Suryaa.co.in

Andhra Pradesh

పంట నష్టపోయిన రైతులెవరు? పరిహారం దోచుకున్న దొంగలెవరు?

-పంటల భీమా పరిహారం అంతపుర రహస్యమా? వెబ్ సైట్ లో ఎందుకు చూపటం లేదు?
-సెంటు భూమి లేని వ్యక్తికి రూ. 1.80 లక్షల పరిహారమా ?
-రైతులకు దక్కాల్సిన నష్టపరిహారం జగన్ రెడ్డి ‎ తన పార్టీ తాబేదార్లకు దోచి పెట్టారు
– నక్కా ఆనందబాబు

రైతులకు దక్కాల్సిన పంట నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైసీపీ నాయకులు, కార్యకర్తలకు దోచిపెడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్ర స్ధాయిలో ద్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….

పంట నష్టపోయిన రైతులకు భీమా పరిహారం కింద ప్రభుత్వం విడుదల చేసిన రూ. 2,977 కోట్లు ఏ రైతులకు ఇచ్చారో చెప్పాలి? దీనిపై రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‎అసలు ఏ ప్రాతిపదికన పంట నష్టపరిహారం అంచనా చేశారు? ఇందులో కౌలు రైతులు ఎవరు? రైతులు ఎవరు? వాస్తవంగా పంట నష్టపోయిన రైతులు ఎవరు? పంటల భీమా దోచుకున్న దొంగలెవరో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రైతులకు సమాధానం చెప్పాలి.

15 లక్షల మంది రైతులకు భీమా చెల్లించామని అనంతపురం సభలో ముఖ్యమంత్రి చెప్పారు. ఆ 15 లక్షల మంది ఎవరు? వారి పేర్లు తెలపడానికి ప్రభుత్వానికి ఇబ్బందేంటి? ఇటీవల కాలంలో వరదల వల్ల రూ. 3 వేల కోట్లకుపైగా రైతులు పంట నష్టపోయారు. మరో వైపు మిర్చి రైతులు రూ. 4 వేల కోట్ల పంట నష్టపోయారు. ఉద్యానవన రైతులు రూ. 700 కోట్లు నష్టపోయారు. మొత్తం సుమారు రూ.8 వేల కోట్లు పంట రైతులు నష్టపో‎తే… ‎బీమా పరిహారం కేవలం రూ. 2,97‎0 కోట్లు చెల్లించారు. ఇందులోనూ వాస్తవంగా పంటనష్టపోయిన రైతులకు భీమా ఇవ్వకుండా దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భీమా డబ్బులు పంచుకున్నారు.

అనంతపురం‎ జిల్లాలో సెంటు భూమిలేని వ్యక్తికి రూ. 1.80 లక్షలు భీమా చెల్లించారు. మరో వైపు అదే అనంతపురం జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేకపోయానని‎ వాలంటీర్ తన చెప్పుతో తానే కొట్టుకుని ప్రభుత్వాని వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసే మేలంటే ఇదేనా? ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ది ఇదేనా? అసలు రైతుల భీమా పరిహారం ఏమైనా అంతపురం రహస్యమా? వైసీపీ నాయకులు, తాబేదార్లు, కార్యకర్తలకు రైతుల భీమా దోచిపెట్టారు కాబట్టే ఆ వివరాలు భయటపెట్టడం లేదా? భీమా పరిహారం అందించిన రైతులు పేర్లు తెలపడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేంటి?

భీమా అంటే రైతుకు భరోసాగా ఉండాలి తప్ప వైసీపీ కార్యకర్తలకు దోచిపెట్టడానికి కాదు. భీమా పరిహారం వివరాలు 2020 సంవత్సరం నుంచి వెబ్ సైట్ లో ఎందుకు బహిర్గతం చేయటం లేదు? ‎ ఈ క్రాప్ నమోదులో అక్రమంగా వైసీపీ కార్యకర్తల పేర్లు నమోదు చేసి అక్రమాలకు పాల్పడ్డారు. ఓ వైపు 4.5 లక్షల ఎకరాల్లో మిర్చి రైతులు పంట నష్టపోయారని ‎ప్రభుత్వం చెబుతుంటే ‎మరో వైపు అనంతపురం జిల్లా కలెక్టర్ మాత్రం మిర్చిపంట నష్టానికి వాతావరణానికి సంబందం లేదని, అందువల్లే మిర్చి పంటకు నష్టపరిహారం చెల్లించలేదని చెప్పటం విడ్డూరం. వాతావరణంలో మార్పులు కారణంగా వైరస్ వచ్చి మిర్చి రైతులు రూ. 4 వేల కోట్ల పంట నష్టపోతే పరిహారం చెల్లించకుండా సాకులు చెప్పటానికి ప్రభుత్వానికి సిగ్గనిపించటం లేదా?

వైసీపీ పాలనలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదు, రూ. 3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి అన్నారు ఏమైంది? దళారులు రైతులను నిలువు దోపిడి చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆర్బీకే కేంద్రాలు ఏమయ్యాయి? భీమా పరిహారం ఎవరికి చెల్లించారో గ్రామాల వారీగా అర్హుల జాబితా బహిర్గతం చేయాలని నక్కా ఆనందబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE