Suryaa.co.in

Andhra Pradesh

వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబును మించిన వారెవరు..?

ఆధారాలు న్యాయస్థానాల్లో పెడతారు కానీ..లోకేశ్ ముందు పెట్టరు
ఏ తప్పూ చేయకపోతే మీ నాన్నను కోర్టు ఎందుకు జైల్లో పెడుతుంది?
ఇన్నాళ్లూ దొరకలేదు కాబట్టి బాబు దొరై పోడు
అడ్డంగా దొరికి కూడా అడ్డగోలుగా అరుపులేంటి లోకేశ్
మంత్రి గుడివాడ అమర్నాథ్

రుజువులు న్యాయస్థానాలకు ఇస్తారు కానీ దొంగలకు ఇవ్వరు లోకేశ్
రాజమండ్రి జైలులో చంద్రబాబుతో లోకేశ్ ములాఖత్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై లోకేశ్‌ పలు విమర్శలు చేశారు. చంద్రబాబును జైల్లో పెట్టి 50 రోజులు దాటింది. ఇప్పటికీ ఏం సాక్ష్యాలు లేవని, వ్యవస్థలు మేనేజ్‌ చేస్తున్నారని లోకేశ్‌ విమర్శిస్తున్నాడు. చంద్రబాబును అరెస్టు చేసిన తరువాత అనేక న్యాయస్థానాల మెట్లు ఎక్కారు.

ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏం జరిగిందో, ఏ వాదనలు వినిపించారో.. ఎలాంటి ఫలితం వచ్చిందో ప్రజలంతా చూశారు. చంద్రబాబు చేసిన స్కిల్‌ స్కాం సంబంధించిన రుజువులు న్యాయస్థానాలకు ఇస్తారు కానీ.. దొంగలకు ఇవ్వరు. రాష్ట్ర ఖజానా నుంచి రూ.370 కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు అప్పనంగా కొట్టేశారు.

13 చోట్ల చంద్రబాబు సంతకాలున్నాయ్‌
స్కిల్‌ స్కాంలో 13 చోట్ల చంద్రబాబు చేసిన సంతకాలను దర్యాప్తు సంస్థ గుర్తించింది. అంతకంటే రుజువులు ఏమి కావాలి? అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాడో కూడా స్పష్టంగా ప్రజలకు వివరించాం. సీమెన్స్ సంస్థ పేరిట చంద్రబాబు స్కాం చేశారు. చివరకు, సీమెన్స్ సంస్థే ఈ స్కాంకు, తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. ఇంత పెద్ద ఎత్తున చంద్రబాబు అవినీతి చేస్తే రుజువులు ఉంటే చూపించండని లోకేశ్ చెప్పటం ఏమిటి? దర్యాప్తు సంస్థ న్యాయస్థానాల్లో 4వేల పేజీల రిపోర్టు సమర్పించింది. 130-140 మంది వాంగ్మూలాలను తీసుకున్నారు.

అక్రమ అరెస్ట్ అంటారు తప్ప… తప్పు చేయలేదనే మాట మాట్లాడరు
స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం రూ.300 కోట్లు కడితే.. సీమెన్స్ సంస్థ రూ.3000 కోట్లు పెడుతుందనే పేరుతో స్కాంకు తెరలేపారు. అసలు.. ఈ సంస్థకూ.. మాకూ ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి ప్రాజెక్టులు లేవని సీమెన్స్ సంస్థే చెప్పింది. స్కిల్‌ స్కాంలో డబ్బులు కొట్టేసి.. ఆస్తులు కూడబెట్టుకుని దొంగ దొరికిపోయాడు. ఇప్పుడు రుజువులు, సాక్ష్యాలు చూపించండి. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారని అనటం ఏమిటి?

