1995 నాటి వెన్నుపోటు ‘రామాంజనేయ యుద్ధం’, నందమూరి–నారా కుటుంబ నిర్ణయమన్న చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గురించి ఎవరు చెప్పాలి?
(వి.విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు)
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే రాజకీయపక్షంలోని ఒకటి రెండు కుటుంబాల నిర్ణయాలు, ఆ పార్టీకి అండగా ఉంటున్నానని చెబుతూ సొంత ప్రయోజనాలు పొందే ఓ మీడియా అధిపతి ‘మార్గదర్శనం’ మాత్రమేని ఓటీటీ వేదికగా నడిచిన టాక్ షోలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు సూచిస్తున్నాయి. ఇంకా సూటిగా చెప్పాలంటే–1995 ఆగస్టులో ముఖ్యమంత్రి, టీడీపీ స్థాపకుడు ఎన్.టి.రామారావును గద్దెదించి, తాను ఆ పదవిలోకి వెళ్లడాన్ని ‘నందమూరి–నారా కుటుంబాల ఉమ్మడి నిర్ణయం’ అని చంద్రబాబు గారు, ఆయన వియ్యంకుడు, బావమరిది ఎన్.బాలకృష్ణలు వెల్లడించారు. బహుళ పార్టీల పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాలకపక్షంలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని, అందులోని మెజారిటీ చట్టసభ సభ్యులే నేతను పదవిలో నిలబెడతారని చదువుకున్నాం. చూస్తున్నాం.
టీడీపీ రాజగురువు రాము ఈ విషయంలో చెప్పిన మాటలనే చంద్రబాబు చిలకపలుకుల్లా పలుకుతున్నారా? లేక 27 ఏళ్ల క్రితం తాను చేసిన రాజకీయ ద్రోహాన్ని సమర్ధించుకోవడం ఆయనకు చేతకాలేదా? అనే అనుమానాలు బాబు గారి మాటలు విన్నాక వస్తున్నాయి. టీడీపీ అంటే కేవలం రెండు కుటుంబాల సొంత ఆస్తి అన్నట్టు చంద్రబాబు ప్రకటించడం ఒకవిధంగా తెలుగు ప్రజానీకానికి మేలుచేసినట్టే. ఈ ప్రాంతీయపక్షం ఒక ప్రజాతంత్ర రాజకీయ పార్టీ అని ఇప్పటి దాకా నమ్మిన అమాయకులకు నారా వారి మాటల వల్ల జ్ఞానోదయం అవుతోంది.
ఎన్టీఆర్ ఆశయాన్ని, సిద్ధాంతాల్ని ముందుకు తీసుకెళ్లడానికే తిరుగుబాటా?
‘బయటి నుంచి వచ్చిన వ్యక్తి ప్రభావంలో ఉన్న ఎన్టీఆర్ పై తిరుగుబాటుకు కారణం ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యమే. మేం కావాలని తిరుగుబాటు చేయలేదు,’ అని చెప్పిన మాటలు చంద్రబాబు సంకుచిత, స్వార్ధ స్వభానికి అద్దంపడుతున్నాయి. ఏ మహానేత సిద్ధాంతాలు ముందుకు తీసుకుపోవాలనకుంటున్నారో ఆ నాయకుడినే కుట్ర, వెన్నుపోటుతో గద్దెదించుతారా?
బాబు గారికి ఈ విషయంలో రాజగురువు రాము పాఠాలు లేదా ప్రాంప్టింగ్ సరిగా చెప్పినట్టు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పెద్ద మలుపు తిప్పిన ఈ రెండో ఆగస్టు సంక్షోభం సంభవించిన సమయంలో ‘బయటి నుంచి వచ్చిన వ్యక్తి’ని, ఆ వ్యక్తి ప్రభావాన్ని పేరుతోనే చంద్రబాబు అండ్ కంపెనీ ప్రస్తావించింది. ఇన్నాళ్లకు ఆ వ్యక్తి పేరు చెప్పడానికి ఆయనకు సిగ్గొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ టాక్ షో చూశాక–టీడీపీ రాజకీయ సంక్షోభం మొత్తాన్ని కుటుంబ వ్యవహారంగా చిత్రించడానికి బాబు ప్రయత్నించారని చిన్న పిల్లాడికైనా అర్ధమౌతుంది. నిజానికి ఒక ‘బయటి వ్యక్తి’ని సాకుగా చూపించి తాను ఎప్పటి నుంచో ఆశిస్తున్న ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబు గుంజుకున్నారని కాస్త బుర్ర ఉన్న ఏ తెలుగువాడికైనా అర్ధమౌతుంది. చివరి రోజుల్లో ఎన్టీఆర్ ను కలిసి మాట్లాడే సాహసం చేయలేకపోయిన చంద్రబాబు ఈ టాక్ షోలో ‘ఎన్టీఆర్ నా గుండెల్లో ఉన్న దైవం’ అని చెప్పడం ఆయన నీతిబాహ్య స్వభాన్ని బట్టబయలు చేస్తోంది.
వెన్నుపోటును ‘రామాంజనేయ యుద్ధం’ అనడానికి వెనకాడని నేతను ఏమనాలి?
ఎన్టీఆర్ పై వెన్నుపోటును చంద్రబాబు ‘అది రామాంజనేయయుద్ధం. రాముడి బాటన నడవడానికే ఆంజనేయుడు తన దైవంపై యుద్ధం చేశాడు,’ అని వివరించడం ఆయన దివాళాకోరుతనానికి, అపరాధభావం లేని ఆయన క్రూర మనస్తత్వానికి చక్కటి నిదర్శనం. ఒకప్పుడు తనకు మేలు చేసిన మామ (ఎన్టీఆర్), బావమరిది (హరికృష్ణ), తమ్ముడు (రామ్మూర్తి) వంటి సన్నిహిత కుటుంబసభ్యులకు హాని చేయడానికి వెనకాడని చంద్రబాబు తనను రామబంటు హనుమంతుడితో పోల్చుకుని మాట్లాడం అఖిలాంధ్ర ప్రజానీకానికి దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
ఈ టాక్ షోలో చంద్రబాబు చేసిన మహాపాపం ఏమంటే– ఏమాత్రం పోలిక లేని ద్రావిడ ఉద్యమ పితామహుడు పెరియార్ ఈవీ రామసామి పెళ్లిని నందమూరి తారకరామారావు వైఖరితో పోల్చి చెప్పడం. 70 ఏళ్లు నిండాక నిజంగాగనే నారా వారి మెదడు మొద్దుబారిందని, గుండె రాయిగా మారిందని, ఆయన మానసిక, నైతిక పతనం ‘అన్ స్టాపబుల్’ అని తేలిపోయింది.