‌? సిగ్గుందా నీకు? దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నావ్‌? రెచ్చగొట్టి పోలీసుల మీద దాడి చేయించావ్‌? నీపై కేసు పెట్టడం తప్పా?
అన్ని చేసిన నీపై కేసు పెట్టకపోతే, రాజ్యాంగం అమలు కానట్లే. చట్టం లేనట్లే. అందుకే చంద్రబాబుపై కేసు పెట్టడం పూర్తిగా సమంజసం. చట్టం ముందు అందరూ సమానులే. ఇంకా చెప్పాలంటే చంద్రబాబును చట్టప్రకారం శిక్షించాలి. దుష్ట శక్తులను ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన అవసరం ఉంది. చట్టానికి ఎవరూ అతీతులు కారు.
అసలు ఏమున్నాయని మా అక్రమాలు బయట పెట్టడానికి? ఇప్పటి వరకు అలా ఏమైనా చేయగలిగాడా? పోలీస్‌ ఆర్డర్‌ను కాదని, పుంగనూరుకు వెళ్లాలని ఎందుకు అనుకున్నావ్‌? పోలీసుల మీద రాళ్ల దాడి చేస్తే.. ఇంకా వేయండి అని రెచ్చగొడతావా? చట్టానికి అతీతంగా వ్యవహరిస్తే, పోలీసుల మీద దాడి చేసి కొడితే.. చర్యలు తప్పవు.

ఆ పిచ్చుక నాపై బ్రహ్మాస్త్రమా?:
చిరంజీవిగారు అంటే మాకు గౌరవం. సామాన్య కుటుంబంలో పుట్టినా ఎంతో ఎత్తుకు ఎదిగారు. సొంత పార్టీ పెట్టి దెబ్బ తిన్నారు.
కానీ, ఆయన ఏం మాట్లాడుతున్నారు?
పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ఎందుకంటూ.. సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. మమ్మల్ని అంటున్నారు. అది ధర్మమేనా? సినీ పరిశ్రమ పిచ్చుక వంటిదా?. మరి ఆ పిచ్చుక నా మీద బ్రహ్మాస్త్రం వేయొచ్చా? మీరే చెప్పండి.

ధర్మాన్నే చెప్పమన్నాను:
మీ బ్రదర్‌ సినిమాలో నా పాత్ర ఎందుకు పెట్టారు? పెట్టలేదా చెప్పండి. ఆ సినిమాను తానే వదిలానని అందులో హీరో అయిన మీ తమ్ముడు స్వయంగా చెప్పారు. మరి మీరేందుకు మాట్లాడుతున్నారు.తమ్ముడు తన వాడైనా ధర్మం ధర్మమే. దాన్నే చెప్పమని అని నేను చెప్పా.
నేను మళ్లీ చెబుతున్నాను.పవన్‌కళ్యాణ్, చంద్రబాబు విడిపోయి పోటీ చేస్తున్నప్పుడు చిరంజీవి చంద్రబాబును తిడతాడు. వారిద్దరూ కలిసి పోటీ చేస్తే.. ఏమీ అనడు. మమ్మల్ని అంటాడు.

నన్ను గోకితే ఊర్కోను:
నన్ను గోకారు. ఔనా? కాదా?. నన్ను ఎవరు గోకినా ఊరికే ఉండలేను. నోరు మూస్కుని అసలు కూర్చోను. అది నాకు పుట్టుకతో వచ్చిన బుద్ధి. అది ఎప్పటికీ పోదు. అందుకే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను.

చిరంజీవిగారంటే గౌరవం:
నాకు చిరంజీవి అంటే గౌరవం. ఎందుకంటే.. చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడకు ఇబ్బంది కలిగినప్పుడు.. నేను, బొత్స సత్యనారాయణగారు ఆహ్వానిస్తే.. దాసరితో విభేదాలు ఉన్నప్పటికీ, చిరంజీవి ఆయనతో కలిసి వచ్చారు. హయత్‌ హోటల్‌లో మాట్లాడారు. చంద్రబాబు మీద స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అందుకే ఆయనంటే నాకు గౌరవం.
మరి ఇవాళ ఎవరికి ఇబ్బంది వచ్చింది. నాకు ఇబ్బంది వచ్చింది కాబట్టి నా గురించి మాట్లాడాలి. నాపై బ్రహ్మాస్త్రం వేశారు. నేను స్పందించొద్దా? మాట్లాడొద్దా? అలా కాకుండా తమ్ముడిని సమర్థిస్తూ, ధర్మం వీడొద్దు.
బ్రో సినిమాలో నా మీద సాంగ్‌ పెట్టారా? లేదా? చెప్పండి. నా మాదిరిగా డ్రెస్‌ వేయించి, ఒక నటుడితో డ్యాన్స్‌ చేయించారు.
ఇది వాస్తవమా? కాదా? నన్ను కించపర్చాలని పెట్టారా? లేక నేను భ్రమ పడ్డానా? మీరే చెప్పండి.

సినిమా పరిశ్రమపై యుద్ధం కాదు.. బ్రో పైనే..:
నన్ను కించపర్చాలని పెడితే, నేను మాట్లాడినవన్నీ రైట్‌. కాదా? చెప్పండి. నన్ను గోకారు కాబట్టి, స్పందించాను. ఇదేమీ యుద్ధం కాదు. సినిమా పరిశ్రమపై యుద్ధం నా అభిమతం కాదు. నా ఉద్దేశం అది కానే కాదు. నాకు ఆ అవసరం కూడా లేదు.
నేను కేవలం బ్రో సినిమా గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నాకు వేరే సినిమాలు, సినీ పరిశ్రమతో మరే సంబంధం లేదు. నేను సినీ పరిశ్రమలో వేరే ఎవరి గురించి మాట్లాడడం లేదు.

రెమ్యునరేషన్ ఎంతో చెప్పనప్పుడు ఆ ఉపన్యాసాలొద్దు:
నీవు (పవన్‌కళ్యాణ్‌) తీసుకునే రెమ్యునరేషన్‌ గురించి చెప్పనప్పుడు, నీతి, నిజాయితీ, పారదర్శకత గురించి నీకు మాట్లాడే అర్హత లేదు. భగత్‌సింగ్, చెగువేరా గురించి ప్రస్తావించొద్దు. ధర్మం, అధర్మం అంటూ ఉపన్యాసాలు చేయొద్దు.
అఫీషియల్‌గా కొంత. అనఫీషియల్‌గా చాలా. అదే నీ రెమ్యునరేషన్‌. అలాంటి నీవు నాపై విమర్శలు చేయడమా? నా క్యారెక్టర్‌ను సినిమాలో పెట్టి, విమర్శించడమా? మళ్లీ చెబుతున్నా. నన్ను గెలికితే ఊర్కోను.. అని మంత్రి రాంబాబు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE