Suryaa.co.in

Andhra Pradesh

టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవో వెంకన్న చౌదరిలలో ఎవరు బాధ్యత తీసుకుంటారు?

– చైర్మన్‌ మాటలు సిగ్గుచేటు
– సనాతనవాదులు ఇప్పుడేం చేస్తారో చూస్తాం
– విశాఖపట్నంలోని వైయస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్ల జారీకి ఏర్పాటు చేసిన క్యూలైన్లలో తీవ్ర తొక్కిసలాట, ఆరుగురి దుర్మరణానికి సీఎం, టీటీడీ ఉన్నతాధికారులు, కలెక్టర్, ఎస్పీదే బాధ్యత అని వైయస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు తరలివస్తారని తెలిసి కూడా, టోకెన్ల జారీలో తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైన కారణంగానే ఈ తొక్కిసలాట ఘటన జరిగింది. భక్తులు ఏమైపోయినా పర్లేదని భావించారా? ఇటువంటి ఘటనలు జరిగితే జగన్‌ మీద తోసేయొచ్చన్న ధీమానా? మంచి జరిగితే మన ఖాతాలో, చెడు జరిగితే జగనే కారణం అన్నట్టుగా గత ఏడు నెలలుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

రెవెన్యూ, పోలీస్, ఇంటిలిజెన్స్‌ విభాగాలన్నీ ఏమైపోయాయి. భక్తుల ప్రాణాల విషయంలో ఎందుకింత అలసత్వంగా వ్యవహరించారు. ఈ నిర్లక్ష్యానికి సీఎం, టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవో వెంకన్న చౌదరిలలో ఎవరు బాధ్యత తీసుకుంటారు?

చరిత్రలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా వాడుకోలేకపోవడం బాధాకరం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్సీపీ స్పష్టంగా చెబుతోంది. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని తాను ముందే ఊహించానని, పోలీసు అధికారులను ఆ మేరకు హెచ్చరించానని టీటీడీ ఛైర్మన్‌ చెప్పడం హేయం. దీన్ని బట్టి పేరుకే ఆయన చైర్మన్‌ అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చైర్మన్‌ మాటలు సిగ్గుచేటు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలి..

తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి చొప్పున, గాయపడిన వారికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భక్తుల నుంచి వచ్చిన విన్నపాలను పరిగణలోకి తీసుకుని పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించడం జరిగింది. టోకెన్ల జారీతో పాటు భక్తుల ఏర్పాట్ల విషయంలో పటిష్టమైన ఏర్పాట్లు చేసి ఒక్క చిన్న దుర్ఘటన కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.

హిందువుల మనోభావాలను గౌరవించి తిరుమల ప్రతిష్టను పెంచేలా వైఎస్‌ జగన్‌ వ్యవహరిస్తే, కూటమి ప్రభుత్వం మాత్రం తిరుమల పవిత్రతను మంట గలిపేలా ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తోంది.

లడ్డూ విషయంలో ప్రాయశ్చిత్త దీక్షలు చేసిన సనాతనవాదులు ఇప్పుడేం చేస్తారో చూస్తాం. ఈ ఘటనకు ఏం సమాధానం చెప్తారో ప్రజలు అడుగుతున్నారు. ఎవర్ని బాధ్యుల్ని చేస్తారోనని ప్రశ్నిస్తున్నారు.

LEAVE A RESPONSE