ఏమీ తప్పు చేయకపోతే 50 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఎందుకు ఉంటారు. ఏ కోర్టుకు వెళ్లినా సెక్షన్ 17(ఏ) అంటారు తప్ప తప్పు చేయలేదని ఎందుకు వాదించటం లేదు. 2018లో వచ్చిన 17(ఏ) ప్రకారం గవర్నర్‌ అనుమతితో చంద్రబాబు అరెస్టు చేయలేదని.. లోకేశ్, భువనేశ్వరి, టీడీపీ వాళ్లు అంటారు తప్ప తప్పు చేయలేదనే మాట మాత్రం మాట్లాడరు. 2014-16 మధ్యలో స్కిల్ స్కాంను చంద్రబాబు చేశారు. 2018 తర్వాత 17(ఏ) వర్తిస్తుంది తప్ప.. దానికంటే ముందు చేసిన వాటికి వర్తించదని న్యాయస్థానాలు చెబుతున్నా 17(ఏ) పట్టుకుని వేలాడుతున్నారు.

అడ్డంగా దొరికి అడ్డగోలుగా అరుపులేంటి లోకేశ్
స్కిల్ డెవలప్‌మెంట్‌ విషయంలో కేబినెట్ అనుమతి లేకుండా కార్పొరేషన్ స్థాపించారు. ట్రై పార్టీ అగ్రిమెంట్లకు అమలు చేసిన వ్యవహారాలకు అసలు సంబంధమే లేదు. డిజైన్‌టెక్‌ అనే కంపెనీ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. అప్పటివరకు లేని కంపెనీని అప్పుడే పుట్టిస్తారు. డబ్బులు రూట్ చేసుకుని హైదరాబాద్‌లోని చంద్రబాబు జుబ్లీహిల్స్‌ ప్యాలెస్‌కు మళ్లించారు. ఇదీ జరిగింది. వచ్చిన డబ్బును వాడేసుకున్నారో.. ఆస్తులు కూడబెట్టుకున్నారో.. ఎన్నికల ఖర్చు పెట్టుకున్నారో గానీ.. ప్రజాధనాన్ని చంద్రబాబు కోట్టేశాడు. ఇంత స్పష్టంగా బయటపడ్డాక.. కూడా లోకేశ్‌ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని పెద్ద పెద్ద అరుపులు అరవడం విడ్డూరంగా ఉంది.

వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబు తరువాతే ఎవరైనా?
40 ఏళ్లుగా చంద్రబాబు కంటే బాగా వ్యవస్థలను మేనేజ్ చేయగల వ్యక్తి ఎవరైనా దేశంలో, ప్రపంచంలో ఉన్నారా? బాబు కంటే బాగా తెలిసిన వ్యక్తిని ఒకరు చెప్పండి. చివరకు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. టీడీపీని, టీడీపీ గుర్తును, ట్రస్ట్‌ను కొట్టేశారు. ఏలేరు స్కాం, స్టాంపుల కుంభకోణం, ఓటుకు నోటు కేసు వరకు ఎలా తప్పించుకు తిరిగారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పటి వరకు దొరకలేదు కాబట్టి దొరనని.. దొరికాను కాబట్టి దొంగను అంటే కుదరదు. మొదట నుంచి దొంగవే. మొదట నుంచి దొంగ పనులు చేస్తూనే ఉన్నావు. దానికి ఈరోజు అనుభవిస్తున్నావు.

దొంగను ఎవరైనా ఎక్కడైనా పట్టుకోవచ్చు
లోకేశ్‌ 35 రోజులు ఢిల్లీ ఎందుకు వెళ్లాడు. పైగా అమిత్‌ షానే లోకేశ్‌ను పిలిపించుకున్నాడట. అబద్దాలు చెప్పడంలో లోకేశ్‌ తండ్రిని మించి పోయాడు. లోకేశే పదేపదే అడుగుతుంటే అపాయింట్‌మెంట్ ఇప్పించినట్లు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పారు. ఇన్ని తప్పులు చేసి చంద్రబాబు దొరికిపోయారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఎందుకు ఇచ్చారు? అమరావతి నిర్మాణ కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకున్నట్లు నోటీసులు ఇచ్చారు.

దానికి నోటీసులు ఇవ్వాల్సింది జుబ్లీహిల్స్‌ బ్రాంచ్ వాళ్లు ఇవ్వాలి వేరే ఊరు వాళ్లు ఇవ్వటానికి వీల్లేదని చంద్రబాబు చెబుతారు. ఓ దొంగ అమరావతిలో దొంగతనం చేసి పారిపోతుంటే విజయవాడ పోలీసులు పట్టుకుంటే నన్ను అమరావతి పోలీసులు పట్టుకోవాలని వితండవాదన చేసినట్లు ఐటీ శాఖ నోటీసులపై చంద్రబాబు తీరుంది. దొంగలను ఎవరైనా ఎక్కడైనా పట్టుకుంటారు.

ఐటీ లెక్కలు అడగ్గానే.. శ్రీనివాస్‌ను, మనోజ్‌ను విదేశాలకు పంపించేశారు
ఐటీ శాఖ రూ.118 కోట్లు లెక్కలు అడిగారు. అంతే.. చంద్రబాబు తన పీఎస్‌ శ్రీనివాస్‌ను అమెరికా పంపించారు. మనోజ్ వాసుదేవ్‌ పార్థసాని దుబాయ్‌ వెళ్లిపోయారు. ఈడీ కూడా స్కిల్ స్కాంలో నలుగురిని అరెస్టు చేశారు. ఇంత పెద్ద ఎత్తున సాక్ష్యాలు కనపడుతుంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని అనటం ఏమిటి? ఎవరిని మోసం చేసి సానుభూతి పొందాలని చూస్తున్నారు. ఇప్పుడు దోమలు కుట్టడం లేదు కదా. కోర్టు ఆదేశాలతో ఏసీ కూడా పెట్టారు.

లోకేశ్‌కు కూడా చంద్రబాబు బుద్ధులు వచ్చి ఉండొచ్చు
చంద్రబాబుకు లోకేశ్‌ ద్వారా ముప్పు ఉంటుందేమో కానీ మా ద్వారా ఎటువంటి ముప్పు ఉండదు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణం అయ్యాడు. లోకేశ్‌ కూడా చంద్రబాబులా వ్యవహరిస్తున్నాడనేది మా అనుమానమే తప్ప వేరే ఉద్దేశం లేదు. 100 ఏళ్లు చంద్రబాబు బ్రతకాలి. ఎందుకంటే చంద్రబాబులా ఎవ్వరూ వ్యవహరించవద్దని సమాజానికి చూపించాలి.

సామాజిక సాధికార యాత్ర నుంచి ప్రజల దృష్టి మరల్చటానికే లోకేశ్ వ్యాఖ్యలు
సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలకు చేసిన మేలుపై సామాజిక సాధికార యాత్ర జరుగుతోంది. దీన్ని డైవర్షన్ చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను పట్టించుకోలేదు. ఏనాడూ వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు మేలు చేయలేదు. డీబీటీతో ప్రజలకు జరిగిన రూ.2.38 లక్షల కోట్ల మేలును యాత్ర ద్వారా వైఎస్ఆర్‌సీపీ వివరిస్తోంది. యాత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికి లోకేశ్‌ వ్యాఖ్యలు చేస్తున్నాడు.

పొత్తులు లేకుండా ఏనాడైనా ఎన్నికలకు చంద్రబాబు వచ్చాడా?
చంద్రబాబు తెలిసిన విద్య మేనేజ్‌మెంట్, ఈవెంట్ మేనేజ్‌మెంటే. సొంతంగా ఒక్క ఎన్నికలో అయినా పొత్తు లేకుండా గెలిచి వచ్చాడా? ఎన్టీఆర్‌ నుంచి పార్టీ లాక్కున్న తర్వాత 2019లో మాత్రమే ఒంటరిగా చంద్రబాబు పోటీ చేశాడు. ఒంటరిగా పోటీ చేస్తే చంద్రబాబు బలమేంటో ప్రజలిచ్చిన 23 సీట్లతో స్పష్టమైంది. చివరకు లోకేశ్‌ను కూడా గెలిపించుకోలేకపోయాడు.

జగన్ మీద కేసులు పెట్టినప్పుడు చంద్రబాబు, కాంగ్రెస్‌ పార్టీ కలసి మేనేజ్‌మెంట్ చేశాయి. ఆరోజు చంద్రబాబుకు ఏం అవసరం? ఆ కేసుల్లో ఎందుకు ఎర్రన్నాయుడు, అశోకగజపతిరాజును ఇంప్లీడ్‌ అయ్యారు. చంద్రబాబులా వ్యవస్థలను వాడుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్‌సీపీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం లేవు. ప్రజలకు చేసిన మంచిని, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని చెప్పుకుంటాం తప్ప.. వ్యవస్థలను మేనేజ్ చేసే అవసరం లేదు.

భయాందోళనతోనే లోకేశ్‌ అసందర్భ ప్రేలాపనలు
చంద్రబాబులా బీజేపీకి, కాంగ్రెస్‌కు కన్ను కొడతావు. పక్కన పార్టనర్‌ను పెట్టుకుంటావు. ఇప్పుడు పెద్దమ్మ గారు కూడా సపోర్టు. టీడీపీకి బీజేపీ అనుబంధ విభాగం కింద పనిచేస్తోంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇంతకంటే మేనేజ్‌మెంట్ ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీలో ఉన్న భయాందోళనలు కనపడుతున్నాయి.

వారం రోజుల పాటు బాలకృష్ణ టీడీపీ ఆఫీసులో చంద్రబాబు సీటులో కూర్చున్నాడు. అసెంబ్లీలోనూ చంద్రబాబు సీట్లో నిలబడ్డాడు. చివరకు ఇప్పుడు బాలకృష్ణ సినిమాలు చేసుకుంటున్నాడు. దీనిని బట్టే చంద్రబాబు, లోకేశ్‌కు ఎంత అభద్రతా భావంలో ఉన్నారో అర్ధమవుతోంది. కాకమ్మ కబుర్లు, ప్రజలను పక్కదోవ పట్టించే మాటలు లోకేశ్‌ స్థాయికి అవసరం లేదు. సినిమా డైలాగులు లోకేశ్ మానుకుంటే మంచిది.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ
– దొంగలకు పోలీస్ కాల్‌ డేటాతో ఏం సంబంధం? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నతాధికారులతో మాట్లాడతారు. ఎందుకు టీడీపీ వాళ్లకు ఇవ్వాలి.
– దర్యాప్తు సంస్థ అధికారులు ఎవరెవరితో మాట్లాడారనే విషయాలను తీసుకువచ్చి అసలు విషయాన్ని పక్కదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారు.
– జైలు అధికారులతో మాట్లాడాల్సిన అవసరం సజ్జలకు ఎందుకు ఉంటుంది? ఎప్పుడు లేని జబ్బులు చంద్రబాబుకు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి.
– చంద్రబాబు మాత్రమే కాదు.. జైల్లో ఉన్న ఖైదీల ఆరోగ్యం బాధ్యత కూడా జైలు అధికారులదే. చంద్రబాబు కోసం 24 గంటలూ డాక్టర్ల పర్యవేక్షణ కొనసాగుతోంది.
– ఇంత బాగా ఇంట్లో భార్యాబిడ్డలు కూడా చూసుకుంటారో లేదో? రెండు, మూడు రోజులు జైల్లో ఉంటే కక్షసాధింపు అనుకుంటారు కానీ ఉత్తినే 50 రోజులు జైల్లో ఉంచుతారా?
– చంద్రబాబు తప్పు చేసినట్లు సంతకాలు ఉన్నాయి. అనేక షెల్ కంపెనీల ప్రమేయం ఈ స్కాంలో ఉంది.
– చంద్రబాబు కంటికి, పంటికి.. ఏ వైద్యం అవసరం అయినా అధికారులు చూసుకుంటారు. దానిలో ఎలాంటి అనుమానం వద్దు.

LEAVE A RESPONSE